బాహ్య ప్రపంచంలోకి ఖైదీ | Prisoner Release In Visakhapatnam | Sakshi
Sakshi News home page

బాహ్య ప్రపంచంలోకి ఖైదీ

Oct 6 2018 7:42 AM | Updated on Oct 12 2018 12:59 PM

Prisoner Release In Visakhapatnam - Sakshi

శ్రీనివాసరావుతో గాంధీ రాసిన గ్రంథంపై ప్రమాణం చేయిస్తున్న జైల్‌ అధికారులు

ఆరిలోవ(విశాఖ తూర్పు): మహాత్మా గాంధీజీ 150వ జయంతి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి విముక్తి కలిగింది. మరో రెండు నెలల్లో జైలు శిక్ష ముగియనున్న ఆయన శుక్రవారం బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టాడు. వివరాలిలా ఉన్నాయి. జాతిపిత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శిక్ష పడిన ఖైదీలలో సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 27న క్షమాభిక్ష జోవో విడుదల చేసింది. నిబంధనలు ప్రకారం అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని పేర్కొంది. దీంతో ఇక్కడ జైలు అధికారులు ఆగమేఘాలపై అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి 14 మంది అర్హులైన ఖైదీల జాబితా జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. వాటిని స్క్రూటినీ చేసి 9 మంది అర్హులుగా ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే గురువారం రాత్రి ఆ జాబితాలో ఒక్కరే అర్హుడిగా ప్రకటిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఇక్కడ జైలు అధికారులకు ఉత్తర్వులు అందాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు విడుదల కాగా.. వారిలో విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఒకరికి అవకాశం కలిగింది(మిగిలిన నలుగురు రాజమండ్రి కారాగారం నుంచి విడుదలయ్యారు). ఈ ఉత్తర్వుల ప్రకారం క్షమాభిక్షకు అర్హుడైన విజయనగరంలో వీటి అగ్రహారం పెద్దవీధికి చెందిన బోడసింగి శ్రీనివాసరావును జైల్‌ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. గాంధీ రాసిన గ్రంథంపై ఆయనతో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు వెంకటేశ్వర్లు, జి.మనోహర్‌రెడ్డి, జైలర్లు సమక్షంలో జైల్‌ ముందున్న గాంధీ విగ్రహం వద్ద ప్రమాణం చేయించారు. విగ్రహానికి విడుదలైన ఖైదీతో పూలదండ వేయించి నివాళులు అర్పించారు. అనంతరం బాహ్య ప్రంచంలోకి విడిచిపెట్టారు. నిబంధనలు ప్రకారం ఆయనతో పూచికత్తు బాండ్‌ రాయించుకున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు. ఆయన బాహ్య ప్రపంచంలో ఎలాంటి నేరాలు, గొడవలకు పాల్పడితే మళ్లీ జైలుకు తీసుకొస్తామన్నారు. 

శ్రీనివాస్‌కు 498ఏ, 324 కేసుల్లో శిక్ష
శ్రీనివాసరావు తన భార్యను వేధించిన కేసులో సెక్షన్‌ 498ఏ కేసులో కోర్టు సంవత్సరం శిక్ష, రూ.1,000లు జరిమానా విధించింది. ఆయన రూ.1000లు జరిమానా చెల్లించాడు. దీంతో పాటు సెక్షన్‌ 324 కేసులో మరో ఆరు నెలల శిక్ష పడింది. ఈ రెండిండికి కోర్టు ఏక కాలంలో శిక్ష విధించింది. నాలుగు నెలల పాటు విజయనగరం సబ్‌ జైల్‌లో రిమాండ్‌ ఖైదు అనుభవించిన శ్రీనివాసరావు శిక్ష పడిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ క్షమాభిక్షలో అర్హుడు కావడంతో మరో రెండు నెలలు శిక్షా కాలం ఉండగానే విడుదలయ్యాడు.

గాంధీ దయవల్లముందుగానే బయటపడ్డా..
శిక్షా కాలం పూర్తి కాకుండానే మహాత్మా గాంధీ దయ వల్ల రెండు నెలల శిక్షా కాలం ఉండగానే బయటపడ్డాను. బాహ్య ప్రపంచంలో ఎలాంటి గొడవలు, నేరాలకు పాల్పడకుండా జీవిస్తాను. జైలు జీవితం నాలో మంచి మార్పు తీసుకొచ్చింది. జైలులో స్వేచ్ఛను కోల్పోయినా మంచి ప్రవర్తన నాలో కలిగింది.  – శ్రీనివాసరావు,క్షమాభిక్షపై విడుదలైన వ్యక్తి 

Advertisement
 
Advertisement
Advertisement