తిరువళ్లువర్‌ ‘కాషాయ’ కలకలం | Tamil Saint poet Thiruvalluvar in saffron robes at Lok Bhavan | Sakshi
Sakshi News home page

తిరువళ్లువర్‌ ‘కాషాయ’ కలకలం

Jun 1 2026 5:05 AM | Updated on Jun 1 2026 5:05 AM

Tamil Saint poet Thiruvalluvar in saffron robes at Lok Bhavan

తమిళ కవికి కాషాయ వస్త్రధారణపై విపక్షాల విమర్శలు

వివాదంగా మారిన గవర్నర్‌ ఆర్లేకర్‌ నివాళి ఘటన

చెన్నై:  ప్రాచీన తమిళ మహాకవి, తత్వవేత్త తిరువళ్లువర్‌ చిత్రపటాన్ని కాషాయ వ్రస్తాల్లో చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. వైకాశి అనుషం వేడుకల సందర్భంగా మే 30వ తేదీన లోక్‌ భవన్‌లో కాషాయ వ్రస్తాల్లో  ఉన్న తిరువళ్లువర్‌ చిత్రపటానికి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ నివాళులర్పించారు. దీనిపై అధికార తమిళగ వెట్రి కళగం, విపక్ష డీఎంకేసహా పలు పారీ్టలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. 

అధికారికంగా గుర్తించిన తిరువళ్లువర్‌ చిత్రంలో ఆయన తెల్లని వస్త్రం ధరించి కనిపిస్తారు. దానికి బదులుగా లోక్‌భవన్‌లో నివాళులర్పించిన చిత్రాన్ని తిరువళ్లువర్‌ కాషాయ రంగు వస్త్రం ధరించినట్లు చిత్రీకరించడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అరుణ్‌రాజ్‌ తీవ్రంగా స్పందించారు. మహాకవిని కాషాయ వ్రస్తాలలో ప్రదర్శించడాన్ని ఖండించారు.

 ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తను ఒక సంకుచిత గుర్తింపులో బంధించే ఏ ప్రయత్నమైనా ఆయన విశ్వ దృష్టిని కించపరచడమేనని పేర్కొన్నారు. తిరువళ్లువర్‌ ఏ ఒక్క మతానికీ, కులానికీ, జాతికీ, దేశానికీ పరిమితమైన కవి కాదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి విజయ్‌ నిరంతరం మౌనంగా ఉండటం వల్లే గవర్నర్‌ కార్యాలయం తిరువళ్లువర్‌కు కాషాయ రంగు వేయడానికి సాహసించిందని డీఎంకే అగ్రనేత ఉదయనిధి స్టాలిన్‌ ఆరోపించారు. లోక్‌ భవన్‌ను కాషాయమయంగా మార్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 

తిరువళ్లువర్‌కు కాషాయ రంగు అద్దడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా తిరువళ్లువర్‌ దినోత్సవాన్ని జనవరిలో నిర్వహిస్తుందని గుర్తుచేశారు. మరి వైకాశి అనుషం రోజు నిర్వహించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. డీఎంకే పాలనలో అప్పటి గవర్నర్‌ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించామని చెప్పారు. ఇప్పుడు మరోసారి తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ చర్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తదితరులు ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement