విధులకు రాకున్నా రిజిస్టర్‌లో సంతకాలు చేసిన వైద్యులపై కలెక్టర్ కోన శశిధర్ కొరడా ఝుళిపించారు. ఓ వైద్యుడిని సరెండర్ చేయడంతో పాటు మరొకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
► డీఎంఈకి డాక్టర్ విజయానంద్ సరెండర్
► మరో డాక్టర్ ఆత్మారాంకు షోకాజ్ నోటీస్
► విధులకు డుమ్మా కొట్టడంపై సీరియస్
► బయోమెట్రిక్ అమలుకు సన్నాహాలు
అనంతపురం: విధులకు రాకున్నా రిజిస్టర్‌లో సంతకాలు చేసిన వైద్యులపై కలెక్టర్ కోన శశిధర్ కొరడా ఝుళిపించారు. ఓ వైద్యుడిని సరెండర్ చేయడంతో పాటు మరొకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనిఖీలో బట్టబయలు కలెక్టర్ శశిధర్ ఈనెల 11న జిల్లా సర్వజనాస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్థో డాక్టర్ ఆత్మారాంతో పాటు చిన్నపిల్లల విభాగంలోని వైద్యుడు విజయానంద్ డ్యూటీ రిజిస్టర్‌లో సంతకాలు చేసి విధులకు డుమ్మా కొట్టినట్లు గుర్తించారు. అదే రోజు ఆర్థో హెచ్‌ఓడీ డాక్టర్ జయచంద్రారెడ్డి, పీడియాట్రిక్ హెచ్‌ఓడీ డాక్టర్ మల్లీశ్వరికి సంజాయిషీ కోరారు. ఈ క్రమంలో డాక్టర్ ఆత్మారాం సెలవులో ఉన్నారని, అయితే సంతకం ఎవరు చేశారో తెలియదని సంబంధిత హెచ్‌ఓడీ తెలిపారు.
పిడియాట్రిక్‌లో మాత్రం డాక్టర్ వచ్చి సంతకం చేసి కర్నూలుకు వెళ్లిపోయినట్లు వైద్యులు చెప్పారు. అయితే ఆ రోజు ఆయన విధులకే రాలేదని తెలుసుకున్న కలెక్టర్ శశిధర్ డాక్టర్ విజయానంద్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. పనుండి వెళ్లిపోయినట్లు తెలిసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌కు ఆదేశాలిచ్చారు. దీంతో ఆయన ఈ రెండు విభాగాల హెచ్‌ఓడీలతో మాట్లాడారు. విచారణ చేసి నివేదికను కలెక్టర్‌కు పంపారు. ఈ క్రమంలో ఆదివారం డాక్టర్ విజయానంద్‌ను డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)కు సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎంఈని కోరారు. డాక్టర్ ఆత్మారాంకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సెలవులో ఉన్నా సంతకం ఎవరు చేశారన్న దానిపై వివరణ కోరారు. మరోవైపు వైద్యుల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టేందుకు మూడ్రోజుల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఉద్యోగుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.