‘చచ్చిన ఉగ్రవాది’ కాల్చాడు! | 5 Security Personnel Martyred In Encounter With Terrorists In Kashmir | Sakshi
Sakshi News home page

‘చచ్చిన ఉగ్రవాది’ కాల్చాడు!

Mar 2 2019 2:22 AM | Updated on Mar 2 2019 3:55 AM

5 Security Personnel Martyred In Encounter With Terrorists In Kashmir - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం భీకర ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కుప్వారా జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు దొంగదెబ్బ తీయడంతో ఓ సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లాలోని బాబాగుంద్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు పోలీసులకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందం ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపును ప్రారంభించింది.

అంతలోనే బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పు లు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య కాల్పులు చాలాసేపు సాగా యి. ఉగ్రవాదుల నుంచి కాల్పులు ఆగిపోవడం తో భద్రతాబలగాలు వారు నక్కిన ఇంటిలోకి వెళ్లాయి. దీంతో అప్పటివరకూ చనిపోయినట్లు నటించిన ఓ ఉగ్రవాది ఒక్కసారిగా లేచి తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్, జవాన్‌తో పాటు ఇద్దరు ఆర్మీ సిబ్బంది, ఓ పోలీస్‌ అధికారి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

ఉగ్రవాది కాల్పుల్లో గాయపడ్డ మరో నలుగురికి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనలో వసీమ్‌ అహ్మద్‌ అనే స్థానికుడొకరు బుల్లెట్‌ గాయాలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్‌ అనంతరం భద్రతాబలగాలపై స్థానిక యువకులు రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ సందర్భంగా నలుగురు యువకులు గాయపడ్డారని వెల్లడించారు. ఇంకా ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండొచ్చన్న సమాచారం నేపథ్యంలో కూంబింగ్‌ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement