అడ్డంకులు లేకుండా సమయం ఇవ్వండి
అడ్డంకులు కల్పించకుండా గంటన్నర పాటు ఏకధాటిగా సమయం కేటాయించాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రతిపక్షం తరఫున ఒకే ఒక్క సభ్యుడు.. అది కూడా ప్రతిపక్ష నాయకుడు మాత్రమే మాట్లాడతారని, అందువల్ల ప్రసంగానికి అడ్డంకులు కల్పించకుండా గంటన్నర పాటు ఏకధాటిగా సమయం కేటాయించాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరారు. వాయిదా అనంతరం సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ఆయన మాట్లాడారు. ఇదే విషయమై తమ పార్టీ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్‌తో మాట్లాడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాము కోరిన గంటన్నర సమయం కూడా ఇవ్వకపోతే అన్యాయమన్నారు. గత చరిత్ర చూస్తే చంద్రబాబు నాయుడు రెండు, రెండున్నర గంటల పాటు మాట్లాడారని, ఈ మూడేళ్లలో ఆయన చెప్పిన సమాధానాలు కూడా ఎక్కడా రెండు గంటలకు తక్కువ లేవని గుర్తు చేశారు. అయితే.. దానికి స్పీకర్ కోడెల స్పందిస్తూ, అందుబాటులో ఉన్నదాన్ని బట్టి అనుగుణంగా సమయం కేటాయిస్తామని తెలిపారు. కానీ దానికి తాము అంగీకరించడం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మాట్లాడితే వినాలని, విన్నదాన్ని అమలుచేయాలని అధికార పక్షం ఆరాటపడాలని, అసలు ప్రతిపక్షాన్ని మాట్లాడకూడదని భావించే అధికార పక్షాన్ని ఇక్కడే చూస్తున్నామని విమర్శించారు. దానికి సభావ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు లేచి నిబంధనలు ప్రస్తావించారు. దాంతో.. మంత్రిగారు రూల్స్ మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడేది కూడా అందులోనే కలపాలి తప్ప, ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఇస్తామన్న ఆలోచన సరికాదని జగన్ అన్నారు. అలా అయితే ప్రతిపక్ష నాయకుడిని కూడా పక్కన పెట్టి, ప్రతిపక్షానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాలన్నారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఎంత సమయం ఇస్తున్నారో, ప్రతిపక్షానికి కూడా నిష్పత్తి ప్రకారం అలాగే సమయం ఇవ్వాలని అన్నారు. కానీ.. రూల్స్ ప్రకారం సమాధానానికి ఎక్కడా ఇంత సమయం అని ఇవ్వలేదని, ప్రభుత్వం తన సమాధానంతో సంతృప్తి పరచాలి కాబట్టి దానికి సమయ పరిమితి ఉండబోదని యనమల ఈ సందర్భంలో అన్నారు.


