ఆన్‌లైన్‌ దొంగల అరెస్ట్‌ | online cheaters arrested | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ దొంగల అరెస్ట్‌

Jan 9 2018 8:56 AM | Updated on Aug 20 2018 4:30 PM

సాక్షి, తిరుపతి క్రైం : ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత ప్రకటనలు చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఆన్‌లైన్‌ ఘరానా దొంగలను క్రైం పోలీసులు బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.

బెంగళూరులోని నాగిశెట్టిపల్లి భువనేశ్వర్‌ లేఔట్‌కు చెందిన శ్రీనివాస గోవిందప్ప కుమారుడు శ్రీనివాస శేషు(21) స్నేహితుడు అనీల్‌తో కలిసి మైండ్‌ట్రీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటర్‌నెట్‌ ద్వారా ప్రకటనలు ఇచ్చేవాడు. అదేవిధంగా ఫేస్‌బుక్‌లోనూ పోస్టింగులు పెట్టేవాడు. వాటిని నమ్మిన తిరుపతి నగరానికి చెందిన మునికుమార్‌యాదవ్, రమేష్‌బాబు వారిని సంప్రదించారు. వారికి శ్రీనివాస శేషు కంపెనీ నుంచి ఇంటర్వ్యూ అపాయింట్‌ ఆర్డర్లతో కూడిన ఐడీని మెయిల్‌కు పంపించి డబ్బులు అకౌంట్‌లో వేయమన్నాడు.

మునికుమార్‌ యాదవ్, రమేష్‌ బాబు ఇద్దరూ కలిసి రూ.5,72,500 శ్రీనివాస శేషు అకౌంట్‌లో వేశారు. చాలా రోజులు జరిగినా వారికి ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇవ్వాలని నిలదీశారు. దీనికి శ్రీనివాస శేషు తనకు పెద్దవాళ్లు తెలుసని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని తెగేసి చెప్పాడు. బాధితులు క్రైం పోలీసులు ఆశ్రయించగా ఎస్‌ఐ వెంకటనరసింహా కేసు నమోదు చేసి నిందితులను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement