సాగడమే సొరంగం | To continue the tunnel | Sakshi
Sakshi News home page

సాగడమే సొరంగం

Aug 5 2013 1:13 AM | Updated on Sep 29 2018 5:10 PM

వర్షాకాలంలోనేకాదు..మామూలు రోజుల్లో కూడా నగర రహదారులను ముంచెత్తుతున్న మురుగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చే ఉద్దేశంతో ప్రారంభించినసొరంగం పనులు నత్తకు నడక నేర్పిస్తున్నాయి.

సాక్షి,సిటీబ్యూరో: వర్షాకాలంలోనేకాదు..మామూలు రోజుల్లో కూడా నగర రహదారులను ముంచెత్తుతున్న మురుగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చే ఉద్దేశంతో ప్రారంభించినసొరంగం పనులు నత్తకు నడక నేర్పిస్తున్నాయి. లిబర్టీ నుంచి కాచిగూడ(నింబోలిఅడ్డా)వరకు ఉన్న ప్రధానరహదారి మార్గంలో 5 కిలోమీటర్ల మేర 1.6 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న భారీ పైప్‌లైన్ ఏర్పాటుచేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. జర్మనీకి చెందిన ట్రెంచ్‌లెస్ టెక్నాలజీ పరికరాలతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసే పనులను విశ్వ సంస్థకు అప్పగించారు. ఆగస్టు 2009లో పనులు మొదలుకాగా.
 
 .ఒప్పందం ప్రకారం 2011 ఫిబ్రవరి నాటికి పూర్తికావాల్సి ఉంది. అయితే సాంకేతికకారణాలతో మరో రెండేళ్లపాటు గడువును పొడిగించారు. ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి పనులు పూర్తికావాల్సి ఉండగా..ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. గత నాలుగేళ్లుగా ఐదుకిలోమీటర్ల పనుల్లో కేవలం 3.5 కిలోమీటర్లు మాత్రమే పూర్తికాగా..1.5 కిలోమీటర్ల మేర పనులు అసంపూర్తిగా మిగిలాయి.  
 
 పనులు పూర్తికాకున్న బిల్లుల మంజూరు : నాలుగేళ్లక్రితం సుమారు రూ.76.43 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటివరకు సుమారు రూ.35 కోట్లు సదరు సంస్థకు బిల్లుల రూపేణా ముట్టజెప్పారు. కానీ గడువులోగా పైపులైన్ పనులు పూర్తిచేయడంలో సదరు సంస్థ చతికిలపడింది. పనుల మందగమనంపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్)బృందం ఇటీవల అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది.
 
 ఈ దుస్థితితో కోర్‌సిటీకి ఇప్పట్లో మురుగుకష్టాలు తీరే అవకాశాలు కనిపించడం లేదు. అయితే కాచిగూడ-నారాయణగూడ మార్గంలో మెట్రోరైలు పనుల నేపథ్యంలో హెచ్‌ఎంఆర్,జలమండలి విభాగాల మధ్య సమన్వయలోపం కూడా పనుల మందగమనానికి కారణమవుతోంది.
 
 ఇదీ ప్రాజెక్టు స్వరూపం
 ప్రాజెక్టు: భూగర్భ సొరంగ డ్రైనేజీ నిర్మాణం  
 పనులు ప్రారంభం : ఆగస్టు 2009
 పూర్తికావాల్సింది : 2013 ఆగస్టు
 ఎక్కడి నుంచి ఎక్కడివరకు: లిబర్టీ నుంచి కాచిగూడ నింబోలిఅడ్డా వరకు ఐదుకిలోమీటర్ల మేర 1.6 మీటర్ల వ్యాసార్థంతో..
 పూర్తయిన పనులు: 3.5 కిలోమీటర్లు మాత్రమే.
 కలిగే ప్రయోజనం: మూసీలో యథేచ్ఛగా కలిసే మురుగునీరు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతోపాటు లిబర్టీ,పాత ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్‌బాగ్,కాచిగూడ ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత  పరిష్కారం లభిస్తుంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పనులు చేపట్టడం ట్రెంచ్‌లెస్ టెక్నాలజీ ప్రత్యేకత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement