కరోనా వైరస్‌ ఎలా సోకుతుందంటే... | Sakshi
Sakshi News home page

కరోనా వైరస్‌ ఎలా సోకుతుందంటే...

Published Mon, Mar 2 2020 8:51 PM

Corona Virus: How Does Spread and Symptoms,How Can protect yourself - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనాతోపాటు నేడు ప్రపంచ ప్రజలను గడగడలాడిస్తోన్న కోవిడ్‌-19 వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుందో, అలా వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రపంచంలోని ప్రసిద్ధ వైద్యులు ఇలా తెలియజేస్తున్నారు. (ఢిల్లీ, తెలంగాణలలో కరోనా కేసులు నమోదు)

కోవిడ్‌ వైరస్‌ సోకినవారికి మనం దగ్గరగా ఉన్నప్పుడు వారు తుమ్మినా, దగ్గినా మనకు వైరస్‌ సోకుతుంది. 
వారు మాట్లాడినప్పుడు వారి నోటి నుంచి రాలే తుంపర్లు మన ముఖంపై పడినా వస్తుంది.
 వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారు చేతులు అడ్డంగా పెట్టుకొని ఆ చేతులతో తలుపు గడియలను, ట్యాప్‌లను, ఇతర ఉపరితలాలను ముట్టుకుంటే వాటికి వైరస్‌ చేరుతుంది. వాటిని మనం ముట్టుకున్నప్పుడు మన చేతులకు, చేతుల నుంచి నోరు లేదా ముక్కు ద్వారా మనకూ వైరస్‌ సోకుతుంది.
ఇతర వైరస్‌లలాగా కోవిడ్‌ వైరస్‌ బాహ్య వాతావరణంలో వెంటనే చనిపోకుండా కొన్ని రోజులపాటు బతికి ఉంటుంది. వైరస్‌ ఉన్న వస్తువులను లేదా ఉపరితలాలను మనం ముట్టుకొని, ఆ చేతులతో నోరో, ముక్కో తుడుచుకున్నప్పుడూ మనకూ వ్యాపిస్తుంది.  (శతాబ్దానికో మహమ్మారి!)

 
మన చేతులకు వైరస్‌ సోకి ఉండవచ్చనే అనుమానం వేసినప్పుడు వెంటనే చేతులను ఆల్కహాల్‌ లేదా బ్లీచింగ్‌ పౌడర్లతోని శుభ్రంగా కడుక్కోవాలని జర్మనీలోని గ్రీవ్స్‌ వాల్డ్‌ యూనివర్శిటీ నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్‌ వైరస్‌ సోకిన వారిలో 14 శాతం మంది తీవ్రంగా జబ్బు పడతారు. వారిలో నాలుగు శాతం మంది మరీ తీవ్రంగా అస్వస్థులవుతారు. అందుకనే ఇది ఎంతో తీవ్రంగా పరిగణించాల్సిన వైరస్‌ అని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో ఎక్స్‌పర్‌మెంటల్‌ మెడిసిన్‌ విభాగంలో పని చేస్తోన్న ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీటర్‌ ఓపెన్‌షా తెలియజేశారు. 
ఈ వైరస్‌ సోకిన వారికి జలుబు సాధారణ స్థాయిలో ఉండదు. ఊపిరాడని విధంగా తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు వారు వెంటనే ఆస్పత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగంలో చేరాలి. 
ఒక్కసారి పరీక్షల్లోనే ఈ వైరస్‌ బయటపడక పోవచ్చు. ఓ సారి నెగెటివ్‌ వచ్చిందీ మళ్లీ పరీక్షిస్తే పాజిటివ్‌ రావచ్చు.
మనం బయటకు వెళ్లినప్పుడు, వెళ్లి వచ్చినప్పుడు శుభ్రంగా కడుక్కోకుండా చేతులతో నోటిని, ముక్కును తాకరాదని కళ్లు తుడుచుకోరాదని ‘వెల్‌కమ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ జెనెటిక్స్‌’లో ఎపిడమియాలోజికల్‌ ఇన్‌ఫర్‌మేటిక్స్‌ విభాగం అధిపతి అలిస్టేర్‌ మైల్స్‌ సూచిస్తున్నారు. 


మంచి మాస్క్‌లను ధరించడం ద్వారా వైరస్‌కు దూరంగా ఉండవచ్చు. (ప్రపంచంపై పిడుగు)
శిశువులు, పిల్లలకు ఈ వైరస్‌ ప్రాణాంతకం కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ వైరస్‌ తీవ్రంగా విజృంభించిన చైనాలో ఇంతవరకు పదేళ్ల పిల్లలు చనిపోలేదు. కానీ పిల్లల నుంచి పెద్దలకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకనే పలు దేశాల్లో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను మూసివేశారు. 
ఈ వైరస్‌ సోకిన పదేళ్ల నుంచి యాభై ఏళ్ల వారిలో మృతుల సంఖ్య 0.2 నుంచి 0.4 శాతం వరకు మాత్రమే ఉన్నట్లు ‘చైనా సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌’ మొదట వెల్లడించింది. కానీ ఇప్పుడు ఈ శాతం పెరుగుతున్నట్లు మృతుల సంఖ్యను పరిశీలిస్తే తెలుస్తోంది.
ప్రస్తుత అంచానాల ప్రకారం యాభై ఏళ్ల లోపు రోగుల్లో 1.3 శాతం, 60 ఏళ్ల లోపు రోగుల్లో 3.6 శాతం, 70 ఏళ్ల రోగుల్లో ఎనిమిది శాతం, 80 ఏళ్ల రోగుల్లో 14.8 శాతం చనిపోయే ప్రమాదం ఉంది. (చైనా వెలుపల కోవిడ్ మృతులు)
రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధ పడే వద్ధుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 
ఈ వైరస్‌ లక్షణాలు జలుబు, దగ్గుతో మొదలై తీవ్ర జ్వరం వరకు వెళుతుంది. నుదుటిపై ఫోకస్‌ ద్వారా జ్వర లక్షణాలు త్వరగా పసిగట్టే పరికరాలు నేడు అందుబాటులోకి వచ్చాయి. 
కరోనా వైరస్‌పై హెల్ప్‌లైన్ నెం: 011-23978046

Advertisement
Advertisement