పోలీసులకు ఆవాసాలు | habitats to Police | Sakshi
Sakshi News home page

పోలీసులకు ఆవాసాలు

Sep 3 2014 10:22 PM | Updated on Aug 21 2018 5:46 PM

పదవీ విరమణ చేయనున్న తొమ్మిదివేల మంది పోలీసులకు ఆవాసాలను కేటాయించనున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి రామారావ్ పాటిల్ పేర్కొన్నారు.

 సాక్షి, ముంబై: పదవీ విరమణ చేయనున్న తొమ్మిదివేల మంది పోలీసులకు ఆవాసాలను కేటాయించనున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి రామారావ్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వంద ఎకరాల స్థలంలో ఇళ్లను నిర్మించనున్నామని, పోలీసు సిబ్బంది ఇప్పటికే ఓ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు 700 చదరపు అడుగుల రెండు పడక గదుల ఫ్లాట్‌ను కేటాయిస్తామన్నారు.

పన్వేల్‌లోని ఛత్రపతి శివాజీనగర్‌లో వీటిని నిర్మించనున్నామన్నారు. ఇది పన్వెల్ రైల్వేస్టేషన్‌కు అత్యంత చేరువలో ఉందన్నారు. అంతేకాకుండా నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా దగ్గరేనన్నారు. కాగా అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లే కార్పొరేషన్ సిబ్బంది భద్రత కోసం ప్రత్యేక  పోలీసు సిబ్బందిని నియమిస్తామని పాటిల్ వెల్లడించారు. ఇందువల్ల బీఎంసీ అక్రమ కట్టడాల నిరోధక శాఖ అధికారులతోపాటు, సిబ్బందికి దాడుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు.

 కాగా రాష్ట్రంలోని అనేక కార్పొరేషన్ల పరిధిలో అక్రమ కట్టడాల బెడత తీవ్రంగా ఉంది. ముంబై, పుణే లాంటి నగరాలలో ఈ బెడద తీవ్రంగా ఉంది. అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన కార్పొరేషన్ అధికారులు, సిబ్బందిపై బాధితులు దాడులుచేసి గాయపర్చిన ఘటనలు అనేకం. అంతేకాకుండా ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నించే జేసీబీ యంత్రాలను ధ్వంసం చేస్తున్నారు. వాటిని నడిపే డ్రైవర్లపై దాడులకు పాల్పడుతున్నారు. భద్రతా విధుల్లో ఉన్నవారి సంఖ్య అంతంతగానే ఉండడంతో ఏమీచేయలేని పరిస్థితి నెలకొంది. అనేక సందర్భాల్లో పోలీసులు అందుబాటులో లేకపోవడంతో అక్రమ కట్టడాల యజమానులపై చర్య తీసుకోలేని పరిస్థితి కొనసాగుతోంది. దీంతో అక్రమ కట్టడాలు విచ్చల విడిగా వెలుస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement