ఏసీబీ ఉచ్చులో సబ్ రిజిస్ట్రార్ | Ibrahimpatnam sub-registrar in ACB trap | Sakshi
Sakshi News home page

ఏసీబీ ఉచ్చులో సబ్ రిజిస్ట్రార్

Oct 8 2013 3:52 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వనజకుమారి ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్నారు.

 ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వనజకుమారి ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ. 5 వేలు తన సహాయకుడి ద్వారా వసూలు చేసిన ఆమె  ఏసీబీ అధికారులకు సోమవారం పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని సోమవారం సాయంత్రం సబ్ రిజిస్ట్రార్ సహా ఆమె సహాయకుడు ఐతాల శివను అదుపులోకి తీసుకున్నారు.
 
 ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ జి. ప్రభాకర్ కథనం ప్రకారం.. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన పండాల దశరథగౌడ్ కొన్ని రోజుల క్రితం తన ఎకరం 36 గుంటల భూమిని స్నేహితుడు ఎదటి రమేశ్‌కు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రిజిస్ట్రేషన్ వ్యయం తానే భరిస్తానని  దశరథ్‌గౌడ్ స్నేహితుడికి చెప్పాడు. ఈ విషయమై ఆయన ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్  వనజకుమారిని సంప్రదించాడు. తనకు రూ. 5 వేలు లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చలాన్ డబ్బులను దశరథగౌడ్ గత శనివారం బ్యాంకులో డీడీ తీసుకున్నాడు. సోమవారం రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఆయన సబ్ రిజిస్ట్రార్‌కు చెప్పాడు.
 
 అనంతరం దశరథ్ గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం సోమవారం ఏసీబీ అధికారులు ఇబ్రహీంపట్నంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మాటు వేశారు. రసాయనం పూసిన రూ. 5 వేలను (500 నోట్లు 10) అధికారులు దశరథ్‌గౌడ్‌కు ఇచ్చారు. ఈక్రమంలో ఆయన సబ్‌రిజిస్ట్రార్ వనజకుమారిని కలిశాడు. రూ. 5 వేలను కార్యాలయంలో ఉన్న తన సహాయకుడు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కౌరంపేట్ గ్రామానికి చెందిన ఐతాల శివకు ఇవ్వాలని ఆమె దశరథ్‌గౌడ్‌కు సూచించారు. ఆయన డబ్బులు శివకు అందించగానే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, సీఐలు రాజు, లక్ష్మీ తదితర అధికారులు సబ్ రిజిస్ట్రార్ వనజకుమారిని, ఆమె సహాయకుడు శివను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement