అయోధ్య తీర్పు: సున్నీ వక్ఫ్‌బోర్డు స్పందన | Ayodhya Verdict Sunni Waqf Board Lawyer Comments | Sakshi
Sakshi News home page

సుప్రీంతీర్పును గౌరవిస్తున్నాం.. కానీ

Nov 9 2019 11:58 AM | Updated on Nov 9 2019 2:11 PM

Ayodhya Verdict Sunni Waqf Board Lawyer Comments - Sakshi

న్యూఢిల్లీ : అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాము గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాది జఫర్‌యాబ్‌ జిలానీ అన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని.. ఈ తీర్పుపై చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణకు సిద్ధవుతామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తీర్పు కాపీ పూర్తిగా చదివిన తర్వాతే రివ్యూ పిటిషన్‌ వేయాలో లేదో నిర్ణయించుకుంటామని ముస్లిం లా బోర్డు స్పష్టం చేసింది. ఏఎస్‌ఐ నివేదికలో ముస్లింలకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కమిటీతో చర్చించిన తర్వాతే వారి నిర్ణయం మేరకు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని వెల్లడించింది.

కాగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రామజన్మభూమి కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు... నిర్మోహి అఖాడా పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. అదే విధంగా అయోధ్య చట్టం కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేయడంతో పాటుగా... అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు(సున్నీ వక్ఫ్‌ బోర్డుకు) ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని (2.77 ఎకరాలు) రామజన్మ న్యాస్‌కే అప్పగించాలని తీర్పు వెలువరించింది. (చదవండి: అయోధ్య వివాదం​; కీలక తీర్పు)

Advertisement
 
Advertisement
Advertisement