నెత్తురోడిన పాక్‌

133 killed, over 200 injured in twin election-related blasts in Pakistan - Sakshi

ఎన్నికల ర్యాలీల్లో పేలుళ్లు

133 మంది మృతి

పెషావర్‌/కరాచీ: పాకిస్తాన్‌లో శుక్రవారం రెండు ఎన్నికల ర్యాలీలు లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో ఓ జాతీయ స్థాయి నాయకుడు సహా మొత్తం 133 మంది మరణించారు. దాదాపు 162 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 25న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీలు ప్రచారంలో బిజీగా ఉండగా, ఆ పార్టీల నాయకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. బలూచిస్తాన్‌ ప్రావిన్సులోని మస్తుంగ్‌లో బలూచిస్తాన్‌ ఆవామీ పార్టీ నేత సిరాజ్‌ రైసాని నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీపై ఉగ్రవాదులు దాడి చేశారు. సిరాజ్‌ సహా మొత్తం 128 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోగా, 125 మందికిపైగా గాయపడ్డారని డాన్‌ పత్రిక తెలిపింది. ఈ దాడి తామే చేశామని ఐసిస్‌ ప్రకటించింది.

16 నుంచి 20 కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బాంబ్‌ స్క్వాడ్‌ తెలిపింది. అంతకు కొన్ని గంటల ముందే ఖైబర్‌ ఫక్తున్వా ప్రావిన్సులోని బన్నూ ప్రాంతంలోనూ ముతహిద మజ్లిస్‌ అమల్‌ పార్టీ నేత అక్రం ఖాన్‌ దురానీ ర్యాలీ వద్ద కూడా ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 37 మందికిపైగా గాయపడ్డారు. దురానీ క్షేమంగా బయటపడ్డారు. దురానీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌ –ఇ–ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రముఖ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌పై పోటీ చేస్తున్నారు. కాగా, ఉగ్రవాదుల దాడులను పాకిస్తాన్‌ అధ్యక్షుడు మమ్నూన్, ప్రధాని ముల్క్‌ ఖండించారు. గత మంగళవారం ఆవామీ నేషనల్‌ పార్టీ ర్యాలీలో తాలిబాన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడగా 20 మంది మరణించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top