నాన్న పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాసింది | YS Jagan Tweet On YSR Padayatra Completes 23 Years: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నాన్న పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాసింది

Apr 10 2026 5:06 AM | Updated on Apr 10 2026 5:07 AM

YS Jagan Tweet On YSR Padayatra Completes 23 Years: Andhra Pradesh

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

ఆ పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది.. నేనున్నాననే భరోసా ఇచ్చింది 

సీఎం కాగానే ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు

పాదయాత్రలో రూపుదిద్దుకున్న ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలు మార్చేశాయి 

విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న ముద్ర ఎవరూ చెరిపివేయలేనిది

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు 

ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి

సాక్షి, అమరావతి: ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర చరిత్రను తిరగరాసిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సరిగ్గా 23 ఏళ్ల క్రితం 2003 ఏప్రిల్‌ 9వతేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైఎస్సార్‌ తన పాదయాత్రను ప్రారంభించిన విషయం విదితమే. రాష్ట్ర గతిని మార్చేసిన వైఎస్సార్‌ చరిత్రాత్మక పాదయాత్ర ఘట్టానికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన తండ్రి స్మృతులను గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో గురువారం వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..

ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది..
ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర నిరూపించింది. నాకు బాగా గుర్తు.. ఏప్రిల్‌ 9, 2003న ఎర్రటి ఎండలో.. ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాననే భరోసా ఇచ్చింది. నాన్నకు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై తొలి సంతకం చేసిన దగ్గరి నుంచి ఆయన తెచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలు మార్చేశాయి.

రైతును రాజుగా నిలిపాయి. అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్లపై నిలబడేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసాను కల్పించాయి. ఎంతోమంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్ర ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్రయాణం కొనసాగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement