
ఎన్నికల వాకిట్లో నిలబ డిన ఆంధ్రప్రదేశ్, ఒక్కసారి అవలోకనం చేసుకుంటే ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన సోషల్ టెర్రర్ భయంక రంగా కనిపిస్తుంది. బలహీ నుడి జీవితంపై బలవం తుడి అవహేళన తల ఎగ రేస్తూ కనిపిస్తుంది. శ్రామిక కులాల ఆత్మగౌరవంపై పెత్తందారీ దాడి కనిపి స్తుంది. ఆర్థిక–రాజకీయ ఆలంబన లేని పెద్ద కులా లను సైతం కించపరచడం కనిపిస్తుంది. కళ్లు నడి నెత్తికెక్కిన నడమంత్రపు సిరిమంతుల దాష్టీకం జుగు ప్సాకరంగా కనబడుతుంది. ఎందరెందరో సంఘ సంస్కర్తలకు పుట్టినిల్లుగా భాసిల్లిన ప్రాంతం ఆంధ్రావని. సామాజిక చైత న్యానికి ఇది పురిటిగడ్డ. ఈ గడ్డమీద గడిచిన ఐదేళ్లుగా జరుగుతున్న అణచివేత కార్యక్రమం ఆందోళన కలిగిస్తున్నది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలే ప్రత్యక్షంగా నాయకత్వం వహిస్తున్న తీరును చూస్తుంటే మనస్తాపం కలుగుతున్నది.
‘‘మంచి చెడ్డలు మనుజులందున, ఎంచి చూడగా, రెండే కులములు. మంచి అన్నది మాల అయితే, మాలనేనగుదున్...’’ మహాకవి గురజాడ ఆ మాటలు అని నూటపాతికేళ్లయింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడిన తీరు చూడండి. ‘‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?.’’ సాక్షాత్తూ మీడియా సమావేశంలోనే నిర్భయంగా ఆయన తన స్వభావాన్ని చాటుకున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును ఈ మాటలు ఉల్లంఘించడం కాదా? దళితులపైనే కాదు.. మహిళలపైనా చులకన భావమే. ‘‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’’ అని బహిరంగంగానే ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మగపిల్లాడైతే మహాభాగ్యమనీ, అటువంటి భాగ్యాన్ని కోడలు ప్రసాదిస్తానంటుంటే అత్త వద్దం టుందా? అని దాని తాత్పర్యం. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇటువంటి వివక్షాపూరిత వ్యాఖ్యలు చేస్తారా?... ఇటువంటి వ్యక్తికి ప్రజా కోర్టులోనైనా శిక్షపడవలసిన అవసరం లేదా?
పలనాటి బ్రహ్మనాయుడు ‘చాప కూడు’ ఉద్యమాన్ని తొమ్మిది వందల యేళ్ల కిందట ఈ తెలుగు నేలపై ప్రారంభించాడు. ఒకరిది ఎక్కువ కులము, ఒకరిది తక్కువ కులము కాదని చాటి చెబుతూ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ స్ఫూర్తి ఏమైంది? రాష్ట్ర మంత్రిగా ఉన్న ప్రబు ద్ధుడొకడు ‘‘దళితులు స్నానం చేయరు. శుభ్రంగా ఉండరు’’ అని బాహాటంగా మాట్లాడి కూడా నిక్షేపంగా మంత్రిగా కొనసాగాడు. ఆ వ్యక్తి శిక్షార్హుడు కాదా? నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా కాలికి గండపెండేరాన్ని తొడిగి తన జన్మ తరించిందని మురిసిపోయాడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధులైన జంట కవుల్లో ఆయన ఒకరు. ఆ సుహృద్భావం, ఆ సాంఘిక బాంధవ్యం ఇప్పుడేమైంది? అతడొక అధికార పార్టీ శాసన సభ్యుడు, ముఖ్యనేతకు సన్నిహితుడని చెబుతారు. ‘‘దళితులు మీకెందుకురా రాజకీయాలు, పిచ్చ.... కొడుకుల్లారా’ అని పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడినా కూడా అతనికి మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ లభించింది. మహిళ అన్న చులకన భావంతో ఒక తహసీల్దారును జుట్టుపట్టుకొని ఈడ్చిన మరో ఘనకీర్తి కూడా ఇతనికి వుంది. కండకావరంతో రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తున్న ఇటువంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా?
‘‘మరలనొకమాటు వెనుకకు మరలి చూచి, దిద్దుకోవమ్మ, బిడ్డల తెనుగుతల్లీ’’ అన్నారు జంధ్యాల పాపయ్యశాస్త్రి. ‘‘చెక్కు చెదరని, ఏనాడూ మొక్కవోని ఆంధ్రా పౌరుషమిపుడు అధ్వాన్న మాయే’’నని వాపోతూ పరిస్థితిని చక్కదిద్దమని తెలుగుతల్లిని వేడుకున్నారు. ఈ ఐదేళ్లలో జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తుంటే ఓటరు రూపంలో ఉన్న తెలుగుతల్లిని వేడుకోవాలనిపిస్తున్నది. తల్లీ.. ఈ పరిస్థితులను చక్కదిద్దమని. ఇక్కడ ప్రస్తావించిన ఉదాహరణలు ప్రభుత్వ పెద్దల నిర్వాకాలు మాత్రమే. దళితులు, బలహీనవర్గాల ప్రజలపై చోటామోటా నాయకులు చేసిన దౌర్జన్యాలను పూస గుచ్చితే ఒక పుస్తకం వేయాల్సి వుంటుంది. ఒక్క దళితులనే కాదు ఇతర సామాజికవర్గాలతో కూడా ప్రభుత్వాధినేత వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యం తరకరంగా వుంది.
మంగళవాద్యకారుల సన్నాయి మోగితేనే దేవుని కల్యాణం జరిగేది. అటువంటి నాయీ బ్రాహ్మణులు తమ సమస్యలమీద విజ్ఞాపన ఇవ్వడానికి వెళ్లిన ప్పుడు, స్వయంగా ముఖ్యమంత్రే వాళ్లను బెది రించడం, తోకలు కత్తిరిస్తానని దూషించడం చూసి రాష్ట్ర ప్రజలంతా అవాక్కయ్యారు. నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవం గాయపడింది. ఎస్టీ జాబితాలో చేర్చుతామని తమకిచ్చిన హామీని నెరవేర్చాలని విశాఖలో మత్స్యకారులు ధర్నా చేశారు. అక్కడ కొచ్చిన ముఖ్యమంత్రిని ఒక ప్రతినిధి బృందం కలుసుకుంది. ఆ బృందంపై ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. ‘తోలుతీస్తా, ఖబడ్దార్’ అని బెదిరించారు. మీ ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయను. ఏం తమాషా చేస్తున్నారా? అంటూ వాళ్లివ్వబోయిన వినతి పత్రాన్ని కూడా తీసుకోలేదు. తోటి మత్స్యకార సంఘాల ప్రతినిధులముందే ఆ వర్గానికి చెందిన శాసన సభ్యుడిని కూడా ఈసడిం చుకున్నారు. ముఖ్యమంత్రి తమను నమ్మించి నడి సంద్రంలో వదిలేశారని మత్స్యకారులు రగిలి పోతున్నారు.
చినబాబు కోటరీ, పెదబాబు కోటరీగా చలా మణి అయ్యే చోటామోటా పాత్రల మాటకు ఉన్న విలువ సీనియర్ మంత్రులైన కె.ఇ.కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు వంటి బీసీ నేతలకు లేదని ఎవరినడిగినా చెబుతారు. బోయలను ఎస్టీలలో చేర్చుతామని, రజకులను ఎస్సీలలో కలుపుతామని, కాపులకు బీసీకోటా ఇస్తామని గడిచిన ఎన్నికలకు ముందు ఇప్పుడధికారంలో ఉన్న పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలపై వ్యవహరించిన తీరును కూడా చూశాం. పాపం.. ముద్రగడ పద్మనాభం.. గౌరవ మర్యా దలకు భంగం కలుగకుండా రాజకీయ రంగంలో నిలబడినవాడు. నిజాయితీ పరుడిగా పేరు సంపాదించుకున్నారు. కాపులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఉద్యమ బాటపట్టాడు. అదే ఆయన చేసిన మహాపరాధం. ఇంటి మీదకు పోలీసులను పంపించి ప్రదర్శించిన రౌడీయిజాన్ని రాష్ట్రమంతా చూసింది. కుటుంబ సభ్యులపై చేయి చేసుకున్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారు. కలకంఠి కంట కన్నీరొలికితే అరిష్టం అంటారు. ముద్రగడ వారింటి మహిళల చేత కన్నీరు పెట్టించారు. ఆ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు కనిపించిన ముద్రగడ కంటతడి దృశ్యం పాలక పార్టీని ఎప్పటికీ వెన్నాడు తూనే వుంటుంది.
బ్రాహ్మణ జాతి గౌరవాన్ని కూడా పాలకులు గాయపరిచారు. అనువంశిక అర్చకత్వం రద్దు పట్ల వారు ఆవేదనకు లోనయ్యారు. పైపెచ్చు పదవీ విరమణను ప్రవేశపెట్టారు. దేవుడి మాన్యాలను పచ్చనేతలు ఎక్కడికక్కడ దిగమింగారు. గుళ్లను కూల్చివేసి అర్చకులను వీధులపాల్జేశారు. ఐవైఆర్ కృష్ణారావు, రమణదీక్షితుల విషయంలో వ్యవహరిం చిన తీరుపట్ల మొత్తం సమాజంలోనే అభ్యంతరం వ్యక్తమయింది. చాణక్యుడిని అవమానించిన నంద రాజులను గుర్తుకు తెచ్చారు. యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోపిడీ చేసిన ఫలితంగా, గనులనూ, వనులనూ చెరబట్టి పీల్చేసిన కారణంగా, వాగులను వంకలను ధ్వంసం చేసి ఇసుకను పిండుకున్న కారణంగా, మట్టినీ వది లిపెట్టని అవినీతి కారణంగా పాలక పార్టీలో కిందినుంచి పై వరకు అత్యధికులు తెగబలిసిపో యారు.
అర్థంతరంగా, అనాయాసంగా సంపాదన వచ్చిపడితే చాలామందికి కన్నూమిన్నూగానని కావరం అలవడుతుంది. అప్పుడు రాజ్యాంగం, పౌర హక్కులు కనిపించవు, సంఘం, కట్టుబాట్లు, ప్రజల ఆత్మగౌరవం కనిపించవు. ఈ విపరీత ధోరణికి చరమగీతం పలుకగలిగిన వాడు ఈ సందర్భంలో ఓటరు దేవుడు ఒక్కడే. గజేంద్రమోక్షం ఘట్టంలో బమ్మెరపోతన చెప్పిన పద్యం ఇప్పుడిక్కడ మోక్షమార్గం. ‘‘ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై, యెవ్వ నియందు డిందు, బరమేశ్వరుడెవ్వడు... వాని నాత్మ భవునీశ్వరునే శరణంబు వేడెదన్’’ అంటాడు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ‘మూలకారణంబెవ్వడో, అనాది, మధ్యలయుడెవ్వడు సర్వముదానైనవాడె వ్వడో’ అట్టి ఓటరు మహాశయుణ్ణే శరణంబు వేడెదన్..
వర్ధెల్లి మురళి