రాష్ట్ర విభజనపై నరేంద్రమోడీ దృష్టి
రాష్ట్ర విభజనపై కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రాజధాని అంశాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. అలాగే అఖిలభారత సర్వీసుల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై సంతకం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని, రాష్ట్ర అభివృద్ధికి అదనంగా నిధులు కేటాయించాలని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కోరిన విషయం తెలిసిందే. అందుకు మోడీ సానూకూలంగా స్పందిచారు. ఈ నేపధ్యంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే మోడీ ఈ అంశంపై దృష్టి సారిస్తారని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మోడీతో హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సమావేశమయ్యారు. విభజనపై హోంశాఖ చేపట్టిన చర్యలను ఆయన మోడీకి వివరించారు. విభజనకు సంబంధించి హోంశాఖ సిద్ధం చేసిన బ్లూ ప్రింట్ను ఆయనకు చూపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీపైన కూడా వారు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విభజన పనులు వేగంగా పూర్తి చేయాలని మోడీ ఆదేశించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజనపై కేంద్ర నియమించిన ప్రత్యూష్‌సిన్హా కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సమావేశమయ్యారు. ఆలిండియా సర్వీస్ ఉద్యోగులతో చర్చలు జరిపారు. ఉద్యోగుల పంపిణీ వివాదాలకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఇతర రాష్ట్రా విభజన సమయంలో అనుసరించిన విధానాలను మహంతి పరిశీలిస్తున్నారు.


