జోరుగా పేకాట..!

Full Rummy Playing Bettings In Nalgonda - Sakshi

మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ శివారులో పేకాట జోరుగా సాగుతోంది. పట్టణ సమీపంలోని గ్రామాల్లో గట్లు, పొలాలే స్థావరాలుగా పేకాట నిర్వహిస్తున్నారు. యాద్గార్‌పల్లి గ్రామ శివారులోని కాల్వపల్లికి వెళ్లే దారిలో కాలువ వెంట ద్విచక్రవాహనాలు వెళ్లే దారిలో, అవంతీపురం సమీపంలోని గట్లు పేకాటకు అడ్డాగా మారాయి. యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన సొంత వ్యవసాయ భూమిలో అడ్డాను ఏర్పాటు చేసి డబ్బులు తీసుకొని పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా అవంతీపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అవంతీపురం సమీపంలో పేకాట అడ్డా సాగిస్తున్నట్లు తెలిసింది. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షిఫ్టుల వారిగా పేకాట సాగిస్తున్నారు. పేకాట స్థావరాలకు ఎవరూ రాకుండా ఉండే విధంగా, ఒక వేళ వచ్చినా ముందస్తుగానే సమాచారం అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది.

చేతులు మారుతున్న రూ.లక్షలు
మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లి శివా రులో నిర్వహిస్తున్న పేకాట అడ్డాలోనే రోజుకు రూ.15 లక్షల రూపాయల నుంచి రూ.20 లక్షల రూపాయల వరకు బెట్టింగ్‌లు సాగుతున్నట్లు సమాచారం. ఆటలో కూర్చునే వ్యక్తి వద్ద కనీసం పాతిక వేల రూపాయలు ఉన్నట్లుగా ముందుగానే చూపించాల్సి ఉంది. ఆ రూపాయలు ఉంటేనే ఆటలో కూర్చోనిస్తారు. అలా కనీసం ఒక్కో అడ్డా వద్ద 20 మందికి పైగా పేకాట ఆడుతున్నారు.

అందర్‌.. బాహర్‌
పేకాటలో ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టడంతో పాటు అతి త్వరగా ముగించే ఆట అందర్‌– బాహర్‌. దీని వల్ల ఒక్కొక్కరు లక్షల రూపాయలు పొగొట్టుకున్న వారు సైతం ఉన్నారు. కేవలం మూడు ముక్కలతో ఆడే ఆటలో ఎవరికి పెద్ద ముక్క వస్తే వారే ఆటలో గెలిచినట్లుగా భావిస్తారు.  పెద్ద ముక్క వచ్చిందని భావించే వ్యక్తి పోటీగా కూడా పందెంలో అదనంగా కూడా డబ్బులు పెడతారు. పేకాట వల్ల మధ్య తరగతి వ్యక్తులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top