గౌరీ హంతకుడు పరశురామ్‌ వాగ్మారే

Parashuram Waghmare Killed Gauri Lankesh - Sakshi

నటుడు గిరీశ్‌ కర్నాడ్, రచయిత భగవాన్‌ల హత్యకూ స్కెచ్‌

కేసు వివరాలను వెల్లడించిన సిట్‌

బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ను పరశురామ్‌ వాగ్మారే అనే దుండగుడు తుపాకీతో కాల్చిచంపాడని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్‌ చేసిన ఆరుగురు నిందితుల్లో వాగ్మారే ఒకడన్నారు. హేతువాదులు గోవింద్‌ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గీల హత్యకు వాడిన తుపాకీనే లంకేశ్‌ను చంపేందుకు దుండగులు వినియోగించారని స్పష్టం చేశారు. తుపాకీతో కాల్చినప్పుడు బుల్లెట్‌ వెనుకభాగంలో ఏర్పడ్డ ఒకేరకమైన గుర్తుల ఆధారంగా దీన్ని నిర్ధారించామన్నారు. ఈ హత్యలకు వాడిన తుపాకీని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు.

లంకేశ్‌ హత్యకు నిందితులు ఆరు నెలల నుంచి ఏడాది పాటు పథకం రచించారన్నారు. కన్నడ రచయిత కేఎస్‌ భగవాన్, ప్రముఖ నటుడు గిరీశ్‌ కర్నాడ్‌ల హత్యకూ ఈ గ్యాంగ్‌ రెక్కీ పూర్తి చేసిందనీ, ఇంతలోనే పోలీసులు వీరిని అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. లంకేశ్, కల్బుర్గీ, పన్సారేల హత్య వెనుక అతిపెద్ద గ్యాంగ్‌ ఉందనీ, దాదాపు 60 మందితో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్‌ విస్తరించిఉందని పేర్కొన్నారు.

పోలీసులు అరెస్ట్‌చేసిన ప్రవీణ్‌ అలియాస్‌ సుజిత్‌ కుమార్‌ హిందూ జాగృతి సమితి, సనాతన సంస్థ వంటి అతివాద హిందుత్వ సంస్థల నుంచి ఈ గ్యాంగ్‌ సభ్యుల్ని ఎంపిక చేశాడన్నారు. ప్రవీణ్‌ ఏర్పాటుచేసిన గ్యాంగ్‌కు ఎలాంటి పేరు పెట్టలేదన్నారు.  కర్నాడ్‌తో పాటు హిందుత్వ ఎజెండాను వ్యతిరేకిస్తున్న రచయిత బి.టి.లలిత నాయక్, హేతువాది సి.డి.ద్వారకనాథ్, నిడుమామిడి మఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామీజీని హతమార్చేందుకు వీరు తయారుచేసిన హిట్‌లిస్ట్‌ పోలీసుల తనిఖీల్లో లభ్యమైందన్నారు. బెంగళూరులోని స్వగృహంలో లంకేశ్‌ను గతేడాది సెప్టెంబర్‌ 5న దుండుగులు తుపాకీతో కాల్చిచంపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top