అధీనరేఖ మళ్లీ రక్తసిక్తం! | Pakistani forces kill five Indian soldiers in cross-border strike | Sakshi
Sakshi News home page

అధీనరేఖ మళ్లీ రక్తసిక్తం!

Aug 8 2013 12:01 AM | Updated on Sep 1 2017 9:42 PM

విఫల రాజ్యం తనకు తానే కాదు... ఇరుగు పొరుగు దేశాలకూ ఎంత ముప్పుగా పరిణమిస్తుందో పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. జమ్మూ-కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో అధీన రేఖ ఆవలి నుంచి వచ్చిన సాయుధ ముఠా గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై సోమవారం రాత్రి కాల్పులు జరిపి ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది.

సంపాదకీయం: విఫల రాజ్యం తనకు తానే కాదు... ఇరుగు పొరుగు దేశాలకూ ఎంత ముప్పుగా పరిణమిస్తుందో పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. జమ్మూ-కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో అధీన రేఖ ఆవలి నుంచి వచ్చిన సాయుధ ముఠా గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై సోమవారం రాత్రి కాల్పులు జరిపి ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఆ వచ్చినవారు పాకిస్థాన్ సైనికులా, ఉగ్రవాదులా అన్న అంశంపై జరుగుతున్న చర్చ సంగతి అలా ఉంచితే పాకిస్థాన్ భూభాగం నుంచి వచ్చినవారు ఈ ఘటనకు పాల్పడ్డారన్నది మాత్రం వాస్తవం. పూంచ్ సెక్టార్‌లో జరిగిన కాల్పుల్లో తమ సైన్యం ప్రమేయమేమీ లేదని పాకిస్థాన్ ప్రకటించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్‌లో జరుగుతున్న వివిధ ఉగ్రవాద ఘటనలకు మూలాలు తమవద్దే ఉన్నాయని పదే పదే రుజువవుతున్నా వాటిని నిరోధించడానికి పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోలేకపోతోంది.
 
 తాజా ఘటన ఆ పరంపరకు కొనసాగింపేనని గ్రహించి తన వైఫల్యాన్ని అంగీకరించక పోగా ‘మా సైన్యం కాల్పులకు దిగలేద’ని చెబితే సరిపోతుందని పాక్ ప్రభుత్వం ఎలా అనుకుంటున్నదో అర్ధం కాదు. 2003లో అధీన రేఖ వద్ద కాల్పుల విరమణ ప్రకటించాక మూడు నాలుగేళ్లపాటు సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి. అటు తర్వాత అడపా దడపా కాల్పులు, మిలిటెంట్ల చొరబాటు యత్నాల వంటివి చోటుచేసుకోవడం మళ్లీ మొదలయ్యాయి. గత రెండేళ్లుగా అధీనరేఖ వద్ద పరిస్థితి మొదటికొస్తున్న సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి.
 
  గత ఏడాది కాల్పుల విరమణకు సంబంధించి అక్కడ మొత్తం 44 ఘటనలు చోటుచేసుకోగా ఈ ఏడాది సోమవారం ఘటనతో కలుపుకుంటే ఇప్పటికే 57 ఘటనలు జరిగాయి. ఈ జనవరిలో మెంధార్ సెక్టార్‌లో పాక్ దళాలు ఇద్దరు భారత జవాన్లను కాల్చిచంపి వారిలో ఒకరి తలను ఎత్తుకుపోయాయి. మన సైన్యం చెబుతున్నదాన్ని బట్టి ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలోనూ 100 మంది ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు. ఈ రెండు నెలల కాలంలోనే మన సైన్యం 19 మంది ఉగ్రవాదులను కాల్చిచంపింది. ఇవన్నీ అధీనరేఖ వద్ద ఆనాటికానాటికి పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నప్పుడల్లా మన ప్రభుత్వం పాకిస్థాన్‌కు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నది. కానీ, పరిస్థితి నానాటికీ దిగజారుతోంది తప్ప మెరుగుపడటం లేదు.
 
  పాకిస్థాన్‌తో వచ్చిన సమస్యేమిటంటే అది భౌగోళికంగా ఒక ప్రాంతమే అయినా, దానిపై పటిష్టమైన నియంత్రణగల రాజ్యవ్యవస్థ అక్కడ కొరవడింది. అక్కడి పౌర ప్రభుత్వం అధీనంలో ఉండటాన్ని సైన్యం నామోషీగా భావిస్తుంది. గత ఐదేళ్లుగా అలా చెప్పుచేతల్లో ఉంటున్నట్టు కనబడుతున్నా అది అంతంత మాత్రమే. ఇలాంటి అనిశ్చితిలో పాకిస్థాన్‌లో ఏమైనా జరగవచ్చు. ఉగ్రవాది బిన్ లాడెన్ రాజధాని నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్నా ఏళ్ల తరబడి ఆ సంగతిని గ్రహించలేని నిస్సహాయ స్థితి పాక్ ప్రభుత్వానిది. ఎక్కడో ఉన్న అమెరికా సైన్యం ఆకాశమార్గంలో వచ్చి లాడెన్‌ను చంపి శవాన్ని సైతం పట్టుకెళ్లాకగానీ అక్కడి పాలకవ్యవస్థకు తెలియలేదు.
 
 రెండు నెలలక్రితం పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వస్తుందేమోనని అందరూ ఆశించారు. దానికితోడు షరీఫ్ కూడా అలాగే మాట్లాడారు. ఇరుదేశాల సంబంధాల్లోనూ ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. భారత్ లక్ష్యంగా సాగుతున్న ఉగ్రవాద దాడులకు తమ భూభాగం వేదిక కాకుండా గట్టి చర్యలు తీసుకుంటానని చెప్పారు. కానీ, మాటలు చెప్పినంత వేగంగా పరిస్థితులు మారలేదని అధీన రేఖ వద్ద యథావిధిగా కొనసాగుతున్న దుందుడుకు చేష్టలు నిరూపిస్తున్నాయి. భారత్‌తో సయోధ్యకు పాక్ నాయకత్వం ప్రయత్నించి నప్పుడల్లా ఆ వాతావరణాన్ని చెడగొట్టడానికి సైన్యం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు జరిగిన ఘటన కూడా దానికి కొనసాగింపే కావచ్చు. ఎందుకంటే, వచ్చే నెలలో ఇరు దేశాల ప్రధానులూ ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా కలవాల్సి ఉంది. దానికితోడు పాకిస్థాన్ సైనిక దళాల చీఫ్ అష్ఫాక్ కయానీ రిటైర్ కావాల్సి ఉంది. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశం ప్రస్తుతం షరీఫ్ పరిశీలనలో ఉంది. షరీఫ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు, భారత ప్రధానితో చర్చలకు ముందు ఆయన్ను ఇరకాటంలో పెట్టేందుకు సైన్యం ప్రయత్నించి ఉండవచ్చు.
 
  ఇలాంటి సమయంలో సమష్టిగా వ్యవహరించి, భారత్ నిరసనను పాకిస్థాన్‌కు ముక్తకంఠంతో తెలియజెప్పాల్సిన ప్రస్తుత తరుణంలో యూపీఏ ప్రభుత్వం తొట్రుపాటు పడిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అధీన రేఖ ఘటనలో తమ సైన్యం ప్రమేయంలేదని పాక్ చేతులు దులుపుకుంటే, మన రక్షణ మంత్రి ఆంటోనీ ‘ఉగ్రవాదులు, పాక్ సైనిక దుస్తుల్లో ఉన్న మరికొందరు’ కాల్పులు జరిపారని ప్రకటించారు. ఆయన ఆంతర్యమేమిటోగానీ, ఆ ప్రకటన సారాంశం మాత్రం పాక్ సైన్యానికి ప్రమేయంలేదని చెప్పినట్టే ఉంది. పాక్ సైన్యం కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నదని అంతకు గంట క్రితమే జమ్మూ నుంచి సైనిక ప్రతినిధి ప్రకటించారు.
 
 ఇలా భిన్నస్వరాలు వినబడటానికి కారణమేమిటి? పాక్ సైన్యమూ, దాని కనుసన్నల్లో నడిచే ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు తోడ్పాటునంది స్తున్నట్టు పదే పదే రుజువవుతున్నా ఇంత ‘జాగ్రత్తగా’ ప్రకటన చేయాల్సిన అవసరం ఆంటోనికి ఏమొచ్చింది? ఇలాంటి అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరిం చకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై గట్టిగా ఒత్తిడి తెచ్చి, అక్కడి సైన్యం తీరుతెన్నులను ప్రపంచానికి వెల్లడించడం ద్వారా వారిని ఏకాకులను చేయవలసిన ప్రస్తుత తరుణంలో తడబాట్లకు తావుండకూడదు. దౌత్యపరంగా గట్టిగా వ్యవహరించాల్సిన తరుణంలో మనల్ని మనం బలహీనపరుచుకోకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement