'వైఎస్ ఒకే ఒక్కడిగా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారు' | Sakshi
Sakshi News home page

వైఎస్ ఒకే ఒక్కడిగా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారు'

Published Sat, Sep 14 2013 1:54 PM

'వైఎస్ ఒకే ఒక్కడిగా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారు' - Sakshi

కాకినాడ :  శ్రీకృష్ణ కమిటీ సూచనలను పక్కన పెట్టి...  రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ  ఎందుకు  విభజించాలి అనుకుంటుందో చెప్పాలని షర్మిల ప్రశ్నించారు.  సమైక్య శంఖారావంలో భాగంగా ఆమె శనివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎవరికి లాభం..? తెలుగజాతి ఒక్కటిగా ఉంటే ఎవరికి నష్టం.. ? వైఎస్‌ఆర్‌ లాంటి సీఎం ఆవిర్భవిస్తే  తట్టుకోలేని బలహీనత ఎవరికి ఉంది..? అంటూ  షర్మిల నిప్పులు చెరిగారు. మంచి పనుల ద్వారా ఓట్లు, సీట్లు సంపాదించుకునే సత్తా..  కాంగ్రెస్‌ పార్టీకి ఉండి ఉంటే..ఈ రోజు ఈ గతి పట్టి ఉండేది కాదన్నారు. చెడు చేసైనా వారి స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుందన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి వైఎస్ఆర్  చేసిన సేవలను ఆమె గుర్తు చేశారు. వైఎస్ఆర్ బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని ప్రధానమంత్రి సహా కోట్ల మంది అభిప్రాయపడుతున్నారని షర్మిల తెలిపారు. ఒక్క వైఎస్‌ మాత్రమే విభజన అనే గొడ్డలికి అడ్డంగా నిలబడి ఒకే ఒక్కడిగా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారన్నారు.  

అసలు అన్యాయం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి... రోశయ్య కమిటీ వేశారని, 2009లో టీఆర్‌ఎస్‌, టీడీపీ పొత్తు కుదుర్చుకున్నా నాలుగు పార్టీలు కలిసి..ఏకధాటిగా యుద్ధం చేసినా వైఎస్‌ఆర్‌ ఒకే ఒక్కడిగా నిలబడి ఒంటి చేత్తో పోరాటం చేసి ఆ ఎన్నికల్లో గెలిచారని షర్మిల గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి తప్ప ప్రత్యేక రాష్ట్రం కాదని  వైఎస్‌ నిరూపించారని అన్నారు. వైఎస్‌ఆర్‌ లాంటి సత్తా ఉన్న సీఎం లేకపోబట్టే  రాష్ట్రానికి ఈ గతి పట్టిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్ర విభజన  చేయండి అంటూ..18 అక్టోబర్‌, 2008న కేంద్రానికి చంద్రబాబు  రాసిన లేఖను చదివి షర్మిల వినిపించారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ..కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖను సమైక్య వాదులకు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎన్జీవోలకు జీతాలు ఇవ్వక పోయినా.. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. వారికి జీతాలు ఇవ్వడమే కాకుండా...వారిని గౌరవిస్తూ....ఒక నెల  బోనస్‌ కూడా ఇస్తుందని..జగనన్న తరపున మాట ఇస్తున్నట్లు.. షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏపీఎన్జీవోలను వేధించడంపై మండిపడ్డారు.
 

Advertisement
Advertisement