వివేకా హత్య కేసులో చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

High Court notice to Chandrababu on Viveka murder case - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌ తదితరులకు కూడా నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

అప్పటివరకు ఈ కేసులో సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఏజీ శ్రీరామ్‌ హామీని హైకోర్టు నమోదు చేసుకుంది. దర్యాప్తును యథాతథంగా కొనసాగించవచ్చని సూచిస్తూ సౌభాగ్యమ్మ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఉత్తర్వులిచ్చారు.

హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్‌ జగన్, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, ఇదే అభ్యర్థనతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై విచారణ సందర్భంగా ఆదినారాయణరెడ్డి తరఫు న్యాయవాది వెంకటరమణ, సౌభాగ్యమ్మ తరఫు సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి, ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.

దర్యాప్తు చాలా కీలక దశలో ఉందని ఏజీ చెప్పారు. ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవిలకు ఏదో ఇబ్బంది ఉందని, వారిని విచారణకు పిలిపిస్తున్నామన్న కారణంతో సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని కోరుతున్నారన్నారు. నార్కో అనాలసిస్‌కు పరమేశ్వర్‌రెడ్డి ఆరోగ్యం సహకరించే పరిస్థితిలో లేదని వైద్యులు చెప్పడంతో ఆయనకు ఈ పరీక్షలు నిర్వహించలేదని ఏజీ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top