‘అధికార’ దండం.. అధికారులకు గండం | tdp leaders pressure on officers | Sakshi
Sakshi News home page

‘అధికార’ దండం.. అధికారులకు గండం

May 2 2017 11:43 PM | Updated on Aug 10 2018 9:42 PM

జిల్లాలో ఉన్నతాధికారులకే రక్షణ కరువవుతోంది. వారి సీట్లలో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి ఉంది.

- ప్రభుత్వోద్యోగులపై అధికమైన వేధింపులు
- అధికార పార్టీ నేతలకు ‘జీహుజూర్‌’ అనకపోతే అథోగతే
- ఉన్నతాధికారుల వత్తాసు కూడా వారికే
-తోటి సిబ్బంది అండా కరువే
- తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో బలవన్మరణాలు
- మొన్న సాక్షర భారత్‌ డీడీ ఈశ్వరయ్య
- నేడు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కనకసింహన్‌


ఫిబ్రవరి 2, 2015 : సాక్షరభారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఈశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్నారు. సహచర ఉద్యోగుల వేధింపులు తాళలేక కార్యాలయంలోనే ఫ్యాను ఉరివేసుకొని బలవన్మరం చెందారు.

మే2, 2017 : ఆర్‌డబ్ల్యూఎస్‌ అనంతపురం డివిజన్‌ ఈఈ కనకసింహన్‌ ఆత్మహత్య. పోస్టింగ్‌ రాకుండా వేధిస్తున్నారన్న మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకొని తనువు చాలించారు.

అనంతపురం సెంట్రల్‌ / సిటీ : జిల్లాలో ఉన్నతాధికారులకే రక్షణ కరువవుతోంది. వారి సీట్లలో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి ఉంది. మితిమీరిన రాజకీయ జోక్యం, ఉన్నతాధికారుల నుంచి సహకారం కొరవడడం, సహచర సిబ్బంది వేధింపులు వెరసి జిల్లా ఉన్నతాధికారులే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 2015 ఫిబ్రవరి రెండున సాక్షరభారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఈశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనను మరవకముందే గ్రామీణ నీటిసరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అనంతపురం డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌(ఈఈ) కనకసింహన్‌ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయన ఆత్మహత్య వెనుక కూడా రాజకీయ వేధింపులు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. పోస్టింగ్‌ తెచ్చుకోవడం దగ్గర నుంచి సవ్యంగా విధులు నిర్వర్తించాలన్నా అధికార పార్టీ నేతల ఆశీస్సులు కావాల్సి వస్తోంది. గెజిటెడ్‌ అధికారి హోదా కలిగినా.. రాజకీయ అండదండలు లేకపోతే పనిచేయలేని పరిస్థితి. ముఖ్యంగా కాసులు గలగల వినిపించే శాఖల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

గ్రామీణ నీటి సరఫరాలో ఆర్‌డబ్ల్యూఎస్‌ కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం తాగునీటి సరఫరాకే ప్రతియేటా రూ.20 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు తాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌ట్యాంక్‌ నిర్మాణాలు, ఇతరత్రా అభివృద్ధి పనులు ఈ శాఖ ద్వారా జరుగుతున్నాయి. వీటిని దక్కించుకోవడానికి అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగుతుండటంతో అధికారులు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికారపార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తితే విధులు నిర్వర్తించుకోవచ్చు. లేదంటే తప్పుకోవాల్సిందే. ఇందులో భాగంగానే ఈఈ కనకసింహన్‌ కూడా ఎనిమిది నెలల క్రితం దీర్ఘకాలిక సెలవులో వెళ్లాల్సి వచ్చిందనే అభిప్రాయం ఆ శాఖ ఉద్యోగుల్లోనే వ్యక్తమవుతోంది. ఈయన నాలుగురోజుల క్రితం తిరిగి విధుల్లో చేరేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామ్‌నాయక్‌ను కలిశారు. ఆయన మాత్రం ‘మేడమ్‌ (మంత్రి పరిటాల సునీత)ను కలిసి రా.. విధుల్లోకి చేర్చుకుంటా’ అని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
 
భారీగా తరలివచ్చిన సహోద్యోగులు
ఈఈ కనకసింహన్‌ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ గది వద్దకు చేరుకున్నారు. చాలా మంచి అధికారి అని,  విధుల్లో అంకిత భావంతో కొనసాగేవారని వారు అన్నారు. ఆయన లేని లోటు శాఖలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.కాగా.. కనకసింహన్‌ కుటుంబ సభ్యులను జిల్లా పరిషత్‌ సీఈఓ రామచంద్ర, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామ్‌నాయక్‌  పరామర్శించారు. కారణాలు ఏవైనా కనక సింహన్‌ ఇలా దూరమవడం బాధాకరమన్నారు.

నా వైపు నుంచి వేధింపులు లేవు - ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హారేరామ్‌నాయక్‌
కనకసింహన్‌ విధి నిర్వహణలో అంకితభావంతో ఉండేవారు. కారణాలు తెలియదు గానీ ఎనిమిది నెలల క్రితం  మెడికల్‌ లీవులో వెళ్లిపోయారు. తిరిగి నాలుగు రోజుల క్రితం వచ్చారు. జాయిన్‌ కమ్మని చెప్పాను. మరో వారం గడువు కోరారు. సరే అన్నాను. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసి ఆశ్చర్యపోయాం. నావైపు నుంచి ఆయనకు ఎలాంటి వేధింపులూ లేవు.

పరిటాల సునీత, ఎస్‌ఈ వేధింపులే కారణం - కనకసింహన్‌ భార్య రజనీ
 మా ఆయనకు మొదట పెనుకొండకు పోస్టింగ్‌ వస్తే అక్కడ విధులు నిర్వర్తించకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. ఆయన విధుల నుంచి బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం విధుల్లోకి తిరిగి చేరేందుకు ఎన్ని సార్లు ప్రయత్నించినా అవకాశం ఇవ్వకుండా వేధించారు. నా భర్త సున్నిత స్వభావం కలిగినవారు. అలాంటి వ్యక్తి చేయని తప్పునకు నరకం అనుభవించారు. ఆ మహానుభావుడు (ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామ నాయక్‌) వచ్చాక మరింత ఇబ్బంది పడ్డారు. విధుల్లోకి చేరదామనుకుంటే చాలు మేడమ్‌ (మంత్రి పరిటాల సునీత)ను కలవండని చెప్పేవారు. ఆమెకు లేనిపోనివి చెప్పి ఉద్యోగంలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయారు. మాకు జరిగిన అన్యాయం మరే ఉద్యోగి కుటుంబానికీ జరగకూడదు.

నా భర్తకూ అలాగే జరుగుతుందేమో!
-ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రామయ్య భార్య సునీత ఆందోళన
మా ఆయన రామయ్య ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఉరవకొండ డీఈగా పనిచేస్తున్నాను. నేను ఇదే శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిని. ఇక్కడ డిప్యూటేషన్‌లపై విధుల్లో కొనసాగే వారికే మనుగడ ఉంటుంది. వాస్తవంగా నా భర్తకు పోస్టింగ్‌ ఉరవకొండ కాగా.. ఆయన అక్కడ విధులకు వెళ్లిన నాటి నుంచి చేతిపంపులు, బోరు బావులు ధ్వంసం చేయడం వంటివి జరిగాయి. దీంతో నీరు కూడా కలుషితమైంది. ఈ ఇబ్బందులను గుర్తించిన ఆయన విషయాన్ని ఎస్‌ఈ హరేరామ్‌నాయక్‌కు వివరించారు. ఆయన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ను కలిసి సమస్య చెప్పాలని సూచించారు. దీంతో వికలాంగురాలైన నేను, నా భర్తతో కలిసి ఎమ్మెల్సీ కేశవ్‌ను కలిశాము. పెద్దగా స్పందించలేదు. దీంతో చేసేది లేక తిరిగి ఎస్‌ఈని కలవగా సర్కిల్‌ ఆఫీసులోనే పోస్టింగ్‌ (డిప్యూటేషన్‌పై) ఇచ్చారు. కనక సింహన్‌ చాలా మంది అధికారి. ఆయనలా నా భర్తకూ ఇలాంటి గతి పట్టకూడదని ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నా.

ఆ పోస్టు చాలా కీలకం
ఆర్‌డబ్ల్యూఎస్‌లో అనంతపురం డివిజన్‌ ఈఈ పోస్టు చాలా కీలకమైనది. ఈ డివిజన్‌ పరిధిలో తాడిపత్రి, ఉరవకొండ, గుంతకల్లు, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాలు వస్తాయి. కీలకమైన శ్రీరామరెడ్డి,  సత్యసాయి, జేసీ నాగిరెడ్డి తదితర తాగునీటి పథకాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనికితోడు ఏడాదిలో 365 రోజుల పాటు తాగునీటిని సరఫరా చేస్తున్న గ్రామాలు యల్లనూరు, పుట్లూరు మండలాల్లో చాలా ఉన్నాయి.

ఏడాదిలో  రూ.10 కోట్లకు పైగా కేవలం తాగునీటి సరఫరాకే ఈ డివిజన్‌లో వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులు ఈఈ కనకసింహన్‌ను ఈ పోస్టులోకి రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈకి పీఏగా ఉండాల్సిన ఓ అధికారి ఉరవకొండ డీఈగా అదనపు బాధ్యతలు ఇప్పించుకున్నారు. అది చాలదన్నట్లు అనంతపురం ఈఈగానూ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈఈ పోస్టు ఎంత కీలకమో అర్థమవుతోంది. ఈఈగా కనకసింహన్‌ ఉంటే తమ అక్రమార్జనకు అడ్డు తగులుతారనే ఉద్దేశంతో ఆయన్ను అడుగడుగునా అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement