పది రోజుల పండుగ ! | Hyderabad Fest from today | Sakshi
Sakshi News home page

పది రోజుల పండుగ !

Apr 13 2018 1:23 AM | Updated on Apr 13 2018 1:23 AM

Hyderabad Fest from today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాహిత్య, సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగరం మరోసారి వేదికైంది. ‘హైదరాబాద్‌ ఫెస్ట్‌’పేరుతో మొట్టమొదటిసారి శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ఎన్టీఆర్‌ స్టేడియంలో వైవిధ్యభరితమైన జానపద కళారూపాలు, సాహిత్య సభలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, ఆటపాటలు, వినోదభరిత కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.

ఈ నెల 13 (శుక్రవారం) నుంచి 22 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు, సెలవు రోజుల్లో ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ మహోత్సవాలను నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితం. 15 వేదికలపై ప్రతిరోజు 25 కార్యక్రమాల చొప్పున ఈ 10 రోజుల్లో సుమారు 250 కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ ఫెస్ట్‌ కార్యదర్శి చంద్రమోహన్‌ ‘సాక్షి’తో చెప్పారు.

తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఫెస్ట్‌ను అందరూ విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం ఈ ఫెస్ట్‌ను మంత్రి ఈటల రాజేందర్, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఫెస్ట్‌గౌరవ అధ్యక్షుడు చుక్కా రామయ్య ప్రారంభిస్తారని తెలిపారు. కాగా హైదరాబాద్‌ ఫెస్ట్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం ఎన్‌టీఆర్‌ స్టేడియంలో ఎయిర్‌ బెలూన్‌ను ఆవిష్కరించారు.  

సకల కళలకు పట్టం
స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఫెస్ట్‌లో చిరుతల భజన, శాస్త్రీయ నృత్యం, డప్పు నృత్యం, రేలా డ్యాన్స్, సోలో సాంగ్, కదంబం, బ్యాలే డ్యాన్స్, డోలు కోయలు, ఫోక్‌ డ్యాన్స్‌ తదితర అనేక కళారూపాలను ప్రదర్శిస్తారు. సినీరంగ ప్రముఖులు మమ్ముట్టి, ఎల్బీ శ్రీరాం, అల్లాడి శ్రీధర్, సుద్దాల అశోక్‌తేజ, నరేశ్, శ్రీకాంత్, శంకర్‌ తదితరులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు.  

పిల్లల కోసం బాలోత్సవ్‌
వేసవి సెలవుల్లో చిన్నారులు తమ సృజనకు పదును పెట్టుకొనే అనేక ప్రక్రియలను, కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించనున్నారు. కవిత్వం రాయడం, భావవ్యక్తీకరణ, పద్యపఠనం, కథలు చెప్పడం, రాయడం, విశ్లేషించడం వంటి అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పిల్లల పాటలు, బృందగానాలు, అభ్యుదయ, జానపద, లలిత గీతాలు, నాటకాల పోటీలు నిర్వహిస్తారు. బొమ్మలు వేయడం, బొమ్మలను తయారు చేయడం, ఉర్దూ భాషలోశిక్షణ వంటి కార్యక్రమాలను ఈ బాలోత్సవ్‌లో నిర్వహిస్తారు.  

స్టీఫెన్‌ హాకింగ్‌ హబ్‌
పిల్లల మదిలో మెదిలే ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలను నివృత్తి చేసేవిధంగా స్టీఫెన్‌ హాకింగ్‌ హబ్‌ పేరిట మనో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఇది హైదరాబాద్‌ ఫెస్ట్‌లో       ప్రత్యేకంగా నిలవనుంది. గత మూడు దశాబ్దాలుగా పిల్లల్లో సైన్స్‌ పట్ల అభిరుచిని పెంపొందించేందుకు కృషి చేస్తోన్న జనవిజ్ఞాన    వేదిక ఈ హబ్‌ను నిర్వహించనుంది.  

హైదరాబాద్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌
పుస్తక ప్రదర్శనకు కూడా హెదరాబాద్‌ ఫెస్ట్‌ పట్టం కట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తదితర రాష్ట్రాలకు చెందిన పుస్తక సంస్థలు, 80 స్టాళ్లతో ప్రదర్శన  నిర్వహిస్తారు. ఈ ఫెస్ట్‌లో మఖ్దూం మొహియుద్దీన్‌ వేదికపై ప్రతిరోజు వివిధ సాహిత్య అంశాలపై చర్చలు, సదస్సులు ఉంటాయి. కవి సమ్మేళనం కూడా ఉంటుంది.

మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు
ఈ వేడుకల్లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 14 నుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. రాజకీయ నాయకత్వంలో మహిళలు అన్న అంశంపై నిర్వహించే సదస్సులో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు     స్వరాజ్యం పాల్గొంటారు. అలాగే 15న ప్రసారసాధనాలు–మహిళలు, 16న ప్రత్యామ్నాయ సంస్కృతి, 17న స్త్రీలు–పిల్లలపై సైబర్‌ నేరాలు, 18న మహిళలు–ఆరోగ్యం అన్న అంశంపైన సదస్సులు, చర్చలు నిర్వహిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement