పెళ్లి చేసుకోకుంటే హతమారుస్తా..

Boyfriend Cheating Girl In Guntur - Sakshi

ప్రేమ పేరుతో బాలికపై యువకుడి వేధింపులు

సాక్షి, గుంటూరు: ‘ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకోకుంటే హతమారుస్తా’ అంటూ రమావత్‌ శివానాయక్‌ అనే యువకుడు నిత్యం వేధిస్తున్నాడని తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తన తండ్రితో కలసి గుంటూరు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ వెంకటప్పలనాయుడుకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత బాలిక విలేకరులతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేకలదిన్నె తండాకు చెందిన తాను కారంపూడిలోని బ్రహ్మనాయుడు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిపింది. అదే ప్రాంతంలోని గిరిజన సంక్షేమ గృహంలో ఉంటూ రోజూ పాఠశాలకు వెళ్తుండగా.. మేకదిన్నె తండాకు చెందిన శివానాయక్‌ వెంటపడుతూ ప్రేమించమని వేధిస్తున్నట్లు పేర్కొంది.

వేధింపులు తట్టుకోలేక హాస్టల్‌ వార్డెన్‌కు విషయం తెలియజేయగా ఈ నెల 6న కారంపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చిన శివానాయక్‌ మళ్లీ హాస్టల్‌ వద్దకు వచ్చి గొడవ చేస్తున్నాడని, పెళ్లి చేసుకోకపోతే యాసిడ్‌ దాడి చేసి హతమారుస్తానని బెదిస్తున్నాడని వివరించింది. కాగా, బాలికపై వేధింపులకు పాల్పడుతున్న రమావత్‌ శివానాయక్‌ తాత సింగూ నాయక్‌ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరుడని, అధికార పార్టీ అండతోనే రెచ్చిపోతున్నాడని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

నమ్మించి వంచించాడు..
మరో ఘటనలో ప్రేమ పేరుతో బసవబోయిన యుగేంద్ర అనే యువకుడు మోసం చేశాడని ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ బాలిక గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయారావుకు ఫిర్యాదు చేసింది. విశాఖపట్నం జిల్లా కశీంకోట గ్రాయానికి చెందిన బాలికకు, ఆమె స్నేహితురాలి ద్వారా గతేడాది డిసెంబర్‌లో అనకాపల్లి మండలం కూండ్రం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, పద్మల తనయుడు బసవబోయిన యుగేంద్రతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి 20న తంతడి బీచ్‌లో పసుపు తాడు తాళిగా కట్టి బాలికను యుగేంద్ర వివాహం చేసుకున్నాడు.

అనంతరం 45 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో అద్దె గదుల్లో ఉంటూ కాపురం చేశారు. మార్చిలో బాలికను ఇంటి వద్ద వదిలి, మూడు నెలల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి యుగేంద్ర సెల్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. యుగేంద్ర ఆచూకీ కోసం ప్రయత్నించగా గుంటూరు జిల్లా బాపట్ల రూరల్‌ మండలం అడవిపల్లి గ్రామంలో ఉన్నట్లు తెలిసిందని బాలిక పేర్కొంది. పోలీసులు నిందితుడిని పట్టుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top