ఫలించిన వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ఉద్యమం | Medical Colleges: Ysrcp One Crore Signature Campaign Yields Results | Sakshi
Sakshi News home page

ఫలించిన వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ఉద్యమం

Jul 17 2026 4:15 PM | Updated on Jul 17 2026 4:45 PM

Medical Colleges: Ysrcp One Crore Signature Campaign Yields Results

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆమోదం

ఎంపీ గురుమూర్తికి కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి లేఖ

ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ఉద్యమం ఫలించింది. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది. 2026-27  విద్యా సంవత్సరానికి లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చినట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తికి కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లేఖ రాశారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సహా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్న అంశంపై వైఎస్సార్‌సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి గత పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించారు. ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఎంపీ గురుమూర్తికి లేఖ ద్వారా సమాధానం పంపారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీ గురుమూర్తి 2025 డిసెంబర్ 12న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు, లోక్‌సభలో రూల్-377 కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ)తో సంప్రదించి అంశాన్ని పరిశీలించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 39 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, వాటిలో 19 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, 20 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 7,215 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, అందులో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 3,415, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 3,800 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. అదేవిధంగా, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు, చిత్తూరులోని ఆర్వీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు 150 ఎంబీబీఎస్ సీట్లతో అనుమతి జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తన లేఖలో స్పష్టం చేసింది.

ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధి, ప్రభుత్వ వైద్య కళాశాలల బలోపేతం, వైద్య విద్య అవకాశాల విస్తరణకు సంబంధించిన అంశాలను పార్లమెంట్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి పేద విద్యార్ధులకు వైద్య విద్యతోపాటు, మెరుగైన వైద్యం అందించాలన్న తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రయోజన అంశాలపై భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నిరంతరం కృషి కొనసాగిస్తానని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement