దొడ్డబళ్లాపురలో ఉగ్ర కలకలం

Terrorists Shadows Found in Karnataka Dodla Ballapuram Masjid - Sakshi

బంగ్లాదేశ్‌ అనుమానిత ఉగ్రవాది పట్టివేత  

మసీదులో మకాం వేసిన మిలిటెంటు

గుట్టుగా ఎన్‌ఐఏ బృందం దాడి  

బెంగళూరుకు తరలింపు  

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ప్రశాంతంగా ఉన్న దొడ్డబళ్లాపురంలో ఉగ్రవాద కలకలం చెలరేగింది. మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది దొరికిపోయాడు. గత ఏడాది పక్క జిల్లా రామనగరలో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు మంగళవారంనాడు దొడ్డబళ్లాపురం పట్టణంలో మరో ఉగ్రవాదిని పట్టుకుంది. ఈ సంఘటనతో పట్టణంలో సంచలనాత్మకమైంది. జమాతుల్‌ ముజాహిద్దీన్‌ అనే ఉగ్రవాద సంస్థ సభ్యుడు, బంగ్లాదేశ్‌కు చెందిన టెర్రరిస్టు హబీబుల్‌ రెహమాన్‌ను మంగళవారం అరెస్టు చేశారు. 2014 అక్టోబర్‌ 2న పశ్చిమ బెంగాల్‌లోని బుర్‌ద్వాన్‌లో ఖగ్రాగడ్‌ హసన్‌ చౌదరి అనే వ్యక్తి ఇంట్లో బాంబులు తయారుచేసే సమయంలో బాంబు పేలి ఇద్దరు మృతిచెంది మరొకరు గాయపడ్డారు. ఆ కేసును అక్కడి పోలీసులు దర్యాప్తు చేసి తరువాత వెస్ట్‌ బెంగాల్‌ సీఐడీకి కేసు అప్పగించడం జరిగింది. ఆ పేలుడులో గాయపడిన వ్యక్తే ఇప్పుడు పట్టుబడిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. 

మసీదులో ఇమామ్‌ సహకారం  
నిందితుడు హబీబుల్‌ రెహమాన్‌ దొడ్డ పట్టణ పరిధిలోని చిక్కపేటలో ఉన్న ఒక మసీదులో మౌలాగా ఉన్న అన్వర్‌ హుసేన్‌ ఇమామ్‌ అనే వ్యక్తి వద్ద తలదాచుకున్నాడు. హుసేన్‌ ఇమామ్‌ కూడా వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన వ్యక్తి అని, స్థానిక చిక్కపేట మైనారిటీ ప్రముఖుడి ద్వారా మసీదులో మౌలాగా చేరినట్లు తెలిసింది. హుసేన్‌ ఇమామ్‌కు నిందితునికి అనేక సంవత్సరాలుగా పరిచయం ఉంది. రెండు రోజుల క్రితమే శాంతినగర్‌  12వ క్రాస్‌లో టెర్రరిస్టు రెహమాన్‌ కోసం చిన్నగదిబాడుగకు తీసిచ్చాడు. సమాచారం అందడంతో ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

ఫోన్లు స్వాధీనం  
రెహమాన్‌ నుండి మొబైళ్లుఫోన్లు, సిమ్‌కార్డులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇమామ్‌ హుసేన్‌ను కూడా తీవ్రంగా విచారించారు. అనంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు. అతన్ని బెంగాల్‌ పోలీసులు తదుపరి విచారణ కోసం అదుపులోకి తీసుకునే అవకాశముంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top