ఒక్కమాట విలువ?

Bhaskar Sharma Writes Story On YS Rajasekhara Reddy Over 10th Death Anniversary - Sakshi

రాజశేఖరరెడ్డిగారు ఆమాట ఇచ్చి ఉండకపోతే అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర మరోరకంగా ఉండి ఉండేది!
2009 జూలై నెలలో ఒకరోజు ఉదయం చిత్తూరు నుంచి గోపీనాథ్‌ ఫోన్‌ చేశారు.‘‘అన్నా, అర్జంటుగా వైయస్సార్‌ అన్నని కలవాలి–ఎప్పుడు రమ్మంటావు?’’అని అడిగారు. గోపీనాథ్‌ చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన కాంగ్రెస్‌ నాయకులలో ఒకరు. తమిళ యాస ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. ఈ ఫోన్‌ కాల్‌ చేసేనాటికి శాసనమండలి సభ్యులు. సౌమ్యుడు. తన మాటతీరు రాజశేఖరరెడ్డి గారికీ నచ్చుతుంది. ఎప్పుడొచ్చినా ఆయన్ని ప్రేమగా పలకరించేవారు.

నేను షెడ్యూలు చూసుకుని మర్నాడు సాయంత్రం రమ్మన్నాను. చెప్పిన సమయానికి వచ్చారు. ‘మా అబ్బాయిది పెండ్లి నిశ్చయమైందబ్బా. లగ్గాలు పెట్టాలి. అన్న ఏరోజు వస్తాడో అడిగి ఆరోజే పెండ్లి పెట్టాలనుకున్నా..’ అన్నారు. నేను నా రొటీన్‌ వర్క్‌లో తలమునకలై ఉన్నా. ‘‘సరే, సరే, సార్‌ని కలిసి చెప్పండి’’ అన్నాను. ఓ గంట తరువాత గోపీనాథ్‌ సీఎంని కలిశారు. తర్వాత నా వద్దకొచ్చారు. ‘‘సార్‌  చెప్పిండు. ఆ తేదీలన్నీ నీకిచ్చి పోతుండా. అన్న నీతో మాట్లాడి ఏ తేదీ వచ్చేది చెబుతానన్నాడు.. కొంచెం చూసిపెట్టు సామీ..’’ అంటూ గోపీనాథ్‌ ఆ కాగితం నాకిచ్చేసి వెళ్లారు.

రెండురోజుల పాటు ఆ విషయం గురించి సీఎంతో మాట్లాడటం కుదరలేదు. మూడో రోజు పొద్దున్నే గోపీనాథ్‌ మళ్లీ ఫోన్చేశారు. ‘ఏం సామీ, సీఎంతో మాట్లాడినావా?’ అనడిగారు.‘మీకు ఏ సంగతీ సాయంత్రం చెబుతానండి’ అంటూ తప్పించుకున్నాను. మర్నాడు పొద్దున్నే సీఎం కార్యాలయాధికారుల బ్రీఫింగ్‌ అవగానే, సీఎంని కలిసి పనిలోపనిగా గోపీనాథ్‌ విషయం ప్రస్తావించాను. ‘శర్మా, అతనికేదో ఒక డేట్‌ చెప్పమంటే ఎలా చెప్పేస్తాం! ఆ రోజుకి ఏదన్నా ఢిల్లీ ట్రిప్‌ పడితే బాధపడతాడు కదా! ‘చూద్దాం లే’ అన్నాను, సరే, చూడు. ఏ డేట్‌కి కుదురుతుందో’ అన్నారు సీఎం.

గోపీనాథ్‌ ఇచ్చిన డేట్స్‌ ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో ఉన్నాయి. మూడు తేదీలు ఆయన ఇచ్చాడు. అంటే, మూడు ముహూర్తాలు పెట్టించుకున్నాడు. వాటిల్లో దేనికి సీఎం వస్తానంటే అదే ఖాయం చేసుకోవాలనుకుంటున్నాడు. సీఎం చెప్పినంత తేలిగ్గా తేదీలు నిర్ణయించటం సాధ్యపడదు. సీఎంగా అనేక సమావేశాలు, భేటీలు, అధికారిక, అనధికారిక కార్య క్రమాలకు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. వీటి మధ్యలో వ్యక్తిగత కార్యక్రమాలూ ఉంటాయి. ఎవర్నీ కాదనలేని స్వభావం వైఎస్‌ది. కచ్చితంగా రాను’ అని చెప్పరు. ఆ కుదరటం, కుదరకపోవటం నన్నే చెప్పమంటారు. ఇప్పుడు గోపీనాథ్‌ గారింట్లో లగ్నం సంగతి ఏం చేయాలి? మర్నాడు గోపీనాథ్‌ మళ్ళీ వచ్చేశారు. మళ్లీ సీఎంని కలిశారు. మళ్ళీ అదే కాగితం పట్టుకొచ్చారు. గోపీనాథ్‌  మాట్లాడుతుండగా, సీఎం నన్ను లోపలికి పిలిచారు.

‘ఏం శర్మా, గోపీనాథ్‌ కొడుకు పెళ్ళికి వెళ్లగలమా?’ గోపీనాథ్‌ ఆయన్ని బతిమాలుతున్నాడు. ‘అన్నా, అన్నా, నువ్వొస్తేనే లగ్నం జరుగుతుందన్నా, యాడున్నా సరే నువ్వు రావాలన్నా.. మూడు డేట్‌లలో ఏదో ఒకటి యస్‌ చెప్పేయన్నా..’ అంటూ పట్టుబట్టారు. రాజశేఖర్‌రెడ్డిగారు గోపీనాథ్‌ ప్రేమ, గౌరవం చూసి, నో’ చెప్పలేకపోయారు. ‘సరే, సాయంత్రం శర్మ చెబుతాడులే..’ అన్నారు. 

గోపీనాథ్‌ సీఎం దగ్గర వస్తాను’ అని వాగ్దానం తీసుకుని బయల్దేరి వెళ్ళారు. రెండురోజుల తర్వాత సీఎం ముఖ్య కార్యదర్శి డా‘‘ సుబ్రహ్మణ్యంగారు సీఎం దగ్గరుండగా నాకు పిలుపు వచ్చింది. లోపలకి వెళ్ళాను. డా‘‘ సుబ్రహ్మణ్యంగారు సీఎంతో ‘రచ్చబండ తేదీలగురించి మాట్లాడుతున్నారు. ఆ తేదీల గురించి వైఎస్సార్‌ ఇంకా ఆలోచిస్తున్నారు. అకస్మాత్తుగా నావంక తిరిగి ఆయన అన్నారు. ‘సెప్టెంబరు 2 పెట్టుకుందాం’అని. ‘సరే సర్‌’ అన్నాను. జన్నత్‌ గారు కూడా డైరీలో నోట్‌ చేసుకున్నారు. సెప్టెంబరు 2 ఉదయం క్యాంపు ఆఫీసులో వైఎస్సార్‌ బయల్దేరబోయేముందు నేను ఓమాట చెప్పాను. ‘సర్, ఎయిర్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ చెబుతున్నారు కదా వాతావరణం ఏమీ బాగాలేదని.‘రచ్చబండ’ ఇంకో రోజుకి వాయిదా వేసుకుంటే ఏమవుతుంది సర్‌?’

సీఎం నావంక తదేకంగా చూస్తూ ఏమవుతుందట? అంటూ భుజంమీద కొట్టి, బయల్దేరారు. ఆయనతో పాటు కారుదాకా వెళ్తుంటే, సీఎం చెబుతున్నారు. ‘శర్మా, రచ్చబండ ఇంకోసారి పెట్టుకోవచ్చయ్యా! కానీ, గోపీ నాథ్‌ కొడుకు పెళ్లికి వస్తామని మాట ఇచ్చాం. మనల్ని అడిగే లగ్గం పెట్టుకున్నాడు. అది ఇవ్వాళే కదా? మాట ఇవ్వలేదనుకో, సమస్యేలేదు. అతను ఎన్నిసార్లు తిరిగాడూ లగ్గానికి రావాలన్నా’ అని. వస్తానని చెప్పి ఎగ్గొట్టడానికా మాట ఇచ్చాం. ఏం ఫరవాలేదు లేవయ్యా. వెళ్ళకపోతే మాట పోతుంది. వెళ్ళామనుకో ఈ మాత్రం వెదర్‌ (వాతావరణానికి)కే ప్రాణం పోతుందా? ఏం కాదులే’ నవ్వుతూ కారెక్కేశారు.
మాటా మిగల్లేదు! ప్రాణమూ మిగల్లేదు!!

వ్యాసకర్త:  టి. భాస్కరశర్మ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆంతరంగిక కార్యదర్శి ‘ 98487 82009

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top