వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని తలచుకొని కంటతడి పెడుతున్న బొత్స
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారాలా?
మంత్రి అచ్చెన్నాయుడి తీరుపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్
వైఎస్సార్ మరణంపై అచ్చెన్న వ్యాఖ్యలను ఖండించిన బొత్స
వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి
మావిగన్‌పై చర్చను డైవర్ట్ చేయడానికి ఈ నీచ రాజకీయాలంటూ ధ్వజం
ఎంవీపీకాలనీ (విశాఖ): మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. రాజకీయ ఉనికి కోసం, ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి సిగ్గనిపించలేదా అంటూ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆనాడు వైఎస్సార్ మరణవార్త తెలిసి తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగిపోయాయని బొత్స చెప్పారు. వైఎస్సార్ మరణం వెనుక జగన్ ఉన్నాడని, మరణించిన సమయంలో ఆయన రాష్ట్రంలో లేడని తాను స్వయంగా చెప్పినట్లు అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పడం అతడి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
ఆ వ్యాఖ్యలు చేయడానికి కొంచమైనా సిగ్గనిపించలేదా అని ప్రశ్నించారు. అసలు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా.. టీడీపీలో ఉనికి కోసం, మంత్రి పదవి కోసం ఇలాంటి నీచరాజకీయాలకు ఒడిగడతావా అంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని గుర్తుతెచ్చుకుని బొత్స కంటతడి పెట్టారు. తనకు వైఎస్సార్‌తోను, ఆయన కుటుంబంతోను ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుల్లో వైఎస్సార్ ఒకరన్నారు. అలాంటి వ్యక్తి మరణాన్ని ఆయన పాదయాత్ర ముగించిన చారిత్రాత్మక సమయాన్ని స్మరించుకునేప్పుడు రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ అక్కడే ఉన్నారన్నారు. తాను, తన భార్య కలిసి క్యాంపు ఆఫీసు నుంచి స్వయంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. చరిత్ర తెలియకుండా అచ్చెన్నాయుడు రాజకీయ లబ్ధికోసం దిగజారుడు వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
మావిగన్ పేరు వినిపిస్తే కూటమి నాయకులకు నిద్రపట్టడంలేదు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని బొత్స చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజల నుంచి ఆ ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభిస్తోందన్నారు. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మావిగన్ నిలిచిందని పేర్కొన్నారు. దీంతో మావిగన్ పేరెత్తితో కూటమి నాయకులకు నిద్రపట్టడంలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో దాన్ని పక్కదారి పట్టించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఈ దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు.
తనకు నచ్చితే రేణుకా చౌదరి మాదిరిగా కమ్మరావతి బ్యాండ్ కట్టుకోవాలని సూచించారు. సత్తా ఉంటే రాష్ట్రంలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. అంతేతప్ప ఇలాంటి నీచవ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. జగన్‌ను ఎదుర్కొనలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మావిగన్ పేరు ఎత్తితే కూటమి నాయకులకు అంత ఉలికిపాటు ఎందుకని బొత్స నిలదీశారు. ఈ సమావేశంలో అరకు ఎంపీ తనూజారాణి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, విశాఖ తూర్పు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు.


