విజయ్‌కు రాచమర్యాదలు చేయండి.. గవర్నర్‌ ఆదేశాలు | TVK vijay Set to Form Government in Tamil Nadu | Sakshi
Sakshi News home page

విజయ్‌కు రాచమర్యాదలు చేయండి.. గవర్నర్‌ ఆదేశాలు

May 8 2026 7:19 PM | Updated on May 8 2026 8:01 PM

TVK vijay Set to Form Government in Tamil Nadu

సాక్షి,చెన్నై: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదే మరి. ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే టీవీకే అధినేత విజయ్‌కు తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. కాన్వాయ్ ఎలా కేటాయిస్తారంటూ పోలీసు ఉన్నతాధికారులపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చిర్రుబుర్రులాడారు. ముఖ్యమంత్రి హోదా లేకుండా రాచమర్యాదలు ఎందుకు అన్న ప్రశ్నను లేవనెత్తారు. అయితే, ఇప్పుడు అదే విజయ్‌కు గవర్నర్ రాచమర్యాదలు చేశారు.  విజయ్ కోసం కాన్వాయ్ సిద్ధం చేయాలని అధికారులకు గవర్నర్‌ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే, పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను రెండు సార్లు కలిసినా ఆహ్వానం లభించలేదు. సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ తిరస్కరించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలపై గురువారం గవర్నర్‌తో చీఫ్ సెక్రటరీ సాయి కుమార్, డీజీపీ సందీప్ రాయ్ రాథోర్లు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హోదా లేకుండానే విజయ్‌కు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఎలా ఇస్తారంటూ గవర్నర్ ప్రశ్నించారు. దీంతో విజయ్‌కు పోలీస్‌ శాఖ  జెడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించింది.  

శుక్రవారం విజయ్‌కు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతు ప్రకటించాయి. దీంతో ఆయనకు తగిన సంఖ్యాబలం లభించింది. విజయ్ గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మద్దతు లేఖను గవర్నర్‌కు అందించారు.  

ఈ క్రమంలో విజయ్ రాకతో గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. లోక్‌భవన్‌లో విజయ్ కోసం ప్రత్యేక కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. ఆసక్తికరంగా, మొన్న కాన్వాయ్ ఇవ్వడంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇప్పుడు మద్దతు నిరూపించుకున్న విజయ్‌ అదే కాన్వాయ్‌లో తిరిగి వెళ్లారు. రేపు ఉదయం 11గంటలకు నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 11 లేదా 12న మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement