ఇన్‌స్పైర్ సైన్స్ ఫెయిర్ ప్రారంభం | Inspire Science Fair Start | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పైర్ సైన్స్ ఫెయిర్ ప్రారంభం

Aug 7 2013 12:34 AM | Updated on Sep 15 2018 7:34 PM

శాస్త్రీయ అభివృద్ధితోనే మానవ జీవన ప్రమాణాలు ముడిపడి ఉన్నాయని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వి.సునీతారెడ్డి అన్నారు.

మెదక్, న్యూస్‌లైన్: శాస్త్రీయ అభివృద్ధితోనే మానవ జీవన ప్రమాణాలు ముడిపడి ఉన్నాయని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వి.సునీతారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో ఇన్‌స్పైర్ సైన్స్ ఫెయిర్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం డీఈఓ రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. విజ్ఞాన శాస్త్రంపైనే అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. గతంలో సంగారెడ్డిలో నిర్వహించిన ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లో కదిలే సోలార్ ప్లేట్ల ద్వారా సౌర విద్యుత్‌ను కొంతమంది విద్యార్థులు తయారు చేశారని, దాని ఆధారంగానే మార్కెట్‌లో నేడు సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. మెదక్ పట్టణంలో బాలికల కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు.
 
 ‘బంగారు తల్లి’ పథకం మంచిదే..
 ఆడపిల్ల పుడితే రాష్ట్రంలోనే పుట్టాలనే విధంగా ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో బాలికల కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించాలని కోరారు. మెదక్ మెతుకుసీమ కాదని... పదునైన మెదడు ఉన్న కత్తిసీమ అని జాయింట్ కలెక్టర్ శరత్ అభివర్ణించారు. ప్రతి వ్యక్తి పదిమందికి సహాయ పడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందన్నారు. డీఈఓ రమేశ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ ధృక్పథాన్ని వెలికి తీయడానికే ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు 377 ప్రదర్శనలు వచ్చాయన్నారు.
 
 కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రమేశ్‌బాబు, తహశీల్దార్ పుష్పలత, ఏఎంసీ చైర్మన్ మధుసూదన్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డిప్యూటీ ఈఓలు సామెల్, శోభ, వెస్లీ ప్రిన్సిపాల్ డయాన డార్కస్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షులు యాదగిరి, ఏపీటీఎఫ్, ఆపస్ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చంద్రపాల్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆంజనేయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement