Rajendra Vishwanath Arlekar
-
తమిళనాట మరో ట్విస్టు
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి నరాలు తెగే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. జోసెఫ్ విజయ్ అనే నేనూ.. అంటూ శనివారం ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే వర్గాల్లో జోష్‌ను నింపి సంబరాల్లో ముంచెత్తాయి. అదే సమయంలో మద్దతు ఇచ్చామని చెప్పి, తర్వాత యూ టర్న్ తీసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్), విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే) రూపంలో దళపతి విజయ్‌కు పెద్ద షాక్ తప్పలేదు.సీపీఎం, సీపీఐలు బయటి నుంచి మద్దతు ఇస్తూ అధికారికంగా లేఖలు ఇవ్వగా, ఐయూఎంఎల్, వీసీకే మాత్రం ఇంకా లేఖలు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెరవెనుక బేరసారాల కోసమే మద్దతు విషయంలో వీసీకే తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 మంది ఎమ్మెల్యేలను(విజయ్ రెండు చోట్ల నెగ్గారు) గెల్చుకున్న సంగతి తెలిసిందే.మరో 10 మంది మద్దతు సంపాదించాల్సి ఉండగా, విజయ్ పార్టీకి అండగా నిలుస్తామని సీపీఐ(2), సీపీఎం(2), కాంగ్రెస్(5) ప్రకటించాయి. మొదట వీసీకే(2) నుంచి సానుకూల స్పందన రావడంతో మొత్తం బలం 118కి చేరింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమయ్యారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. తమకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పంపిస్తామని తెలియజేశారు. దాంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ విజయ్‌ని గవర్నర్ ఆహ్వనించినట్లు వార్తలు వచ్చాయి.అయితే, విజయ్‌కి మద్దతు విషయంలో వీసీకే శుక్రవారం అర్ధరాత్రి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మద్దతు లేఖ ఇవ్వలేదు. ఆ పార్టీ శనివారం తన తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఒకవేళ విజయ్‌కి మద్దతుగా ప్రకటన చేస్తే శనివారమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గవర్నర్‌తో భేటీ తర్వాత విజయ్ చెన్నైలో సీపీఎం, సీపీఐ కార్యాలయాలకు వెళ్లారు. ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వామపక్షాల ఆఫీసులను విజయ్ సందర్శించడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో నలుగురు శుక్రవారం రాత్రి బెంగళూరుకు చేరుకోవడం గమనార్హం. వీసీకే నాలుగు డిమాండ్లు నూతన ప్రభుత్వంలో తమకు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని వీసీకే సీనియర్ నేత వన్నియరసు పట్టుబట్టారు. ఆ పార్టీ నాలుగు డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఒక కేబినెట్ మంత్రిపదవి ఇవ్వాలని, ఎస్సీల సంక్షేమం కోసం చట్టం తీసుకురావాలని, రెండు చోట్ల గెల్చిన విజయ్ ఒకచోట రాజీనామా చేసిన పక్షంలో అక్కడి నుంచి వీసీకే అధినేత తిరుమావళవన్ పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని తేల్చిచెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏదైనా కీలక శాఖ ఇచ్చేందుకు టీవీకే నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వీసీకే అధినేత తిరుమావళవన్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ నిమిత్తం ఆయన నివాసానికి వెళ్లడంతో కొత్త చర్చను తెరమీదకు వచ్చింది.మరోవైపు విజయ్ పార్టీకి బయటి నుంచే మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో చేరే ఉద్దేశం లేదని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. డీఎంకేతో ప్రయాణం కొనసాగిస్తామని వెల్లడించాయి. బీజేపీ దొడ్డిదారిన తమిళనాడులోకి అడుగుపెట్టకుండా నిరోధించడానికే టీవీకేకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు కమ్యూనిస్ట్ నేతలు స్పష్టంచేశారు. పది రోజుల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా, ఐయూఎంఎల్ మద్దతును సైతం కూడగట్టేందుకు టీవీకే నేతలు ప్రయత్నించగా సానుకూల ఫలితం రాలేదు. తాము మొదటి నుంచీ డీఎంకేతోనే ఉన్నామని, వారితో చర్చించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఐయూఎంఎల్ తేల్చిచెప్పింది. దినకరన్ కొత్త ఎత్తుగడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ గవర్నర్ ఆర్లేకర్‌ను శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో కలవడం కొత్త చర్చకు దారితీసింది. తన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కామరాజర్ టీవీకేకు మద్దతు ఇచి్చనట్టుగా, ఆయన ప్రస్తుతం కనిపించకుండా పోవడం బట్టి చూస్తే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు బేరాలు సాగుతున్నాయని గవర్నర్‌కు వివరించారు. విజయ్ పదవీ కాంక్షతో ఉన్నారని, తమ ఎమ్మెల్యే అమ్ముడుపోయాడని అనుమానం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించాలని దినకరన్ కోరడం గమనార్హం. పళని స్వామికి సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. విజయ్ ప్రమాణ స్వీకారం సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో టీవీకే శ్రేణులు, అభిమానులు చెన్నైకి రావొద్దని టీవీకే కార్యాలయం నుంచి శుక్రవారం రాత్రి ఎస్ఎంఎస్లు వెళ్లాయి. నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి చేపట్టిన ఏర్పాట్లను నిలిపివేశారు. -
విజయారోహణలో ట్విస్టులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రివాజుకు భిన్నంగా ప్రధాన ద్రవిడ పార్టీలు రెండింటినీ రెండంకెలకు పరిమితం చేసి, రాజకీయ తెరపైకి విజేతగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్‌కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో చివరి నిమిషంలోనూ అవరోధాలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిగా శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత అనుకున్నా వీసీకే, ఐయూఎంఎల్ లేఖలు రాలేదని అంటున్నారు.దాంతో విజయ్ వరసగా మూడోరోజు గవర్నర్‌ని కలిసినా ఫలితం లేకపోయింది.సొంతంగా 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తామని అయిదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ప్రకటించగా, తాజాగా రెండేసి స్థానాలున్న సీపీఐ, సీపీఎంలు అంగీకారం తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 118 అవసరం కాగా, రెండుచోట్లనుంచి గెలిచిన విజయ్ ఎటూ ఒక స్థానం నుంచి తప్పుకోవాలి గనుక టీవీకే నికర బలం 107. రాజీనామా చేసే స్థానం తమకిస్తేనే లేఖ ఇస్తామని వీసీకే పట్టుబట్టగా, ఐయూఎంఎల్ అసలు లేఖే ఇవ్వలేదంటున్నారు. ఈ అంకెల ఆట ఎలావున్నా, ఆర్లేకర్ తీరు సంప్రదాయాలకు విరుద్ధం. ఈనెల 6న విజయ్ తొలిసారి గవర్నర్‌ను కలిసినప్పుడే ఆ వ్యవహారం ముగియాల్సి ఉండగా ఎందుకనో దీన్నింకా సాగదీస్తున్నారు.ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ‘ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్ భవన్లలో కాద’ని తెలిపింది. ఉన్నవాటిలో మెజారిటీ పొందిన పక్షమేదో గమనించుకుని ఆహ్వానించటం, బల నిరూపణకు గడువీయడం తప్ప గవర్నర్‌కు మరే ప్రత్యామ్నాయమూ లేదు. అందుకు భిన్నంగా వ్యవహరించటం ఎలా చూసినా ధర్మం కాదు. ఇది అనవసర అపోహలు, అనుమానాలకు తావిచ్చింది. కేంద్రం రాష్ట్రంలో అస్థిరత కోరుకుంటున్నదనీ, రాష్ట్రపతి పాలన విధిస్తారనీ వదంతులు వ్యాపించాయి. కొన్ని గంటలపాటు డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలుస్తాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అలా కలిసినా ఆ పక్షాలు విజయ్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం ఉండదు.ఈ ఊహాగానాలకు తావిచ్చేలా జాప్యం చేయటం అవసరమా? బలనిరూపణలో విఫలమైతే విజయ్ సర్కారు తప్పుకోవాల్సిరావొచ్చు. దానివల్ల కలిగే కష్టనష్టాలు ఆయన చూసుకుంటారు. ఆ పరిస్థితి ఏర్పడితే టీవీకే తర్వాత స్థానంలోవున్న పార్టీని ఆహ్వానించాలి.అంతేతప్ప లోక్‌భవన్‌లో లెక్కలు వేస్తూ కూర్చోవటం సరికాదు. విజయ్ తమ లేఖతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ కూడా ఇవ్వటమే సమస్య తెచ్చిందని కొందరు వాదిస్తు న్నారు. ప్రజల మనోభీష్టం నెరవేర్చేందుకు సాంకేతికపరమైన అంశాలు అభ్యంతరం కావటం సరికాదు.పొరుగునున్న కర్ణాటకలో కొన్నేళ్లక్రితం బీజేపీకి తక్కువ స్థానాలొ చ్చినా మెజారిటీ స్థానాలున్నాయి గనుక దాన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ నిర్ణయాన్నెవరూ తప్పుబట్టలేదు. సర్కారియా కమిషన్ సైతం 1988నాటి నివేదికలో ఎన్నికల ముందు ఏర్పడిన కూటములనూ, లేనట్టయితే ఉన్న పక్షాల్లో అత్యధిక స్థానాలొ చ్చిన పార్టీనీ పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ రెండేళ్లలో విజయ్ సాధించిన రాజకీయ అనుభవం సంగతేమోగానీ... ఈ మూడు నాలుగు రోజుల్లో ఆయనకది దండిగానే దక్కింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ తీరు జుగుప్సాకరంగావుంది. జాతీయస్థాయిలో ఇండియా కూటమికి నాయ కత్వం వహిస్తూ తన భాగస్వామ్యపక్షం తమిళనాట ఓడిపోగానే చేతులు దులుపుకొని బయటకు పోవటం ఏం నీతి? అందువల్ల విజయ్‌కి వీసమెత్తు ప్రయోజనం లేకపోగా, విపక్ష కూటమికి అది చేటు తెస్తుంది. కనీసం సహ భాగస్వామ్యపక్షాలు డీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎంలనైనా సంప్రదిస్తే మర్యాదగా ఉండేది.చివరకు సీపీఐ, సీపీఎం వచ్చి చేరాయిగానీ... రాజ్యాంగసంక్షో¿¶ నివారణకే ఆ పనిచేశాయి. ఆ మాత్రం వేచిచూడాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా, భవిష్యత్తు ఎన్నికలన్నిటికీ ఈ కొత్త పొత్తు వర్తిస్తుందని ప్రకటించి కాంగ్రెస్ మరింత చులకనైంది. ఒంటరిగా బరిలోదిగి తన సత్తాతో జనాభిమానం చూరగొని మెజారిటీ స్థానాలు పొందిన విజయ్‌కి అవకాశమీయకుండా మీనమేషాలు లెక్కించటం సరికాదు. అది అప్రజాస్వామికం. అన్ని అడ్డంకులూ తొలగి ఆయన ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, ప్రజాభీష్టం నెరవేరుతుందని ఆశించాలి. -
గవర్నర్ మరో మెలిక.. విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పరిణామం చోటు చేసుకుంది. రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయం లోక్‌భవన్ ప్రకారం, విజయ్‌కు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, మెజారిటీకి కావాల్సిన 118 సంఖ్య ఇంకా చేరలేదని స్పష్టం చేశారు. వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు లేఖలు ఇంకా అందలేదని గవర్నర్ కార్యాలయం పేర్కొంది.అయితే, విజయ్ శుక్రవారం మూడోసారి గవర్నర్‌ను కలుసుకుని టీవీకే, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల మద్దతుతో మొత్తం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని తెలిపారు. సంబంధిత లేఖలను గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్ కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అనంతరం విజయ్ తనకు మద్దతు తెలిపిన వామపక్ష నేతలతో సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు.సీపీఐ, సీపీఎం ఇప్పటికే బేషరతుగా మద్దతు ప్రకటించాయి. ఈ రెండు పార్టీలకు నాలుగు సీట్లు ఉన్నాయి. ఐయూఎంఎల్ రెండు సీట్లు గెలుచుకున్నప్పటికీ, వారు నేరుగా విజయ్‌కు మద్దతు ప్రకటించకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఐదు సీట్లతో ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించింది. విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లు గెలుచుకున్నప్పటికీ, ఆయన రెండు చోట్ల నుంచి గెలవడంతో అసలు సంఖ్య 107కి తగ్గింది. దీంతో మెజారిటీ మార్క్ 118కి 11 సీట్లు దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో వామపక్షాలు, కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు కీలకంగా మారింది. రెండు సీట్లు గెలిచిన వీసీకే పార్టీ.. డిప్యూటీ సీఎం పదవి కావాలని పట్టుబడుతోంది. అయితే, ఇప్పటికే వీసీకే పార్టీకి తాము పట్టణాభివృద్ధి శాఖ, తిరుచ్చి అసెంబ్లీ నియోజవకర్గం సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. ఊహించని విధంగా తమకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే మద్దతు పలుకుతామని, లేదంటే విరమించుకుంటామని పట్టుబట్టింది. అందకే గవర్నర్‌కు లేఖ అందించలేదు. అదే సమయంలో డీఎంకే అధినేత స్టాలిన్‌తో విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ అధినేత, ప్రముఖ దళిత నాయకుడు తోల్. తిరుమాళవన్ భేటీ అయ్యారు. -
విజయ్‌కు రాచమర్యాదలు చేయండి.. గవర్నర్ ఆదేశాలు
సాక్షి,చెన్నై: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదే మరి. ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే టీవీకే అధినేత విజయ్‌కు తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. కాన్వాయ్ ఎలా కేటాయిస్తారంటూ పోలీసు ఉన్నతాధికారులపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చిర్రుబుర్రులాడారు. ముఖ్యమంత్రి హోదా లేకుండా రాచమర్యాదలు ఎందుకు అన్న ప్రశ్నను లేవనెత్తారు. అయితే, ఇప్పుడు అదే విజయ్‌కు గవర్నర్ రాచమర్యాదలు చేశారు. విజయ్ కోసం కాన్వాయ్ సిద్ధం చేయాలని అధికారులకు గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే, పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను రెండు సార్లు కలిసినా ఆహ్వానం లభించలేదు. సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ తిరస్కరించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలపై గురువారం గవర్నర్‌తో చీఫ్ సెక్రటరీ సాయి కుమార్, డీజీపీ సందీప్ రాయ్ రాథోర్లు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హోదా లేకుండానే విజయ్‌కు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఎలా ఇస్తారంటూ గవర్నర్ ప్రశ్నించారు. దీంతో విజయ్‌కు పోలీస్ శాఖ జెడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించింది. శుక్రవారం విజయ్‌కు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతు ప్రకటించాయి. దీంతో ఆయనకు తగిన సంఖ్యాబలం లభించింది. విజయ్ గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మద్దతు లేఖను గవర్నర్‌కు అందించారు. ఈ క్రమంలో విజయ్ రాకతో గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. లోక్‌భవన్‌లో విజయ్ కోసం ప్రత్యేక కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. ఆసక్తికరంగా, మొన్న కాన్వాయ్ ఇవ్వడంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇప్పుడు మద్దతు నిరూపించుకున్న విజయ్ అదే కాన్వాయ్‌లో తిరిగి వెళ్లారు. రేపు ఉదయం 11గంటలకు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 11 లేదా 12న మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి,చెన్నై: టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతు ప్రకటించడంతో విజయ్‌కు స్పష్టమైన సంఖ్యాబలం లభించింది. టీవీకేకు 107, వీసీకేకు 2, సీపీఐకు 2, సీపీఎంకు 2, కాంగ్రెస్‌కు 5 స్థానాలు కలిపి విజయ్ బలం 118కి చేరింది.మెజార్టీ సభ్యుల జాబితాతో విజయ్ ఈ రోజు సాయంత్రం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలవనున్నారు. ఇప్పటికే విజయ్ గవర్నర్‌తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఆ సమయంలో సంఖ్యాబలం తక్కువగా ఉందని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.సంఖ్యాబలం కోసం విజయ్ వామపక్షాల మద్దతు కోరారు. పార్టీ జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వామపక్ష నేతలతో చర్చలు జరిపారు. నాలుగు రోజుల క్రితం లేఖ రాసి మద్దతు కోరిన టీవీకే, అనంతరం నేరుగా సమావేశమై చర్చలు జరిపింది. ఆ చర్చలు సఫలమవడంతో వామపక్షాలు, వీసీకే ఎలాంటి షరతులు లేకుండా విజయ్‌కు మద్దతు ప్రకటించాయి.వారికి కేబినెట్ బెర్త్లుప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన వీసీకే, సీపీఐ, సీపీఎంకు ఒక్కో మంత్రి పదవి, కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.టీవీకే శ్రేణుల సంబరాలు నాలుగు రోజుల అనిశ్చితి, గందరగోళం తర్వాత శుక్రవారం సాయంత్రం చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద ‘టీవీకే, టీవీకే’ నినాదాలు మార్మోగాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు సమకూర్చుకున్నారని సమాచారం రావడంతో ఆయన తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడంతో టీవీకే శ్రేణుల సంబరాలు అంబరార్నంటాయి.అదనపు మద్దతు అవసరం విజయ్ వద్ద 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో 11 మంది అదనపు మద్దతు అవసరమైంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నుంచి 5 మంది మద్దతు పొందారు. అలాగే వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలతో చర్చలు జరిపారు. ఇవి డీఎంకే మిత్రపక్షాలే అయినప్పటికీ, చివరికి విజయ్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీసీకే, సీపీఐ, సీపీఎం కలిపి 6 సీట్లు ఉండటంతో విజయ్‌కి కావలసిన సంఖ్య పూర్తయింది.


