రాజీనామాలు చేశాకే రాజ్‌భవన్‌కు! | governor narasimhan react on Defection after resigns come to rajbhavan | Sakshi
Sakshi News home page

రాజీనామాలు చేశాకే రాజ్‌భవన్‌కు!

Mar 2 2017 5:43 AM | Updated on Aug 14 2018 11:26 AM

రాజీనామాలు చేశాకే రాజ్‌భవన్‌కు! - Sakshi

రాజీనామాలు చేశాకే రాజ్‌భవన్‌కు!

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గవర్నర్‌ నరసింహన్‌ గట్టి షాకిచ్చారు.

- పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తేల్చిన గవర్నర్‌
- ఓ సీనియర్‌ మంత్రికి స్వయంగా చెప్పిన నరసింహన్‌

కంగుతిన్న సీఎం చంద్రబాబు, ఫిరాయింపుదార్లకు షాక్‌
గతంలో తెలంగాణలో తలసాని వ్యవహారంలో గవర్నర్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం
రాజ్యాంగాన్ని ఉల్లంఘించారంటూ విమర్శలు
ఫిరాయింపులపై హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు వేసిన తెలంగాణ టీడీపీ నేతలు
మరో వివాదానికి తావివ్వరాదని గవర్నర్‌ నిర్ణయం..
మీరు కేసులు వేయడం వల్లే ఇదంతా అంటూ తెలంగాణ టీడీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం
బాబు చెప్పినట్లే చేశామని, ఇప్పుడు తమపై నెపం నెడితే ఎలా అంటున్న టీటీడీపీ నేతలు


సాక్షి, హైదరాబాద్‌
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గవర్నర్‌ నరసింహన్‌ గట్టి షాకిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడానికి ససేమిరా అన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆ వర్గాల కథనం ప్రకారం.. గవర్నరే స్వయంగా ఏపీకి చెందిన ఓ సీనియర్‌ మంత్రికి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.  ‘వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీకి ఫిరాయించిన వారు తమ పదవులకు రాజీనామా చేయాలి. వాటికి ఆమోదం పొందాలి. ఆ తర్వాతే రాజ్‌భవన్‌కు రావాలి.

రాజీనామా చేసి, ఆమోదం పొందితే తప్ప వారిచేత ప్రమాణ స్వీకారం చేయించబోను’ అని తేల్చిచెప్పారు. టీడీపీలో కొందరితో పాటు వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చి చేరిన ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తామని చంద్రబాబు ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో గవర్నర్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు చంద్రబాబు సహా టీటీడీపీ నేతలు గవర్నర్‌ను తీవ్రంగా తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు చేశారు. ఆ తరువాత కొంత కాలానికి శ్రీనివాస్‌యాదవ్‌ సహా మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనం కావడంతో అది మరుగున పడిపోయింది. మరోసారి అలాంటి విమర్శలకు తావివ్వకూడదని గవర్నర్‌ భావిస్తున్నారు. అదే విషయాన్ని ఆయన ఇటీవల ఏపీ, తెలంగాణ ఆస్తుల పంపకం సమావేశానికి హాజరైన ఏపీ సీనియర్‌ మంత్రికే చెప్పారు.

అప్పట్లో గవర్నర్‌పైనే బాబు విమర్శలు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన మంత్రి తలసాని వ్యవహారం ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. తలసాని మంత్రివర్గంలో చేరడానికి ముందే తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. స్పీకర్‌ కార్యాలయానికి రాజీనామా కాపీని పంపినట్లు వెల్లడించారు. ఆ తర్వాతే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించలేదు. తెలంగాణ టీడీపీ నేతలు మంత్రి తలసాని రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. అదే సందర్భంలో తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌పై విమర్శలు చేశారు. దీంతో మరోసారి వివాదానికి తావివ్వకూడదని గవర్నర్‌ గట్టిగా నిర్ణయించుకున్నారని రాజ్‌భవన్‌వర్గాలు వెల్లడించాయి. వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ముందుగా పదవులకు రాజీనామా చేయడంతో పాటు వాటికి ఆమోదం పొందాలని, ఆ తరువాతే ప్రమాణ స్వీకరానికి రావాలని గవర్నర్‌ చెప్పడంతో టీడీపీ షాక్‌కు గురైంది.

తెలంగాణ టీడీపీ నేతలపై బాబు మండిపాటు
మంత్రివర్గ విస్తరణపై గవర్నర్‌ వైఖరి తెలుగుదేవం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరుకున పెట్టింది. దీంతో ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలపై ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇటీవల జరిగిన సీనియర్‌ నేతల సమావేశంలో చంద్రబాబు పరోక్షంగా దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ప్రతిదానికీ న్యాయస్థానాలకు వెళ్లడం మంచిది కాదని తలసాని మంత్రిపదవి వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు అన్నట్లు పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. తలసాని వ్యవహారంలో అధినేత చంద్రబాబు చెప్పినట్టే చేశామని, ఆయన చెప్పబట్టే కోర్టుల్లో కేసులు వేశామని, ఇప్పుడు ఆయనే మమ్మల్ని తప్పుపడుతున్నారని ఆనేత వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు డబ్బులివ్వబోయి పట్టుబడి, తెలంగాణలో పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసిన చంద్రబాబు మాట మార్చడాన్ని ఇక్కడి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటుకు కోట్లు కేసు వల్ల పార్టీని పాడే మీదకు తీసుకెళ్లి ఇప్పుడు ఆ పని తామేదో చేసినట్లు మాట్లాడుతున్నారని వారు చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement