కాంగ్రెస్, బీజేపీలను నిలదీయండి | Minister KTR calls for public | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీలను నిలదీయండి

Dec 22 2015 2:57 AM | Updated on Aug 30 2019 8:24 PM

కాంగ్రెస్, బీజేపీలను నిలదీయండి - Sakshi

కాంగ్రెస్, బీజేపీలను నిలదీయండి

మీరు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌కు గోదావరి జలాలు ఎందుకు సరఫరా చేయలేదు.. 24 గంటలు కరెంటు

ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపు
♦ 18 నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలా?
♦ సెటిలర్లకు అండగా ప్రభుత్వం
♦ గ్రేటర్ పీఠం టీఆర్‌ఎస్‌దే..
♦ టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత కేఎం ప్రతాప్, పలువురు నాయకులు
 
 సాక్షి, హైదరాబాద్: ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌కు గోదావరి జలాలు ఎందుకు సరఫరా చేయలేదు.. 24 గంటలు కరెంటు ఎందుకు ఇవ్వలేదు... మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదని ఓట్ల కోసం మీ ముందుకు వచ్చే కాంగ్రెస్, బీజేపీ నేతలను నిలదీయండి’ అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క కేసీఆర్‌పై చేస్తున్న విమర్శల్లో పదోవంతు సమయాన్నైనా 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందో ప్రజలకు చెప్పేందుకు  కేటాయించాలన్నారు. సోమవారం తెలంగాణా భవన్‌లో రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్, ఇతర నేతలను ఆయన పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే సెటిలర్లపై దాడులు జరుగుతాయని, శాంతిభద్రతలు గాడితప్పుతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తంచేసిన నాయకులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి కనువిప్పు కలగాలన్నారు. సెటిలర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ పీఠం టీఆర్‌ఎస్‌దేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే నగరంలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. 18 నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వం పసిగుడ్డు లాంటిదని.. దానిపై విపక్షాలు అనవసరంగా విమర్శల దాడి చేస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని తమ సర్కారు అధికారంలోకి వచ్చి 18 నెలల్లోనే చేసి చూపుతున్నామన్నారు. చినుకు పడితే నగరంలో రహదారులు సరస్సులను తలపించేలా మారేందుకు కారకులు కాంగ్రెస్ నేతలేనన్నారు. లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో 30 వేల కోట్లకు పైగా సంక్షేమ రంగానికి కేటాయిస్తున్న ఘనత తమ సర్కారుదేనన్నారు. స్వచ్ఛ భారత్, జన్‌ధన్ యోజన మినహా ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకాలేవీ లేవన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులకు వారి సామర్థ్యాలను బట్టి సీఎం కేసీఆర్ వాళ్ల సేవలను వినియోగించుకుంటారని, పదవులు కట్టబెడతారని హామీఇచ్చారు.  డి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రజల నాడిని బట్టి చూస్తే ఆయన మరోసారి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ తప్ప ఇతర పార్టీ ఉండదని, అన్ని దారులు తెలంగాణా భవన్ వైపేనన్నారు. కాంగ్రెస్ నేతలు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, వీఎన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, లింగాల హరిగౌడ్‌లకు కేటీఆర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పలు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణా భవన్‌కు తరలిరావడంతో బంజారాహిల్స్ ప్రాంతంలో రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement