ప్రేమా.. ఇది నీకు న్యాయమా? | Love Couple Commits End Lives in Tamil nadu | Sakshi
Sakshi News home page

ప్రేమా.. ఇది నీకు న్యాయమా?

Mar 21 2020 8:12 AM | Updated on Mar 21 2020 8:12 AM

Love Couple Commits End Lives in Tamil nadu - Sakshi

రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకుంటున్న ప్రేమ జంట

చెన్నై, వేలూరు: ఆంబూరు సమీపంలో రైలు పట్టాలపై పడుకొని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆలంగాయం సమీపంలోని పూంగాపుదూరు గ్రామానికి చెందిన ఉమాపతి కుమార్తె నందిని (22). గుడియాత్తం సామర్షికుప్పం గ్రామానికి చెందిన కోదండన్‌ కుమారుడు రామదాస్‌(29). ఇతను హోసూరులోని వెల్డింగ్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించనట్టు తెలుస్తోంది. ప్రేమ జంట గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి ఆంబూరు సమీపంలోని పచ్చకుప్పంలో రైల్యే పట్టాల వద్దకు చేరుకుంది. రైలు పట్టాల పక్కన కూర్చొని ఇద్దరూ మాట్లాడుకున్నారు.

ఆ సమయంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. చెన్నై–బెంగళూరు వెళ్లే రైలు పట్టాలపై పడుకొని సెల్ఫీ తీసుకున్నారు. ఆ సమయంలో చెన్నై నుంచి వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలు అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రేమ జంట అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం ఉదయం ప్రేమ జంట రైలు పట్టాలపై మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి జోలార్‌పేట రైల్యే పోలీసులకు సమాచారం అందజేశారు. జోలార్‌పేట రైల్యే పోలీసులు, ఆంబూరు డీఎస్పీ సదానందం ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పరిశీలించారు. ఆ సమయంలో మృతదేహాల సమీపంలో సెల్‌ఫోన్‌ ఉండడంతో వాటిని పరిశీలించారు. ప్రేమ జంట రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకున్న చిత్రాలు కనిపించాయి. వెంటనే బంధువులకు సమాచారం అందజేసి మృత దేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్యే పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement