govt doctors
-
సారూ.. ఇదేం తీరు
సాక్షి నాగర్ కర్నూల్/అచ్చంపేట రూరల్: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది తీరు మారడం లేదు. ఎన్నిసార్లు సస్పెండ్లు చేసినా.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నా.. తమ పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా గురువారం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్ సెంటర్లోకి ఓ ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకుడు శిశువుల రక్త నమూనాలు తీసుకెళ్లడానికి వచ్చాడు. శిశువుల నుంచి రక్త నమూనాలు తీసుకుని వారి బంధువుల వద్ద ఒక్కొక్కరి దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడు. ఆస్పత్రిలోని ఓ నర్సు టీఎస్‌బీ, సీపీపీ, బీజీఎఫ్ పరీక్షల కోసం ఆస్పత్రి పేరు మీద ఉన్న చీటీలు రాసిచ్చారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు చేయడానికి వీల్లేదని, ఓ ల్యాబ్ నుంచి వ్యక్తి వచ్చి పరీక్షలు చేస్తారని చెప్పారని బల్మూర్ మండలం చెన్నారం గ్రామానికి చెందిన బాలింత జ్యోతి భర్త సాయిబాబు తెలిపారు. ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకుడు దర్జాగా ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం సేకరించాడు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి ఫార్మాసిస్టు రాజేష్‌కు విషయం చెప్పడంతో వెంటనే ఆయన వచ్చి నిలదీశాడు. ఆస్పత్రి లోపలికి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రాజేష్ తెలిపారు. కాగా ఓ బాలింతకు చెందిన బంధువులు ఆస్పత్రిలోని ఓ నర్సు చెప్పడంతో తామంతా రక్త పరీక్షలు చేసుకోవడానికి ముందుకొచ్చామని, రూ.500 ఇచ్చామని ఆరోపించారు. ఆస్పత్రిలో అన్ని వసతులు సమకూర్చుతున్నామని, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామని ఫార్మాసిస్టు చెప్పారు. ఇటీవలి కాలంలోనే ఉన్నతాధికారులు పరీక్షల నిమిత్తం ఓ నూతన యంత్రాన్ని పంపించారని వివరించారు. కాగా బయటి నుంచి ప్రైవేటు ల్యాబ్ వ్యక్తులు ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకెళ్తున్నా పర్యవేక్షణ కరువైందని, శిశువులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. కొందరు నర్సులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, డిమాండ్‌గా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బయటకు పంపడం సరికాదు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వసతులు సమకూరుతున్నా కొందరు సిబ్బంది తీరు మారడం లేదు. పరీక్షల కోసం రోగులు, బాలింతలు, చిన్నారులను బయటకు పంపడం సరికాదు. ప్రైవేటు వ్యక్తి వచ్చి ఆస్పత్రిలో చిన్నారుల వద్ద రక్త నమూనాలు తీసుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. – మల్లేష్, సీపీఎం నాయకుడు, అచ్చంపేట సొంత క్లినిక్‌లకు రెఫర్ స్థానికులుగా ఉన్న వైద్యులే తరుచుగా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారని, వారే స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తూ ఇక్కడి రోగులపై నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను తమ క్లినిక్‌లకు రెఫర్ చేసుకుంటున్నారని, ఈ మేరకు ఆస్పత్రిలోని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించిన వైద్యులు, సిబ్బందిపై పలుమార్లు చర్యలు తీసుకున్నా.. సస్పెండ్ అయినా కొన్ని రోజులకే మళ్లీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించడంతో వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరు బహిర్గతమవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆస్పత్రిలో వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందడం, అంతకు ముందు కరోనా సమయంలో ఓ చెంచు మహిళకు కరోనా ఉందని కాన్పు చేయకపోవడంతో వైద్యులను, సిబ్బందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణను వివరణ కోరడానికి ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. (చదవండి: పంటలకు ‘కట్’కట!) -
మెత్తబడ్డ ప్రభుత్వ వైద్యులు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో గత 6 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చల విషయంలో ఆదివారం కాస్త మెత్తబడ్డారు. చర్చలు ఎక్కడ నిర్వహించాలన్న విషయమై తుది నిర్ణయాన్ని మమతా బెనర్జీకే వదిలిపెట్టామని వైద్యులు తెలిపారు. అయితే ఈ చర్చావేదిక మీడియా సమక్షంలో బహిరంగంగా ఉండాలనీ, గదిలో ఉండకూడదని షరతు విధించారు. కోల్‌కతాలో ఆదివారం దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమైన వైద్యుల గవర్నింగ్ బాడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆందోళనను వీలైనంత త్వరగా ముగించాలని మేమెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చించేందుకు వీలుగా సీఎం మమత చర్చావేదికను ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ఆందోళన చేస్తున్న వైద్యులతో సోమవారం సమావేశమయ్యేందుకు సీఎం అంగీకరించారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయం పక్కనే ఉన్న ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఒక్కో ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ కార్యక్రమానికి ఆహ్వా నించామని పేర్కొన్నారు. ఈ చర్చకు మీడియాను ఆహ్వానించాలన్న డాక్టర్ల ప్రతిపాదనపై మమత సుముఖంగా లేరని స్పష్టం చేశారు. నేడు దేశవ్యాప్త సమ్మె.. బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా సోమవారం దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రకటించింది. ఈ ఆందోళన నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అన్నిరకాల వైద్యసేవలు(అత్యవసర సేవలు మినహా) నిలిచిపోతాయని తెలిపింది. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై దాడిచేసే వ్యక్తులను శిక్షించేందుకు కేంద్రం సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసింది. శిక్షాస్మృతిని సవరించాలని కోరింది. గత సోమవారం ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఓ రోగి చనిపోవడంతో అతని బంధువులు ఇద్దరు డాక్టర్లను చితకబాదారు. ఈ దాడికి నిరసనగా బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగగా, దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సంఘీభావం తెలిపారు. మరోవైపు, ఆందోళన కారణంగా బెంగాల్లో అత్యవసర సేవలకూ ఇబ్బంది కలుగుతోంది. ఈ ఆందోళనల కారణంగా కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఏం ప్రభుత్వ ఆసుపత్రిలో శామ్యూల్ అనే వ్యక్తి గుండె ఆపరేషన్ ఆగిపోయింది. తామంతా చాలా దూరప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చామనీ, ఇప్పుడు చికిత్స తీసుకోకుండా స్వస్థలాలకు తిరిగి వెళ్లలేమని రోగులు, వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వవైద్యులకు బయోమెట్రిక్!
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రులకు సమయానికి రాని ప్రభుత్వ వైద్యులకు చెక్ పెట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యోచిస్తోంది. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి కచ్చితంగా వచ్చేవిధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ బయోమెట్రిక్ హాజరు మిషీన్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. ఈ మేరకు అన్ని ఆ శాఖ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో దాదాపు 900 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ఉన్నాయి. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు సహా అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రులు దాదాపు 1,200 వరకు ఉన్నాయి. వాటిల్లో 3 వేల మందికిపైగా వైద్యులు పనిచేస్తుంటారు. ఇతర వైద్య సిబ్బంది మరో ఐదారు వేల మంది వరకు ఉంటారు. కొన్ని ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ ఉన్నా, చాలా ఆసుపత్రుల్లో ఇంకా ఈ ఏర్పాటు చేయలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఉదయం 9.30 గంటలకే వైద్యులు పీహెచ్‌సీకి రావాలి. సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. కొన్ని 24 గంటలూ పనిచేసేవి కూడా ఉంటాయి. లక్షలాది మంది పేద రోగులకు ఈ పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులే ఆధారం. కానీ వైద్యులు సకాలంలో రారన్న భావన నెలకొనడంతో రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం అందుతుందన్న భరోసా కల్పించలేకపోతున్నాయి. కొన్ని పీహెచ్‌సీలకైతే వారంలో రెండు మూడు రోజులు కూడా వైద్యులు వచ్చే పరిస్థితి ఉండట్లేదు. మరికొన్నిసార్లు ఎవరూ రాక తాళం వేసిన సందర్భాలూ ఉన్నాయి. దీనివల్ల జబ్బు వస్తే మందు వేసే దిక్కే లేకుండా పోతుంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చాలని సర్కారు భావిస్తోంది. ఎలాగైనా వైద్యులను ఆసుపత్రికి సకాలంలో రప్పించాల్సిందేనని కృతనిశ్చయంతో ఉంది. ఉదయం 9.30 గంటలకు డాక్టర్ ఉంటారన్న నమ్మకాన్ని రోగులకు కల్పించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకొని అన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. వైద్య సిబ్బంది రేషనలైజేషన్.. వైద్యులు సకాలంలో ఆసుపత్రికి వచ్చేలా, వారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా చేయాల్సిన బాధ్యతపై గతంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా సర్కారులో ఉంది. లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పనిచేసే పరిస్థితి లేదని సర్కారు గమనించింది. సమీప పట్టణాల్లో ప్రైవేటు ఆసుపత్రి పెట్టుకొని నడుపుకొంటున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడం కన్నా వారిని ఆకర్షించేలా ప్రోత్సాహకాలు ఇవ్వడమే మేలని భావిస్తోంది. దీనిపై త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొన్ని ఆసుపత్రుల్లో అవసరానికి మించి వైద్య సిబ్బంది ఉంటున్నారు. కొన్నింటిలో తక్కువ ఉంటున్నారు. ఈ పరిస్థితిని మార్చి వైద్య సిబ్బంది హేతుబద్ధీకరించాలని వైద్య, ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇక పీహెచ్‌సీల్లో కేవలం ఎంబీబీఎస్ స్థాయి మెడికల్ ఆఫీసర్లే కాకుండా స్పెషలిస్టు వైద్యులను కూడా నియమించాలని భావిస్తోంది. వారానికి ఒకట్రెండు రోజులు ఆసుపత్రులకు వెళ్లేలా చూడాలని భావిస్తున్నారు. ఆస్పత్రులను ఆధునీకరించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అన్నిం టినీ దశలవారీగా బాగు చేయాలని వైద్య,ఆరోగ్య శాఖ భావిస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించి రోగులకు నమ్మకం కలిగేలా చేయాలని నిర్ణయించినట్లు ఆ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రా.. మద్యం దుకాణమా?
సాక్షి, అనంతపురం : పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు బరితెగించారు. పట్టపగలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయారు. ప్రభుత్వ డాక్టర్ ఆనంద్ బాబు, మరో నలుగురు సిబ్బంది వైద్య సేవలు పక్కనపెట్టి.. రోగులను గాలికొదిలేసి.. ఆస్పత్రిలోనే పేకాట ఆడుతూ, మద్యం సేవిస్తూ జల్సా చేశారు. దీంతో ఆస్పత్రిలో ఎటుచూసినా మద్యం బాటిళ్లు, పేకాట కార్డులు దర్శనమిస్తున్నాయి. వైద్యుల తీరుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోగుల అవస్థలను పట్టించుకోకుండా ఆస్పత్రిలోనే అసాంఘిక కార్యకలాపాలకు దిగడం దారుణమని, ఇది ఆస్పత్రా.. మద్యం దుకాణామా? అని నిలదీశాయి. ఆస్పత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
మా మంచి డాక్టర్లు ఎందరో!
న్యూఢిల్లీ: కాసుల కోసమే కార్పొరేట్ ఆస్పత్రులు పనిచేస్తున్న నేటి రోజుల్లో ప్రజల ఆరోగ్యం కోసం కంకణబద్దులై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు ఉండడం మన అదష్టం. ఎవరి ఆదేశం లేకుండానే స్వచ్ఛందంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లూ ఉండడం ఇంకా విశేషం. 24 గంటలు వైద్య సేవలు కొనసాగించాల్సిన రంగంలో డాక్టర్లు రోజూ 16 గంటలపాటు, కొన్ని సార్లు ఏకబిగినా 34 గంటలపాటు వైద్య సేవలు అందిస్తున్న మహానుభావులు ఉన్నారు. జాతీయ డాక్టర్ల దినోత్సవమైన జూలై ఒకటవ తేదీన అలాంటి వారి గురించి స్మరించుకోవడం ఎంతైన సబబే. జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని ఒక్కో దేశంలో ఒక్కోరోజు జరపుకుంటారు. భారత దేశంలో జూలై ఒకటవ తేదీన జరపుకోవడానికి కారణం డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్. ఆయన ప్రముఖ డాక్టరవడమే కాకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 1882 జూలై ఒకటవ తేదీన జన్మించారు. 1962, జూలై ఒకటవ తేదీన మరణించారు. ఒకతేదీన పుట్టి, ఒకే తేదీన మరణించిన డాక్టర్ రాయ్ గౌరవార్థం భారత దేశం ఈ రోజును జాతీయ దినోత్సవంగా జరుపుతోంది. ఒకప్పుడు మన దేశంతోపాటు పలు ప్రపంచ దేశాల్లో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలకేవారు. మధ్యాహ్నం వారి గౌరవార్థం విందు భోజనం ఏర్పాటు చేసేవారు. కొన్ని దేశాల్లో ఈ రోజును డాక్లర్ల సెలవుదినంగా పరిగణించేవారు. రోగులు పండగ చేసుకునేవారు. రానురాను ఈ రోజు ప్రాముఖ్యతను మరచిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సేవలు ఇప్పటికి కూడా పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా’ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 80 శాతం ఆస్పత్రులు, 75 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 80 శాతం వైద్యులు పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 72 శాతం ప్రజలు నివసిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో 28 శాతం మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే తక్కువ జనాభా ఉండే పట్టణాల్లోనే ఎక్కువ మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. మొత్తం ప్రభుత్వ డాక్లర్లు లక్షకుపైగా ఉండగా, వారిలో 30 వేల మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది డాక్టర్లు స్వచ్ఛందంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవకు తమ జీవితాలను అంకితం చేస్తున్నారు. అలాంటి వారిలో ముంబైకి చెందిన డాక్టర్ రవీంద్ర కోహ్లీ దంపతులు ఉన్నారు. ఆయన భార్య పేరు స్మితా కోహ్లీ. మారుమూల ప్రాంతమైన మహారాష్ట్రలోని భైరాగఢ్ వెళ్లి అక్కడ వైద్య సేవలు అందించానుకున్నారు. ఆ షరతు మీదనే నాగపూర్‌కు చెందిన డాక్టర్ స్మిత్‌ను పెళ్లి చేసుకున్నారు. దంపతులు ఆ ప్రాంతం ప్రజలకు వైద్య సేవలు అందించడంతోపాటు తన మిత్రుడైన వెటర్నరీ డాక్టర్ ద్వారా పశు వైద్యాన్ని కూడా నేర్చుకొని రైతులకు సేవ చేశారు. అంతేకాకుండా వ్యవసాయ పంటలు దెబ్బతినకుండా రసాయనాలు ఎలా వాడాలో తెలసుకొని రైతులకు సహకరించారు. ఒరిస్సాకు చెందిన డాక్టర్ అక్వినాస్ రిటైరైన తర్వాత, అంటే 61వ ఏట ఆదివాసులకు వైద్య సేవలు అందించేందుకు వారుండే అటవి ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడి వారికి వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. పిల్లల కార్డియాక్ సర్జన్ డాక్టర్ గోపి, ఆయన భార్య డాక్టర్ హేమ ప్రియ ప్రభుత్వాస్పత్రుల్లో మంచి ఉద్యోగాలు వదిలిపెట్టి దక్షిణ తమిళనాడులోని మారుమూల పల్లెల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సకు అవసరమైన డబ్బును సేకరించేందుకు ఆయన ఓ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటుచేసి నడుపుతున్నారు. ఇలాంటి వారి ఎందరికో జాతీయ డాక్టర్ల దినోత్సవ శుభాకాంక్షలు. -
శంకర్‌దాదా ఆర్ఎంపీ
► పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండని వైద్యులు ► ఆర్ఎంపీల వద్దకు పరుగులు పెడుతున్న పల్లె జనం ► వచ్చీరాని వైద్యంతో మందులిస్తున్న ఆర్ఎంపీలు ► ఫిరంగిపురంలో చూపు కోల్పోయిన వివాహిత ► జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇదే దుస్థితి పొద్దుగాల నుంచి చంటోడు ఒకటే ఏడుస్తున్నడు..వళ్లు పట్టుకుంటే కాలిపోతాంది. చేతిలోనా పైసల్లేవు. గవర్నమెంట్ ఆస్పత్రికి వెళదాం పదయ్యా..ఊరుకోవే..అక్కడికెళితే ఎవరుంటరే..బిడ్డను పట్టించుకునే నాథుడుంటడా..యాడో ఒక చోట అప్పు పట్టకొస్తా..ఊళ్లో ఉన్న డాక్టర్ బాబు దగ్గరకెళదాం..అంటూ పిల్లాడిని చంకనెత్తుకుని పరుగులు పెట్టారు దంపతులు. ఇదీ ప్రస్తుతం జిల్లాలోని ప్రతి గ్రామంలో నిరుపేదల దుస్థితి. వైద్య ఆరోగ్యశాఖ మొద్దునిద్రలో జోగుతుంటే..ఆర్ఎంపీలే ఎంబీబీఎస్లైపోతున్నారు. తలనొప్పిగా ఉందంటే మోకాలుకు మందులిచ్చి డాక్టర్ బాబులుగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు. మొత్తంగా ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో పల్లె జనానికి ఏ జబ్బు వచ్చినా ఆర్ఎంపీలే దిక్కు. దీనికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడమే. అందుబాటులో ఉండని ప్రభుత్వ వైద్యులకంటే ఇంటి వద్దకు వచ్చి వైద్య సేవలందించే ఆర్ఎంపీలే నయమనే స్థితికి పల్లె జనం వచ్చేశారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న గుంటూరు జిల్లాలోని వందలాది గ్రామాలు ఇప్పటికీ ఆర్ఎంపీల వైద్యంపైనే ఆధార పడుతున్నాయంటే వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది ఆర్ఎంపీలు తమకు తెలిసిన స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ.. వీరిలో కొందరు మాత్రం అనుభవం లేకపోయినా ఆర్ఎంపీలుగా చెలామణి అవుతున్నారు. ఎంబీబీఎస్ వైద్యుల మాదిరిగా ఇష్టానుసారం మందులు రాస్తున్నారు. నిబంధనలకు చెల్లు చీటీ ఆర్ఎంపీలు నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సి ఉన్నప్పటికీ వీరిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. డెలివరీలు, చిన్న చిన్న ఆపరేషన్లు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఆర్ఎంపీలు వైద్యసేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా గ్రామాల్లో క్లినిక్‌ల పేరుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఎంపీల వల్ల ఇబ్బందులు పడి అనేక మంది ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు. ఆర్ఎంపీ వైద్యంతో చూపు కోల్పోయిన మహిళ ఈ నెల 13వ తేదీ జిల్లాలోని ఫిరంగిపురానికి చెందిన పరగటి కుమారి అనే వివాహిత జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆర్ఎంపీ అమర్లపూడి ఇమ్మానియేల్‌ను ఆశ్రయించింది. ఆమెను పరీక్షించిన ఆర్ఎంపీ కొన్ని మందులు రాసి ఇచ్చాడు. అవి వాడిన వెంటనే మహిళ ముఖం కాలినట్లుగా నల్లగా మారి, కంటిచూపు సైతం కోల్పోయింది. అయితే దీనిపై ఆర్ఎంపీని ప్రశ్నించగా.. తాను జ్వరం తగ్గేందుకు మందులు ఇచ్చానని, వాటితో కళ్లకు ఎటువంటి ప్రమాదం ఉండదని సమాధానం ఇచ్చాడు. బాధితురాలు మాత్రం తాను వైద్యం వికటించడం వల్లే కంటిచూపు కోల్పాయానంటూ ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఇలాంటి ఘటనలు మారుమూల పల్లెల్లో ఎక్కువగా జరుగుతున్నా బాధితులు బయటపడడం లేదు. ఆర్ఎంపీలు ఇచ్చిన మందులతో సైడ్ ఎఫెక్ట్ వచ్చినా రోగులు గుర్తించలేక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. ఈ పాపం వైద్యులదే.. గుంటూరు జిల్లాలో మొత్తం 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకుగాను సుమారు 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న 80 శాతం మంది సిబ్బంది జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఉదయం 9 గంటలకు ఆసుపత్రిలో ఉండాల్సిన వైద్యులు 12 గంటలకు చేరుకుంటున్నారు. తిరిగి మధ్యాహ్నం భోజన సమయానికి వెళ్లిపోతుండటంతో రోగులకు వైద్య చికిత్సలు అందడం లేదు. పనిచేసే చోటే నివాసం ఉండాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ వైద్యులు దాన్ని లెక్క చేయడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి యువకుడు బలి
-
'సక్రమంగా పనిచేయని డాక్టర్లను తొలగిస్తాం'
హైదరాబాద్: సక్రమంగా విధులు నిర్వహించని డాక్టర్లను తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం ఆయన వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ వైద్యల పదవీ విరమణ 65 ఏళ్లకు పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు. జూన్ 8 నుంచి 15 వరకు వైద్య శాఖలో బదిలీలు నిర్వహిస్తామని మంత్రి కామినేని వెల్లడించారు. -
ప్రభుత్వ వైద్యులపై కలెక్టర్ కొరడా
► డీఎంఈకి డాక్టర్ విజయానంద్ సరెండర్ ► మరో డాక్టర్ ఆత్మారాంకు షోకాజ్ నోటీస్ ► విధులకు డుమ్మా కొట్టడంపై సీరియస్ ► బయోమెట్రిక్ అమలుకు సన్నాహాలు అనంతపురం: విధులకు రాకున్నా రిజిస్టర్లో సంతకాలు చేసిన వైద్యులపై కలెక్టర్ కోన శశిధర్ కొరడా ఝుళిపించారు. ఓ వైద్యుడిని సరెండర్ చేయడంతో పాటు మరొకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనిఖీలో బట్టబయలు కలెక్టర్ శశిధర్ ఈనెల 11న జిల్లా సర్వజనాస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్థో డాక్టర్ ఆత్మారాంతో పాటు చిన్నపిల్లల విభాగంలోని వైద్యుడు విజయానంద్ డ్యూటీ రిజిస్టర్లో సంతకాలు చేసి విధులకు డుమ్మా కొట్టినట్లు గుర్తించారు. అదే రోజు ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ జయచంద్రారెడ్డి, పీడియాట్రిక్ హెచ్ఓడీ డాక్టర్ మల్లీశ్వరికి సంజాయిషీ కోరారు. ఈ క్రమంలో డాక్టర్ ఆత్మారాం సెలవులో ఉన్నారని, అయితే సంతకం ఎవరు చేశారో తెలియదని సంబంధిత హెచ్ఓడీ తెలిపారు. పిడియాట్రిక్‌లో మాత్రం డాక్టర్ వచ్చి సంతకం చేసి కర్నూలుకు వెళ్లిపోయినట్లు వైద్యులు చెప్పారు. అయితే ఆ రోజు ఆయన విధులకే రాలేదని తెలుసుకున్న కలెక్టర్ శశిధర్ డాక్టర్ విజయానంద్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. పనుండి వెళ్లిపోయినట్లు తెలిసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌కు ఆదేశాలిచ్చారు. దీంతో ఆయన ఈ రెండు విభాగాల హెచ్ఓడీలతో మాట్లాడారు. విచారణ చేసి నివేదికను కలెక్టర్‌కు పంపారు. ఈ క్రమంలో ఆదివారం డాక్టర్ విజయానంద్‌ను డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)కు సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎంఈని కోరారు. డాక్టర్ ఆత్మారాంకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సెలవులో ఉన్నా సంతకం ఎవరు చేశారన్న దానిపై వివరణ కోరారు. మరోవైపు వైద్యుల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టేందుకు మూడ్రోజుల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఉద్యోగుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : అశోక్‌గజపతిరాజు
విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మోదీ ప్రభుత్వాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలోని ప్రభుత్వాసుపత్రిలో రూ.1.50 కోట్లతో ఆధునికరించిన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక మార్చురీకి కూడా అశోక్‌గజపతిరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు గతంలో కంటే మెరుగయ్యాయని చెప్పారు. ఇదే స్పూర్తితో ఇక ముందు పని చేయాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. దేశంలోని ప్రతి ఎయిర్‌పోర్టులో సోలార్ విద్యుత్ వినియోగిస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని ఆయన చెప్పారు. హోదా ఆలస్యమైన కొద్దీ రాష్ట్రానికి మరిన్ని ఆర్థిక కష్టాలు తప్పవని అశోక్ గజపతిరాజు చెప్పారు. -
ప్రై'వేటు' ప్రాక్టీసులకు ఇక చెక్
► ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై వేటుకు రంగం సిద్ధం ► నోటీసులిస్తామన్న మంత్రి కామినేని ప్రకటనతో డాక్టర్ల షాక్ ► వైద్యరంగంలో కలకలం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న ప్రభుత్వ వైద్యులకు నోటీసులిస్తున్నాం. మొత్తం 600 మందిని గుర్తించి వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశా’ మన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటన జిల్లా వైద్యరంగంలో కలకలం రేపుతోంది. ఒంగోలు రిమ్స్‌తో పాటు పలు ఏరియూ వైద్యశాలలు, పీహెచ్‌సీల్లో పనిచేస్తూనే ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు, ఏకంగా నర్సింగ్‌హోంలు నిర్వహిస్తున్న వైద్యులను షాక్‌కు గురిచేసింది. ప్రధానంగా ప్రభుత్వ ఆస్పత్రుల పనివేళల్లో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్న వారిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానిలో భాగంగా గతంలో సిద్ధం చేసిన నివేదికకు ఇప్పుడు బూజుదులిపి బయటకు తీసినట్లు తెలుస్తోంది. జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల్లో అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. నివేదికలో రిమ్స్ వైద్యులే అధికం... రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న నివేదికలో మన జిల్లాకు సంబంధించి ఒంగోలు రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులే అధికంగా ఉన్నట్లు సమాచారం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉంటామని సర్వీసులో చేరేముందు వైద్యులంతా అంగీకరించారు. ఆ మేరకు వారి నుంచి ప్రభుత్వం అంగీకారపత్రం తీసుకుంది. అరుుతే, అందుకు విరుద్ధంగా ప్రభుత్వాస్పత్రుల పనివేళల్లో కూడా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం ఏడాది క్రితమే నిఘా పెట్టింటి. నివేదిక తయారుచేసి వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అందజేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు వైద్యారోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసులకు రంగం సిద్ధం... ప్రభుత్వాస్పత్రుల పనివేళల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న వారందరికీ జిల్లా కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసులివ్వడానికి రంగం సిద్ధం చేశారు. అలాగే ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తూనే నర్సింగ్ హోమ్‌లు నిర్వహిస్తున్న వైద్యుల వివరాలను, ప్రభుత్వాస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా ఆరు నెలలకుపైగా సెలవులో ఉన్న వైద్యుల జాబితాను కూడా రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల పరిధిలో పనిచేసే వైద్యుల వరకూ ఈ జాబితా పరిధిలోకి తెచ్చారు. మంత్రి తీరుపై వైద్యుల విమర్శలు... ప్రభుత్వాస్పత్రుల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో విఫలమైన మంత్రి కామినేని శ్రీనివాస్.. తన పదవిని కాపాడుకోవడం కోసం హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ వైద్యులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి పనివేళల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేయరాదన్న నిబంధనను తామంతా స్వాగతిస్తున్నామని, కానీ, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రైవేటు ప్రాక్టీసుకు అనుమతి ఉందని అంటున్నారు. ఇదే విధానం అమలుచేయాలని చూస్తే రిమ్స్‌లో స్పెషలిస్టులెవరూ ఉండే అవకాశం లేదంటున్నారు. రిమ్స్‌లో స్పెషలైజేషన్ చేసిన వారికి ఇస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రైవేటు ప్రాక్టీస్ కూడా లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చదివి వచ్చినవారు తక్కువ జీతానికి పనిచేయరన్న వాదన వినిపిస్తోంది. వైద్యులకు నోటీసులు జారీ అయితే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపై అప్పుడే చర్చించుకుంటున్నారు. దీనిపై రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ రాజకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటిదాకా తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని తెలిపారు. ఇప్పటికే ఐదుగురు వైద్యులకు నోటీసులతో ఆందోళన... ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న ఏరియా ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ఐదుగురు వైద్యులకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో ఒకరు గుంటూరుకు బదిలీపై వెళ్లిపోవడంతో మిగిలిన నలుగురికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో రిమ్స్‌లో పనిచేస్తున్న వారికి కూడా నోటీసులు వస్తాయన్న ప్రచారం సాగుతోంది. రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులంతా ఏదోక ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండటం, లేకుంటే సొంతంగా నర్సింగ్‌హోం నిర్వహిస్తుండటమే అందుకు కారణం.