breaking news
vanaja kumari
-
వనజ చితాభస్మంలో బయటపడ్డ కత్తెర
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఘోర ఘటన వెలుగు చూసింది. పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లిన యువతి, కడుపు నుంచి బయటపడ్డ పసికందు.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి బలయ్యారు!. ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే.. పుట్టెడు దుఖంలో ఆ తల్లీబిడ్డలకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించగా.. చితాభస్మం నుంచి కత్తెర బయటపడడం ఒక్కసారిగా కలకలం రేపింది. గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో జరిగిన దారుణ ఘటనలో వైద్య నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వనజ (20) అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 13న గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ ప్రసవాన్ని ఒక నర్సు నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియలో అవగాహన లోపం కారణంగా శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ పసికందును ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని అక్కడి వైద్యులు తెలిపారు. ఇటు తీవ్ర రక్తస్రావంతో వనజ పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె కూడా కన్నుమూసింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సంబంధిత సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని.. విచారణకు ఆదేశించారు. ఈలోపు మరో ఘోరం బయటపడింది. కర్మకాండల కోసం వనజ చితాభస్మాన్ని సేకరిస్తున్న సమయంలో అందులో శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తెర బయటపడడంతో షాక్ తిన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురై, ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయారని, చితాభస్మంలో కత్తెర బయటపడటమే దీనికి స్పష్టమైన నిదర్శనమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు ఆసుపత్రి వైద్యాధికారులు మాత్రం సాధారణ ప్రసవమే జరిగిందని, చితాభస్మంలో కత్తెర ఎలా వచ్చిందో తమకు తెలియదని పేర్కొంటూ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. -
ఏసీబీ ఉచ్చులో సబ్ రిజిస్ట్రార్
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వనజకుమారి ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ. 5 వేలు తన సహాయకుడి ద్వారా వసూలు చేసిన ఆమె ఏసీబీ అధికారులకు సోమవారం పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని సోమవారం సాయంత్రం సబ్ రిజిస్ట్రార్ సహా ఆమె సహాయకుడు ఐతాల శివను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ జి. ప్రభాకర్ కథనం ప్రకారం.. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన పండాల దశరథగౌడ్ కొన్ని రోజుల క్రితం తన ఎకరం 36 గుంటల భూమిని స్నేహితుడు ఎదటి రమేశ్‌కు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రిజిస్ట్రేషన్ వ్యయం తానే భరిస్తానని దశరథ్‌గౌడ్ స్నేహితుడికి చెప్పాడు. ఈ విషయమై ఆయన ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వనజకుమారిని సంప్రదించాడు. తనకు రూ. 5 వేలు లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చలాన్ డబ్బులను దశరథగౌడ్ గత శనివారం బ్యాంకులో డీడీ తీసుకున్నాడు. సోమవారం రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఆయన సబ్ రిజిస్ట్రార్‌కు చెప్పాడు. అనంతరం దశరథ్ గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం సోమవారం ఏసీబీ అధికారులు ఇబ్రహీంపట్నంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మాటు వేశారు. రసాయనం పూసిన రూ. 5 వేలను (500 నోట్లు 10) అధికారులు దశరథ్‌గౌడ్‌కు ఇచ్చారు. ఈక్రమంలో ఆయన సబ్‌రిజిస్ట్రార్ వనజకుమారిని కలిశాడు. రూ. 5 వేలను కార్యాలయంలో ఉన్న తన సహాయకుడు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కౌరంపేట్ గ్రామానికి చెందిన ఐతాల శివకు ఇవ్వాలని ఆమె దశరథ్‌గౌడ్‌కు సూచించారు. ఆయన డబ్బులు శివకు అందించగానే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, సీఐలు రాజు, లక్ష్మీ తదితర అధికారులు సబ్ రిజిస్ట్రార్ వనజకుమారిని, ఆమె సహాయకుడు శివను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.


