Journalist Gauri Lakesh murder
-
గౌరీ హంతకుడు పరశురామ్ వాగ్మారే
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను పరశురామ్ వాగ్మారే అనే దుండగుడు తుపాకీతో కాల్చిచంపాడని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితుల్లో వాగ్మారే ఒకడన్నారు. హేతువాదులు గోవింద్ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గీల హత్యకు వాడిన తుపాకీనే లంకేశ్‌ను చంపేందుకు దుండగులు వినియోగించారని స్పష్టం చేశారు. తుపాకీతో కాల్చినప్పుడు బుల్లెట్ వెనుకభాగంలో ఏర్పడ్డ ఒకేరకమైన గుర్తుల ఆధారంగా దీన్ని నిర్ధారించామన్నారు. ఈ హత్యలకు వాడిన తుపాకీని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు. లంకేశ్ హత్యకు నిందితులు ఆరు నెలల నుంచి ఏడాది పాటు పథకం రచించారన్నారు. కన్నడ రచయిత కేఎస్ భగవాన్, ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్‌ల హత్యకూ ఈ గ్యాంగ్ రెక్కీ పూర్తి చేసిందనీ, ఇంతలోనే పోలీసులు వీరిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. లంకేశ్, కల్బుర్గీ, పన్సారేల హత్య వెనుక అతిపెద్ద గ్యాంగ్ ఉందనీ, దాదాపు 60 మందితో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ విస్తరించిఉందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్‌చేసిన ప్రవీణ్ అలియాస్ సుజిత్ కుమార్ హిందూ జాగృతి సమితి, సనాతన సంస్థ వంటి అతివాద హిందుత్వ సంస్థల నుంచి ఈ గ్యాంగ్ సభ్యుల్ని ఎంపిక చేశాడన్నారు. ప్రవీణ్ ఏర్పాటుచేసిన గ్యాంగ్‌కు ఎలాంటి పేరు పెట్టలేదన్నారు. కర్నాడ్‌తో పాటు హిందుత్వ ఎజెండాను వ్యతిరేకిస్తున్న రచయిత బి.టి.లలిత నాయక్, హేతువాది సి.డి.ద్వారకనాథ్, నిడుమామిడి మఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామీజీని హతమార్చేందుకు వీరు తయారుచేసిన హిట్‌లిస్ట్ పోలీసుల తనిఖీల్లో లభ్యమైందన్నారు. బెంగళూరులోని స్వగృహంలో లంకేశ్‌ను గతేడాది సెప్టెంబర్ 5న దుండుగులు తుపాకీతో కాల్చిచంపారు. -
గౌరీ హత్యపై రాజకీయం
-
గౌరీ హత్యపై రాజకీయం
రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ► లంకేశ్‌కు సిద్ధరామయ్య భద్రత కల్పించలేదని విమర్శ ► నిందితుల ఆచూకీపై రూ. 10 లక్షల రివార్డు బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసుపై రాజకీయ వేడి రాజుకుంది. హత్యకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కేసు విచారణలో ముందడుగు పడకుండా అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించింది. నక్సలైట్ల నుంచి ముప్పుందని గౌరీ సోదరుడు చెప్పినా.. భద్రత ఇవ్వటంలో కర్ణాటక సర్కారు విఫలమైందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. కాగా, గౌరీ హంతకుల ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. నిష్పాక్షిక విచారణ సాధ్యమేనా?: గౌరీ హత్య దురదృష్టకరమని అయితే.. పూర్తి విచారణ జరగకుండానే అనుచిత విమర్శలు చేయటం సరికాదని రవిశంకర్ అన్నారు. మావోలను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. వారి నుంచి గౌరీకి హెచ్చరికలు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘నక్సలైట్లను సరెండర్ చేసేందుకు ఆమె ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారా? ఇది నిజమే అయితే.. ఆమెకు భద్రత ఎందుకు కల్పించలేదు’ అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఈ ఘటనపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిష్పాక్షిక విచారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. శాంతిభద్రతల వైఫల్యంపై ఆ పార్టీ సీఎంను అడగాలని సూచించారు. గౌరీకి భద్రత కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న రవిశంకర్ వ్యాఖ్యలను కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి ఖండించారు. గౌరీ హత్యను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఖండించారు. ‘ఇలాంటి ఘటనకు భారత్‌లో జరగొద్దు. ఇది నా భారతం కాదు’ అన్నారు.