breaking news
Rama Rao Patil
-
కాంగ్రెస్‌కు వలసల ఫికర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో వలసల అలజడి మొదలైంది. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు పటేల్ నిష్క్రమణతో ప్రారంభమైన ఈ వలసల పర్వం ఎంతవరకు విస్తరిస్తుందనే ఆందోళన పార్టీలో వ్యక్తమవుతోంది. నిర్మల్ ప్రకంపనలు హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా సాగుతుండగా, పలు జిల్లాల్లోని కాంగ్రెస్ నాయకులు తమ దారి తాము చూసుకునేందుకు చాపకింద నీరులా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతోపాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా వలసలు ఉంటాయనే చర్చ ఇటీవలి కాలంలో ఊపందుకుంటోంది. నిర్మల్ నుంచి నిదానంగా..! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర కొన్ని జిల్లాల మీదుగానే అయినా రాష్ట్రవ్యాప్తంగా భారత్ జోడో ప్రభావం కనిపిస్తోంది. జోడో యాత్ర స్ఫూర్తి ఎన్నికల వరకు కొనసాగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు భావించారు. కానీ, అనూహ్యంగా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్ పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి సన్నిహితుడైన ఈయన్ను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌నేత ఒకరు పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కూడా పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే, తాను పార్టీ మారబోనని సదరు నేత ఖండించడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మరో నాయకుడు పార్టీ అంతర్గత విభేదాల నేపథ్యంలో తనకు ఈసారి పోటీచేసే అవకాశం రాదనే ఆలోచనతో తన దారి తాను చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వీరితోపాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురి నేతల పేర్లు నిష్క్రమణ జాబితాలో చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నియోజకవర్గస్థాయి నేతలు, తమకు ఈసారి టికెట్ రాదని భావిస్తున్న నేతలు జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో చాలామంది బీజేపీ వైపు చూస్తుండటం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడే కాకపోయినా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిస్థితులు, ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అవకాశాలను బట్టి వీరు నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారనేది బహిరంగ రహస్యమే. గప్‌చుప్... ఈనెల ఏడో తేదీన తెలంగాణలో రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర ముగిసింది. యాత్రకుముందు 15 రోజులపాటు పూర్తిస్థాయిలో హడావుడి చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆ తర్వాత విశ్రాంతి దశలోకి వెళ్లిపోయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 12 రోజులపాటు ఏకధాటిగా రాహుల్‌తో కలిసి నడిచిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గత వారం రోజులుగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెండు, మూడు రోజుల విరామం తర్వాత ఢిల్లీ వెళ్లగా, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈజిప్టులో జరుగుతున్న కాప్ సదస్సులో పాల్గొనేందుకు సతీసమేతంగా వెళ్లారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో అడపాదడప కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, మిగిలిన నాయకత్వం కూడా ఎక్కడికక్కడ గప్‌చుప్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలో వలసల జోరు పెరగకుండా చూసుకోవడంతో పాటు భారత్‌జోడో యాత్ర నింపిన స్ఫూర్తిని కొనసాగించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరముందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. -
పోలీసులకు ఆవాసాలు
సాక్షి, ముంబై: పదవీ విరమణ చేయనున్న తొమ్మిదివేల మంది పోలీసులకు ఆవాసాలను కేటాయించనున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి రామారావ్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వంద ఎకరాల స్థలంలో ఇళ్లను నిర్మించనున్నామని, పోలీసు సిబ్బంది ఇప్పటికే ఓ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు 700 చదరపు అడుగుల రెండు పడక గదుల ఫ్లాట్‌ను కేటాయిస్తామన్నారు. పన్వేల్‌లోని ఛత్రపతి శివాజీనగర్‌లో వీటిని నిర్మించనున్నామన్నారు. ఇది పన్వెల్ రైల్వేస్టేషన్‌కు అత్యంత చేరువలో ఉందన్నారు. అంతేకాకుండా నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా దగ్గరేనన్నారు. కాగా అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లే కార్పొరేషన్ సిబ్బంది భద్రత కోసం ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమిస్తామని పాటిల్ వెల్లడించారు. ఇందువల్ల బీఎంసీ అక్రమ కట్టడాల నిరోధక శాఖ అధికారులతోపాటు, సిబ్బందికి దాడుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. కాగా రాష్ట్రంలోని అనేక కార్పొరేషన్ల పరిధిలో అక్రమ కట్టడాల బెడత తీవ్రంగా ఉంది. ముంబై, పుణే లాంటి నగరాలలో ఈ బెడద తీవ్రంగా ఉంది. అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన కార్పొరేషన్ అధికారులు, సిబ్బందిపై బాధితులు దాడులుచేసి గాయపర్చిన ఘటనలు అనేకం. అంతేకాకుండా ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నించే జేసీబీ యంత్రాలను ధ్వంసం చేస్తున్నారు. వాటిని నడిపే డ్రైవర్లపై దాడులకు పాల్పడుతున్నారు. భద్రతా విధుల్లో ఉన్నవారి సంఖ్య అంతంతగానే ఉండడంతో ఏమీచేయలేని పరిస్థితి నెలకొంది. అనేక సందర్భాల్లో పోలీసులు అందుబాటులో లేకపోవడంతో అక్రమ కట్టడాల యజమానులపై చర్య తీసుకోలేని పరిస్థితి కొనసాగుతోంది. దీంతో అక్రమ కట్టడాలు విచ్చల విడిగా వెలుస్తున్నాయి.