రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి | Remand prisoner dead | Sakshi
Sakshi News home page

రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి

Jun 29 2014 3:10 AM | Updated on Nov 6 2018 8:04 PM

కేంద్రకారాగారంలో పి.మంగరాజు(31) అనే రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒడిశా రాష్ట్రం మల ్కన్‌గిరి జిల్లా పుట్టమర్రి గ్రామానికి చెందిన ఇతను 16 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

  •     సందేహాలకు తావిస్తున్న సూసైడ్ నోట్
  •      పోలీసులే హత్యచేశారన్న ఆరోపణలు
  •  విశాఖపట్నం : కేంద్రకారాగారంలో పి.మంగరాజు(31) అనే రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒడిశా రాష్ట్రం మల ్కన్‌గిరి జిల్లా పుట్టమర్రి గ్రామానికి చెందిన ఇతను 16 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మావోయిస్టులతో సంబంధాలు, హత్య, కిడ్నాప్, మారణాయుధాలు కలిగి ఉన్న కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన్ని 2010లో విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.

    విశాఖ కేంద్ర కారాగారానికి 2010, సెప్టెంబరు 5న తరలించారు.  6 కేసుల్లో బెయిల్ లభించింది. మరో పది కేసుల్లో బెయిల్ రాకపోవడంతో ప్రసుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మావోయిస్టు ఖైదీలుండే ప్రాణహిత బేరక్‌లో ఉంటున్నాడు. జైలు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో మంగరాజు మరుగుదొడ్డి లోపల ఇనుప గజాలకు ఉరి వేసుకున్నారు.

    బెడ్‌షీటు అంచు చించి తాడులా చేసి ఉరివేసుకున్నారు. సిబ్బంది గమనించి వెంటనే  కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజాము 3గంటల సమయంలో ప్రాణాలు విడిచారు. మంగరాజు మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నప్పటికీ ఈ విషయంపై తీవ్ర గోప్యత పాటిస్తుండటం సందేహాలకు తావిస్తోంది.   ‘సూసైడ్ నోట్’ అని అనధికారికంగా బయటకు వచ్చిన ఓ లేఖ సందేహాలను మరింతగా పెంచింది. మంగరాజు బ్యాగ్‌లో అధికారులు ఆ లేఖను గుర్తించినట్లుగా చెబుతున్నారు.

    ఆ లేఖలో కొంతభాగమే మీడియాకు చేరడం గమనార్హం. మంగరాజు రాశాడని చెబుతున్న ఆ లేఖలో అంశాలు కూడా సందేహాస్పదంగానే ఉన్నాయి. మావోయిస్టుల భయంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మంగరాజు పేర్కొన్నారు. ఖైదీలుగా ఉన్న మావోయిస్టులు జగదీష్, ప్రదీప్‌సింగ్ తదితరులు వేధించారని ఆయని పేర్కొన్నాడు.

    జైలులోనే ఉన్న మహిళా మావోయిస్టు తంబెళ్ల కమల అలియాస్ రుప్పి తనత సన్నిహితంగా ఉండటాన్ని వారు తప్పుగా చిత్రీకరించారని కూడా మంగరాజు చెప్పినట్లుగా ఉంది. తనకు కమలకు మధ్య సోదర బంధం తప్పా మరేమీ లేదని... కానీ మావోయిస్టులు మాత్రం తమను తప్పుగా అర్థం చేసుకుని వేధించారని ఆయన చెప్పారు. కమలను, తనను చంపేస్తామని బెదింరించారన్నారు. వేధింపులు పడలేకే తాను ఆత్మహత్య చేసుకుంటుఉన్నానని కూడా వివరించాడు.  

    ఈ లేఖ మంగరాజు రాసిందేనా లేక ఎవరైనా సృష్టించారా అన్నది సందేహాస్పదంగానే ఉంది. విచారణ పేరిట వేధించి పోలీసులే మంగరాజును హత్య చేసి ఉంటారని విరసం నేత చలసాని ప్రసాద్ ఆరోపించారు. ఆ తప్పు నుంచి తప్పించుకునేందుకే సూసైడ్ నోట్‌ను సృష్టించి కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని చెప్పారు.   

    ఈ సంఘటనపై నిష్పక్షికంగా విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని చలసాని ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగరాజు మానసిక రోగి అని జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు.  గత ఏడాది జూలై 30న నగరంలో మెంటల్ ఆసుత్రికి తరలించామన్నారు. అక్కడ చికిత్స అనంతరం నవంబరు 5న తిరిగి అక్కడ వైద్యులు జైల్‌కు పంపించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement