విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ | TVK Vijay Likely To Meet Governor Today Amid Tamil Nadu Power Game | Sakshi
Sakshi News home page

విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

May 8 2026 3:33 PM | Updated on May 8 2026 5:50 PM

TVK Vijay Likely To Meet Governor Today Amid Tamil Nadu Power Game

సాక్షి,చెన్నై: టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతు ప్రకటించడంతో విజయ్‌కు స్పష్టమైన సంఖ్యాబలం లభించింది. టీవీకేకు 107, వీసీకేకు 2, సీపీఐకు 2, సీపీఎంకు 2, కాంగ్రెస్‌కు 5 స్థానాలు కలిపి విజయ్ బలం 118కి చేరింది.

మెజార్టీ సభ్యుల జాబితాతో విజయ్ ఈ రోజు సాయంత్రం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలవనున్నారు. ఇప్పటికే విజయ్ గవర్నర్‌తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఆ సమయంలో సంఖ్యాబలం తక్కువగా ఉందని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంఖ్యాబలం కోసం విజయ్ వామపక్షాల మద్దతు కోరారు. పార్టీ జాయింట్‌ సెక్రటరీ సీటీఆర్‌ నిర్మల్ కుమార్ వామపక్ష నేతలతో చర్చలు జరిపారు. నాలుగు రోజుల క్రితం లేఖ రాసి మద్దతు కోరిన టీవీకే, అనంతరం నేరుగా సమావేశమై చర్చలు జరిపింది. ఆ చర్చలు సఫలమవడంతో వామపక్షాలు, వీసీకే ఎలాంటి షరతులు లేకుండా విజయ్‌కు మద్దతు ప్రకటించాయి.

వారికి కేబినెట్‌ బెర్త్‌లు
ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన వీసీకే, సీపీఐ, సీపీఎంకు ఒక్కో మంత్రి పదవి, కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.

టీవీకే శ్రేణుల సంబరాలు  
నాలుగు రోజుల అనిశ్చితి, గందరగోళం తర్వాత శుక్రవారం సాయంత్రం చెన్నైలోని విజయ్‌ ఇంటి వద్ద ‘టీవీకే, టీవీకే’ నినాదాలు మార్మోగాయి. విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు సమకూర్చుకున్నారని సమాచారం రావడంతో ఆయన తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడంతో టీవీకే శ్రేణుల సంబరాలు అంబరార్నంటాయి.

అదనపు మద్దతు అవసరం  
విజయ్ వద్ద 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో 11 మంది అదనపు మద్దతు అవసరమైంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ నుంచి 5 మంది మద్దతు పొందారు. అలాగే వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలతో చర్చలు జరిపారు. ఇవి డీఎంకే మిత్రపక్షాలే అయినప్పటికీ, చివరికి విజయ్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీసీకే, సీపీఐ, సీపీఎం కలిపి 6 సీట్లు ఉండటంతో విజయ్‌కి కావలసిన సంఖ్య పూర్తయింది.

విజయ్ కి సంపూర్ణ మద్దతు.. చెన్నైలో TVK భారీ ఏర్పాట్లు

Advertisement
 
Advertisement
Advertisement