
డనంగ్(వియత్నాం): తాను 16 ఏళ్ల వయసులోనే ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దుతెర్తే సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వియత్నాంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫిలిప్పైన్స్ ప్రజలతో ఆయన మాట్లాడారు. తనను కలవడానికి ప్రయత్నిస్తే చెంప చెళ్లుమనిపిస్తామనని అదే వేదికపై ఐరాస మానవ హక్కుల సంస్థ ప్రతినిధి ఒకరిని బెదిరించారు. మాదక ద్రవ్యాల ముఠాలపై తన పోరాటాన్ని విమర్శిస్తున్న వారిని దూషించారు. ‘యుక్త వయసులోనే నేను జైలుకెళ్లి వచ్చే వాడిని. నేనెక్కడికెళ్లినా గొడవలే జరిగేవి. 16 ఏళ్లకే ఓ వ్యక్తిని పొడిచి హత్య చేశా. అప్పుడే అలా ఉంటే ఇప్పుడు అధ్యక్షుడిగా నా బలమేంటో ఊహించుకోండి’ అని అన్నారు.