సంక్రాంతి బరిలో సూపర్‌స్టార్
ఒక ప్రాంతీయ నటుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకోవడం, బాలీవుడ్ సూపర్‌స్టార్లను సైతం అభిమానులుగా మార్చుకోవడం రజనీకాంత్ విషయంలోనే జరిగింది.
ఒక ప్రాంతీయ నటుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకోవడం, బాలీవుడ్ సూపర్‌స్టార్లను సైతం అభిమానులుగా మార్చుకోవడం రజనీకాంత్ విషయంలోనే జరిగింది. ప్రాంతీయ భాషా చిత్రాలకు ఓ గౌరవం తెచ్చిన నటుడు రజనీకాంత్. ఈ రోజున ఆయన సినిమా విడుదల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ ‘కోచ్చడయాన్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అవతార్, ది అడ్వంచర్ ఆఫ్ టైటాన్ చిత్రాలకు ఉపయోగించిన మోషన్ క్యాప్యరింగ్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందించారు సౌందర్య. దేశంలో ఈ టెక్నాలజీతో రూపొందుతోన్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.
ఇందులో రజనీ పరాక్రమశాలిగా కనిపిస్తారు. ఆయన పాత్రకు తగ్గట్టుగా తెలుగులో ఈ చిత్రం ‘విక్రమసింహ’ పేరుతో విడుదల కానుంది. లక్ష్మీ గణపతి ఫిలింస్ సంస్థ తెలుగు హక్కుల్ని చేజిక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌స్టార్ అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ చిత్రంలో రజనీ స్టైల్ కొత్త పుంతలు తొక్కనుందని తెలిసింది. అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర చిత్రణ ఉండబోతోందని వినికిడి. ఏఆర్ రెహమాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేయనున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది. అంటే... మహేష్‌బాబు ‘1’, బన్నీ ‘రేసుగుర్రం’, నితిన్ ‘హార్ట్‌ఎటాక్’, సాయిధరమ్‌తేజ్ ‘రేయ్’ చిత్రాలకు సూపర్‌స్టార్ రూపంలో గట్టి పోటీ ఎదురు కానున్నదన్నమాట. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో రజనీ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి. కె.ఎస్.రవికుమార్ కథ అందించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయిక. శరత్‌కుమార్, ఆది, శోభన్ ప్రత్యేక పాత్రధారులు. నాజర్, జాకీష్రాఫ్, రుక్మిణి ఇతర పాత్రధారులు.