చైనాతో తొలగుతున్న ఉద్రిక్తతలు | Sakshi
Sakshi News home page

చైనాతో తొలగుతున్న ఉద్రిక్తతలు

Published Thu, Jun 11 2020 1:57 AM

Major General Level Talks Between India And China - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్, చైనాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు క్రమంగా తొలగుతున్నాయి. ఈ దిశగా, తాజాగా, బుధవారం ఇరు దేశాల మధ్య మేజర్‌ జనరల్‌ స్థాయి చర్చలు జరిగాయి. అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా అదనంగా మోహరించిన బలగాలను తక్షణమే వెనక్కు పంపించాలని, సరిహద్దుల్లో వివాదం తలెత్తకముందున్న పరిస్థితి మళ్లీ నెలకొనేలా చూడాలని సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో భారత్‌ డిమాండ్‌ చేసిందని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉద్రిక్తతలను తొలగించే దిశగా సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని పేర్కొన్నాయి. ఇప్పటికే తూర్పు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయ, చాంగ్‌ చెన్‌మొ రివర్‌ వ్యాలీల్లో ఉన్న పలు సున్నిత ప్రాంతాల నుంచి రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

ఆయా ప్రదేశాల నుంచి చైనా సుమారు 1.5కిమీలు వెనక్కు వెళ్లినట్లు భారత మిలటరీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అయితే, ప్యాంగాంగ్‌ సొ, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, దెమ్చాక్‌ల్లో మాత్రం రెండు దేశాల సైన్యం ఇంకా ఢీ అంటే ఢీ అనే స్థితిలోనే ఉన్నాయి. మే 5వ తేదీ నుంచి సరిహద్దుల్లో భారత్, చైనాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. వాటిని తొలగించే దిశగా ఇరు దేశాలు మిలటరీ, దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించాయి. జూన్‌ 6న భారత లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్, చైనా మేజర్‌ జనరల్‌ లియూ లిన్‌ల మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల సందర్భంగా కుదిరిన ఏకాభిప్రాయం మేరకు రెండు దేశాల సైన్యం సానుకూల చర్యలు చేపట్టాయని బుధవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్‌ వ్యాఖ్యానించారు.

1962 నాటి భారత్‌ కాదు.. 
ఇది 1962 నాటి భారత్‌ కాదని, ఇప్పుడు భారతదేశాన్ని పాలిస్తోంది కాంగ్రెస్‌ కాదని, నరేంద్ర మోదీ అనే ధైర్య సాహసాలున్న నాయకుడు ప్రధానిగా ఉన్నాడని బీజేపీ వ్యాఖ్యానించింది. చైనాకు సంబంధించిన వ్యూహాత్మక అంశాలను ట్వీటర్‌లో ప్రస్తావించకూడదన్న కనీసం జ్ఞానం కూడా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విమర్శించారు. చైనాతో ఉద్రిక్తతల విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. లదాఖ్‌లోని భారత్‌ భూభాగాలపైకి చైనా సైన్యం వచ్చినప్పటికీ.. ప్రధాని పెదవి విప్పడం లేదని విమర్శించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement