ఎంత సీన్ చేశావు పవన్!

ఎంత సీన్ చేశావు పవన్! - Sakshi


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గొప్ప ఆలోచనా విధానంతో వచ్చాడని తొలుత చాలా మంది భావించారు. జనసేన పార్టీ ప్రకటించిన సభలో అతను మాట్లాడిన తీరు కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఆ తరువాత అతను కూడా రాజకీయంగా ఒక వైపునకు వరిగిపోయారు.  మొదట మాట్లాడిన మాటలకు, ఆ తరువాత మాట్లాడిన మాటలకు పొంతనలేదు. దాంతో అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారు అతను కూడా  ఒక సాధారణ రాజకీయవేత్తేనని పెదవి విరిచారు. పవన్ కళ్యాణ్ మాటతీరు, అతని ఆవేశం చూసి చాలా మంది అతను రాజకీయాలలోకి వస్తే బాగుంటుందని అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడానికి ముందే పవన్ 'కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్'  ప్రారంభించాను. ప్రజారాజ్యం పార్టీ స్థాపన తరువాత అతని ఆవేశపూరిత ప్రసంగాలు చూసి చాలా మంది ఆకర్షితులయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపివేయడాన్ని ఆయన తప్పుపట్టి మౌనంగా ఉండిపోయారు. అప్పుడు కూడా పవన్పై అభిమానం ఏమాత్రం తగ్గలేదు. అటువంటి వ్యక్తి రాజకీయాలలోకి రావాలని ఆశించారు. చాలా మంది ఆహ్వానించారు.చివరకు ఓ రోజు హైదరాబాద్ హైటెక్ ప్రాంతం మాదాపూర్లోని నోవాటెల్లో 'జనసేన'గా పార్టీ పేరును ప్రకటించారు. ఓట్లు చీలకుండా ఉండటం కోసం ప్రస్తుతం తమ పార్టీ తరపున  ఎన్నికలలో పోటీ చేయడంలేదని చెప్పారు. ఆ రోజు అతని ఆవేశం చూసిన వారు, ప్రసంగం విన్నవారు పవన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. క్యూబా విప్లవ కెరటం చేగువేరా జీవితం తనకు స్ఫూర్తి అని చెప్పారు.  లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, నారాయణ్ గురు, మార్టిన్ లూధర్ కింగ్ వంటివారు తనకు ఆదర్శం అన్నారు. సినిమాల్లో మణిరత్నం, సత్యజిత్ రే, రుత్విక్ ఘటక్, రాజ్‌కపూర్, గురుదత్, అకీరా కురసోవా వంటి దర్శకులు తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు. ప్రశ్నించడం కోసం రాజకీయాలలోకి వస్తున్నట్లు తెలిపారు. దాంతో పవన్ను ఆదర్శమూర్తుల జీవితాలను ఔపోసన పట్టిన ఓ మేథావిగా చాలా మంది భావించారు. ప్రస్తుత సమాజంలో పేరుకుపోయిన అవినీతి కూకటివేళ్లతో పెకలించివేస్తారని, ఓ సరికొత్త రాజకీయానికి నాందిపలుకుతారని పలువురు ఆశించారు. ఆ వెంటనే పవన్ గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిశారు. అంతేకాకుండా మోడీ వంటి వ్యక్తి ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడకు వచ్చి బిజెపి-టిడిపి కూటమికి మద్దతు పలికారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీలతో కలిసి ఎన్నికల ప్రచార సభలలో సినిమాలలో మాదిరి డైలాగులు చెప్పడం మొదలు పెట్టారు.ఈ నేపథ్యంలో అంతకు ముందు పవన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారు ఒక్కసారిగా డీలాపడిపోయారు. మోడీ గురించి, ఆయన భావాలు, బిజెపి సిద్దాంతం గురించి పవన్కు ఏం తెలుసు? గుజరాత్లో జరిగిన అభివృద్ధి ఏమిటి? అక్కడ వ్యవసాయ కూలీల పరిస్థితి  తెలుసా? వైద్య రంగానికి గుజరాత్ ప్రభుత్వం కేటాయింపులు తెలుసా?  గుజరాత్లో  సృష్టించిన నరమేధం, వేలాది మంది ముస్లింలను ఊచకోత కోసిన విషయం తెలుసా ? నిండు గర్భిణులపై దారుణంగా అత్యాచారాలు చేసి, అత్యంత కిరాతకంగా కత్తులతో పిండాలను బయటకు తీసి నరికి చంపిన విషయాలు తెలుసా?  అని పవన్ను ప్రశ్నిస్తున్నారు.  ఆధ్యాత్మిక నగరంగా ప్రశిద్దిపొందిన వారణాసి నుంచి మోడీ లోక్సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  మోడీకి కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్నప్పటికీ అక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తారని అక్కడి కాషాయధారి సన్యాసులు, స్వాములు, జగద్గురువులు  భయపడుతున్నారు. అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.  మరో వైపు ముస్లిం ధార్మిక గురువు మౌలానా మెహదీ హసన్ బాబా కూడా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇవన్నీ నువ్వు ఆలోచించావా? అని పవన్ను పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అడ్డదారిన అధికారంలోకి వచ్చిన విషయం తెలియదా? బాబు 9 ఏళ్ల చీకటి పాలన, ఆయన  పాలనలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, బషీర్బాగ్, కాల్ధరి పోలీసు కాల్పులు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.  బిజెపి,మోడీ, చంద్రబాబు వంటి వారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నీవు ఆ రోజు చేగువేరా వంటి విప్లవవీరుడి పేరు చెప్పడం ఏమిటని ఆయన అభిమానులే ప్రశ్నిస్తున్నారు. అసలు నీ ఆలోచనలు ఏమిటి? చేగువేరా గురించి నీకు ఏమి తెలుసు? బిజెపి గురించి, మోడీ గురించి నీకు ఏమి తెలుసు? ఎటువంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నావు?  నీకు ఒక స్పష్టత ఉండా?  నీ సిద్దాంతం ఏమిటి? నీకు అసలు ఒక సిద్దాంతం ఉందా? ఏం మాట్లాడావు? ఎవరితో తిరుగుతున్నావు? నీకు రాజకీయాలు తెలుసా?  ఎన్నికల ప్రచారంలో ఎవరో రాసిచ్చిన ప్రకారం సినిమా డైలాగులు చెప్పే నీకు అంతటి ఆవేశం దేనికని అడుగుతున్నారు.  మోడీతో సమావేశమైన రోజునే నీ అసలు రంగు తెలిసిందని అంటున్నారు. ఈ రోజు పవన్ మాటల తీరును చూసి అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అనే మంది తమ ఆశలు ఒమ్ము చేశాడని  బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్  ముసుగులన్నీ తొలగించుకోని, స్వతంత్ర భావావాలతో ముందుకు రావాలని  వారు కోరుకుంటున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top