
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : మహరాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిపై అనుమానంతో ఓ ఐటీ ఉద్యోగి ఆమెను పాశవికంగా హతమార్చాడు. పుణెలోని చందానగర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. తెర్గావ్‌కు చెందిన కిరణ్ షిండే(25), వీణా పాటిల్(22) ఓ ఐటీ కంపెనీలో సపోర్టింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య స్నేహం బలపడి ప్రేమకు దారితీసింది. అయితే కొన్ని రోజులుగా వీణాపై అనుమానం పెంచుకున్న కిరణ్ ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం.. కుట్ర పన్నిగత ఐదు రోజులుగా కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో కిరణ్‌ను కలవాలని భావించిన వీణా.. తమ కామన్ ఫ్రెండ్ ప్రకాశ్ గపట్‌తో కలిసి మంగళవారం సాయంత్రం చందానగర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో కిరణ్ ఆమెతో గొడవకు దిగాడు. వీణా కూడా దీటుగా బదులివ్వడంతో కోపోద్రిక్తుడైన కిరణ్.. తన దగ్గర ఉన్న పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వీణాను ఆస్పత్రికి తరలించగా.. ఆమె మృతి చెందింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.