జెడ్పీ పీఠం కోసం అడ్డదారులు! | TDP plays Cheap tricks in Politics | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠం కోసం అడ్డదారులు!

Jun 20 2014 2:31 AM | Updated on Aug 10 2018 9:40 PM

జెడ్పీ పీఠం కోసం అడ్డదారులు! - Sakshi

జెడ్పీ పీఠం కోసం అడ్డదారులు!

రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాం.. ఇక తమకు తిరుగులేదంటూ జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాం.. ఇక తమకు తిరుగులేదంటూ జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు చాలినంత బలం లేకపోయినా అడ్డదారులు తొక్కుతున్నారు. బెదిరింపులకు దిగడంతోపాటు క్యాంప్ రాజకీయాలను నడుపుతున్నారు. గురువారం కొందరు జెడ్పీటీసీ సభ్యులను తీసుకుని ఇతర ప్రాంతాలకు ఆ పార్టీ నేతలు బయలుదేరి వెళ్లారు. క్యాంపులకు వెళ్లేందుకు ఇష్టపడని వారిని సైతం బలవంతంగా తీసుకెళ్లారు.
 
జిల్లాలో గతంలో 53 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ మాత్రం 20 స్థానాలతో సరిపుచ్చుకుంది. ఈ పరిణామాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారాన్ని ఉపయోగించి అడ్డదారిలోనైనా పీఠాన్ని దక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. గురువారం మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌కు చెందిన హోటల్ నుంచి.. ఓ బస్సులో కొందరు టీడీపీ జెడ్పీటీసీ సభ్యులను తీసుకొని హైదరాబాద్, తిరుపతి, హోస్పేట, ఊటి, కొడెకైనాల్ తదితర ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు.. తాము పార్టీ మారబోమని, పర్యటనకు రాలేమని చెప్పినా.. వినుకోలేదు. టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే మీ అంతు చేస్తామని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ జెడ్పీటీసీ సభ్యున్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. ‘మౌర్య హోటల్ వద్ద బస్సు ఉంటుంది.
 
మీ కుటుంబం అంతా ఆ బస్సులో ఎక్కాలి’ అంటూ టీడీపీ నేతలు ఒకరి వెంట ఒకరు తీవ్రస్థాయిలో బెదిరించినట్లు జెడ్పీటీసీ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. తాము రామంటున్నా.. టీడీపీ నేతలు విడిచిపెట్టటం లేదని వెల్లడించారు. ‘నీకు ఎంత కావాలంటే అంత తీసుకో’ అంటూ మరో జెడ్పీటీసీ సభ్యుడికి రూ.10 లక్షలు ఇవ్వజూపినట్లు సమాచారం. ఇంకో జెడ్పీటీసీ సభ్యుడికి రూ.5 లక్షలు నగదు, మరో రూ.5 లక్షలకు బ్యాంక్ చెక్కు ఆశ చూపినట్లు తెలిసింది. జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలెవ్వరూ లేనిది చూసి..టీడీపీ నేతలు రకరకాల ఒత్తిళ్లకు దిగటం గమనార్హం. అసెంబ్లీలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, టీడీపీ నేతల్లా అడ్డదారులు తొక్కటం తమకు తెలియదని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. అడ్డదారులు తొక్కటం మాని బాధ్యతగా నడచుకుంటే ప్రజల్లో విలువ ఉంటుందని హితువు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement