సాక్షి,అమరావతి: చంద్రబాబు కాన్వాయ్ వాహనాల కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది. సరికొత్త వాహనాల కొనుగోలుకు రూ.18.66 కోట్లు కేటాయిస్తూ కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు జీవోలను జారీ చేసింది. మూడు జామర్ వాహనాల కొనుగోలుకు అత్యధికంగా రూ.12.28 కోట్లు, మరో మూడు జామర్ వాహనాల కోసం రూ.3.74 కోట్లు కేటాయించారు. వీటితో పాటు భద్రతా కోసం ఆరు సరికొత్త ఫార్చూనర్ లగ్జరీ వాహనాల కొనుగోలుకు రూ.2.64 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
గత నెలలోనూ కాన్వాయ్ వాహనాల నిమిత్తం ప్రభుత్వం రూ.9.60 కోట్లు విడుదల చేసింది. అంతకుముందు జూన్ నెలలోనూ రెండు జామర్ వాహనాల కొనుగోలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈ లెక్కన కేవలం నెల రోజుల వ్యవధిలోనే సీఎం కాన్వాయ్ మరియు భద్రతా వాహనాల కోసం ఏకంగా రూ.28.30 కోట్లను కూటమి ప్రభుత్వం ప్రజాధనం నుండి విడుదల చేయడం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోదీ తరహాలోనే సీఎం చంద్రబాబు కూడా తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించుకున్నారంటూ గత కొద్ది రోజులుగా అధికారిక వర్గాలు విస్తృతంగా ప్రచారం చేసుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కఠిన పొదుపు చర్యలు పాటిస్తామని ప్రకటించిన రెండు నెలల్లోనే.. తెరవెనుక ఈ స్థాయిలో కోట్ల రూపాయలను కొత్త వాహనాలకు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పొదుపు నీతులు చెబుతూనే, మరోవైపు కేవలం నెల రోజుల్లో వాహనాల కోసమే రూ.28.30 కోట్లు విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


