‘నన్నెవరూ వేధించలేదు’.. వాంగ్మూలంలో జెత్వానీ | Key Point in Jethwani Case: No Allegation of Harassment Against Police in Her Statement | Sakshi
Sakshi News home page

‘నాపై ఎలాంటి వేధింపులు జరగలేదు’.. వాంగ్మూలంలో జెత్వానీ

Jul 21 2026 4:57 PM | Updated on Jul 21 2026 5:23 PM

Key Point in Jethwani Case: No Allegation of Harassment Against Police in Her Statement

సాక్షి,అమరావతి: నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను పోలీసులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని, ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని జెత్వానీ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. అప్పటి దర్యాప్తు, కోర్టు ప్రక్రియల సమయంలో పోలీసులపై ఎలాంటి ఆరోపణలు చేయని అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రభుత్వం, ఎల్లో మీడియా కథనాలు నడుపుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముంబై కోర్టులో ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం హాజరైన సమయంలోనూ, విజయవాడ న్యాయస్థానం ముందు రిమాండ్‌ ప్రక్రియలోనూ జెత్వానీ పోలీసులపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. బెయిల్‌ పిటిషన్‌, క్వాష్‌ పిటిషన్‌, పోలీసు కస్టడీ విచారణ, బెయిల్‌ షరతుల సడలింపు వంటి న్యాయ ప్రక్రియల్లోనూ పోలీసుల వేధింపులు, అక్రమ నిర్బంధంపై ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదని రికార్డులు సూచిస్తున్నాయి.

అంతేకాకుండా, పోలీసు అధికారులపై నమోదు చేసిన క్రైమ్‌ నంబర్‌ 469/2024కు సంబంధించిన వివరాల్లో కూడా జెత్వానీ రిమాండ్‌, పోలీసు కస్టడీ సమయంలో పోలీసులు తనను శారీరకంగా వేధించలేదని తెలిపినట్లు పేర్కొంది. తనను ఎలాంటి గెస్ట్‌హౌస్‌కు తరలించలేదని కూడా ఆమె వెల్లడించింది.  

జెత్తాన్వీ కేసులో కీలక మలుపు.. కుట్ర బట్టబయలు
ఈ నేపథ్యంలో, ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు కొత్త మలుపు తీసుకోవడం చర్చనీయాంశమైంది. గతంలో కోర్టుల ముందు ప్రస్తావనకు రాని ఆరోపణలు తర్వాత తెరపైకి రావడం, వాటి ఆధారంగా ముగ్గురు సీనియర్‌ పోలీసు అధికారులపై కేసులు, సస్పెన్షన్లు, అరెస్టుల దిశగా చర్యలు జరగడం రాజకీయ కక్షసాధింపులో భాగమని తేలింది.దీంతో చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తోందనేది తేటతెల్లమైంది. న్యాయస్థానాల అనుమతులతో సాగిన దర్యాప్తు ప్రక్రియను ఇప్పుడు అక్రమ చర్యగా చిత్రీకరిస్తూ, అధికారులను దోషులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులపై ఫిర్యాదులు చేయలేదు : జెత్వాని 
ఇదే సమయంలో ఎల్లో మీడియా కూడా కోర్టు రికార్డులు, దర్యాప్తు ప్రక్రియలోని కీలక అంశాలను పూర్తిగా ప్రస్తావించకుండా ప్రభుత్వ వాదనకు అనుకూలంగా కథనాలు ప్రచారం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. జెత్వానీ అప్పట్లో పోలీసులపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదన్న అంశాన్ని పక్కనపెట్టి, తర్వాత వచ్చిన ఆరోపణల ఆధారంగా అధికారులను నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ఈ కేసులో నిజానిజాలు రాజకీయ ఆరోపణల ఆధారంగా కాకుండా, కోర్టు రికార్డులు, సాక్ష్యాలు, న్యాయపరమైన విచారణ ఆధారంగానే తేలాల్సి ఉంది. అప్పట్లో లేని ఆరోపణలు తర్వాత ఎలా తెరపైకి వచ్చాయి? వాటి వెనుక కారణాలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానం న్యాయ ప్రక్రియ ద్వారానే రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement