ఇసుక ‘తోడే’ళ్లు | ruling party leadera sand sumggling | Sakshi
Sakshi News home page

ఇసుక ‘తోడే’ళ్లు

Mar 27 2016 1:43 AM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుక ‘తోడే’ళ్లు - Sakshi

ఇసుక ‘తోడే’ళ్లు

హిందూపురం నియోజకవర్గంలోని పెన్నానదికి ఉపనదులైన జయమంగళి, కుముద్వతీ నదులతో పాటు చిలమత్తూరు ....

ఇసుక తరలింపుతో అడుగంటిన భూగర్భజలాలు
ఎండిపోయిన పరివాహక ప్రాంతాల బోరుబావులు

 
 హిందూపురం: హిందూపురం నియోజకవర్గంలోని పెన్నానదికి ఉపనదులైన జయమంగళి, కుముద్వతీ నదులతో పాటు చిలమత్తూరు మండలంలోని చిత్రావతి, కుషావతి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తరలింపుతో భూగర్భజలాలు పూర్తిగా ఎండిపోయి 1000 అడుగుల బోరు వేస్తే కానీ నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని వాగులు, చెరువుల్లో కూడా ఏపీ వాల్టా చట్టాన్ని అధికారులు అమలు చేయడం లేదు. నదీ పరీవాహక ప్రాంతాల్లో వేసిన పైప్‌లైన్లను కూడా వదలకుండా ఇసుక తోడేశారు.

2002లో ఏపీ వాల్టా చటాన్ని తీసుకువచ్చినా చంద్రబాబు కేవలం తమ అనుచరుల కోసం ఇసుక టెండర్లకు తెరదీసి స్థాయికి మించి ఇసుకను అక్రమ రవాణా చేశారు. దీంతో సమీప పరిసరాల్లో ఉన్న వ్యవసాయ బోర్లు, తాగునీటి బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. పెన్నానది పరీవాహక ప్రాంతం హిందూపురానికి, కర్ణాటక సరిహద్దు నుంచి పరిగి మండలం వరకు సుమారు 30 కిలోమీటర్ల పైన ఇసుక టెండర్లు వేసి ప్రభుత్వం లాంఛనంగా ఇసుక అక్రమ తరలింపునకు పచ్చజెండా ఊపడంతో ఈ నది పరీవాహక ప్రాంతాల్లోని ఇసుక అంతా కర్ణాటక కు చేరింది.

 ఎండిపోయిన బోర్లు, వందలఎకరాల్లో పంట నష్టం
పెన్నానది పరీవాహక సమీపాన ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. అనుమతికి మించి ఇసుకను తోడేయడంతో భూగర్భజలాలు అడుగంటాయి. తద్వారా వందలాది ఎకరాల్లో రైతులు వేసుకున్న పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయి. ఫలితంగా వందలాది మంది రైతులు నిరాశ్రయులయ్యారు.

 
 వర్షాలు వచ్చినా భూగర్భజలాలు పెరగవు
 పెన్నానది పరీవాహక ప్రాంత గ్రామాలైన పెద్దిరెడ్డిపల్లి, మోదా, చెర్లోపల్లి, శ్రీరంగరాజుపల్లి, మోతుకుపల్లి, ఉటుకూరు, పైడేటి తదితర గ్రామ ప్రజలు 1980 కంటే ముందు వేసవిలో నీళ్ల కోసం జయమంగళి, పెన్నానదిలో ఇసుక తోడితే నీరు వచ్చేది. అయితే ప్రస్తుతం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇసుకను అధికంగా తోడేయడంతో కనీసం నది ఛాయలు కూడా లేకుండా ముళ్లపొదలు దర్శనమిస్తున్నాయి. - వెంకటరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు
 
 ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు
 గతంలో ఇసుక టెండర్లను అడ్డుపెట్టుకుని మితిమీరిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ముసుగులో ఎవరైనా ఇసుక అక్రమంగా సరిహద్దును దాటించేందుకు ప్రయత్నించకుండా సంతేబిదనూర్ వద్ద ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పాటు చేస్తున్నాం.  - విశ్వనాథ్, తహశీల్దార్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement