వూహాన్‌ను అధిగమించిన ముంబై

Mumbai Cross Wuhan In Corona Cases - Sakshi

ప్రమాదకర స్థాయిలో వైరస్‌ విజృంభణ

సాక్షి, ముంబై : ప్రాణాంతక కరోనా వైరస్‌ ‌విజృంభణతో దేశ అర్థిక రాజధాని ముంబై అతలాకుతలమవుతోంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమించిన మహారాష్ట్ర.. తాజాగా మరో అపఖ్యాతిని మూటకట్టుకుంది. వైరస్‌ పురుడుపోసుకున్న చైనాలోని వూహాన్‌ నగరాన్ని ముంబై మహానగరం అధిగమించింది. వూహాన్‌లో మొత్తం  50,333, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3,869 మంది మృత్యువాత పడ్డారు. తాజా గణాంకాల ప్రకారం ముంబైలో 51,000 కేసులు నిర్ధారణ కాగా, 1,760 మరణించారు. దీంతో ప్రపంచ హాట్‌స్పాట్‌గా నిలిచిన వూహాన్‌ను మించిలా ముంబైలో కరోనా విభృంభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే అక్కడితో పోల్చుకుంటే ముంబైలో మరణాల సంఖ్య కొంత తక్కువగా ఉంటడం ఊరటనిస్తోంది. (మరో పదివేల కేసులు)

గడిచిన 24  గంటల్లో మహారాష్ట్రలో  2,259 కేసులు నిర్ధారణ కాగా.. దేశంలో ఆ సంఖ్య 9,987గా నమోదైంది. ఇక రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉండగా.. భారత్‌లో ఆ సంఖ్య 2 లక్షల 66వేలు దాటింది. మరోవైపు దేశంలో 7466 మరణాలు సంభవించగా.. ఒక్క మహారాష్ట్రలోనే 3,289 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

అయితే వైరస్‌ను కట్టడి చేయడంలో చైనా ప్రభుత్వం ఇప్పటికే విజయంకాగా.. భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజులు గడుస్తున్నా కొద్ది దేశంలో వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. గత వారం వరకు రోజుకూ ఏడువేల చొప్పున నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య తాజాగా పదివేలకు చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక నాలుగో విడత లాక్‌డౌన్‌ అనంతరం ఇచ్చిన సడలింపులతో వైరస్‌ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే జూలై నాటికి దేశ రాజధాని ఢిల్లీ 5లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావచ్చన్న అధికారుల అంచనా ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టనుంది. (అక్కడి నుంచే భారత్‌లోకి కరోనా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top