శుక్రవారం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన టీవీకే అధినేత విజయ్
ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం
మద్దతు ప్రకటించినా అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే
నాలుగు డిమాండ్లకు అంగీకరించాలని పట్టు
నేడు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం
విజయ్‌కి గవర్నర్ నుంచి ఇంకా అందని ఆహ్వానం
వీసీకే మద్దతు ఇస్తే నేడే దళపతి ప్రమాణ స్వీకారం
బయటి నుంచే మద్దతు ఇస్తామన్న సీపీఐ, సీపీఎం
బెంగళూరుకు చేరిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి నరాలు తెగే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. జోసెఫ్ విజయ్ అనే నేనూ.. అంటూ శనివారం ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే వర్గాల్లో జోష్‌ను నింపి సంబరాల్లో ముంచెత్తాయి. అదే సమయంలో మద్దతు ఇచ్చామని చెప్పి, తర్వాత యూ టర్న్ తీసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్), విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే) రూపంలో దళపతి విజయ్‌కు పెద్ద షాక్ తప్పలేదు.
సీపీఎం, సీపీఐలు బయటి నుంచి మద్దతు ఇస్తూ అధికారికంగా లేఖలు ఇవ్వగా, ఐయూఎంఎల్, వీసీకే మాత్రం ఇంకా లేఖలు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెరవెనుక బేరసారాల కోసమే మద్దతు విషయంలో వీసీకే తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 మంది ఎమ్మెల్యేలను(విజయ్ రెండు చోట్ల నెగ్గారు) గెల్చుకున్న సంగతి తెలిసిందే.
మరో 10 మంది మద్దతు సంపాదించాల్సి ఉండగా, విజయ్ పార్టీకి అండగా నిలుస్తామని సీపీఐ(2), సీపీఎం(2), కాంగ్రెస్(5) ప్రకటించాయి. మొదట వీసీకే(2) నుంచి సానుకూల స్పందన రావడంతో మొత్తం బలం 118కి చేరింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమయ్యారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. తమకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పంపిస్తామని తెలియజేశారు. దాంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ విజయ్‌ని గవర్నర్ ఆహ్వనించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, విజయ్‌కి మద్దతు విషయంలో వీసీకే శుక్రవారం అర్ధరాత్రి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మద్దతు లేఖ ఇవ్వలేదు. ఆ పార్టీ శనివారం తన తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఒకవేళ విజయ్‌కి మద్దతుగా ప్రకటన చేస్తే శనివారమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గవర్నర్‌తో భేటీ తర్వాత విజయ్ చెన్నైలో సీపీఎం, సీపీఐ కార్యాలయాలకు వెళ్లారు. ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వామపక్షాల ఆఫీసులను విజయ్ సందర్శించడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో నలుగురు శుక్రవారం రాత్రి బెంగళూరుకు చేరుకోవడం గమనార్హం.
వీసీకే నాలుగు డిమాండ్లు
నూతన ప్రభుత్వంలో తమకు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని వీసీకే సీనియర్ నేత వన్నియరసు పట్టుబట్టారు. ఆ పార్టీ నాలుగు డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఒక కేబినెట్ మంత్రిపదవి ఇవ్వాలని, ఎస్సీల సంక్షేమం కోసం చట్టం తీసుకురావాలని, రెండు చోట్ల గెల్చిన విజయ్ ఒకచోట రాజీనామా చేసిన పక్షంలో అక్కడి నుంచి వీసీకే అధినేత తిరుమావళవన్ పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని తేల్చిచెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏదైనా కీలక శాఖ ఇచ్చేందుకు టీవీకే నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వీసీకే అధినేత తిరుమావళవన్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ నిమిత్తం ఆయన నివాసానికి వెళ్లడంతో కొత్త చర్చను తెరమీదకు వచ్చింది.
మరోవైపు విజయ్ పార్టీకి బయటి నుంచే మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో చేరే ఉద్దేశం లేదని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. డీఎంకేతో ప్రయాణం కొనసాగిస్తామని వెల్లడించాయి. బీజేపీ దొడ్డిదారిన తమిళనాడులోకి అడుగుపెట్టకుండా నిరోధించడానికే టీవీకేకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు కమ్యూనిస్ట్ నేతలు స్పష్టంచేశారు. పది రోజుల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా, ఐయూఎంఎల్ మద్దతును సైతం కూడగట్టేందుకు టీవీకే నేతలు ప్రయత్నించగా సానుకూల ఫలితం రాలేదు. తాము మొదటి నుంచీ డీఎంకేతోనే ఉన్నామని, వారితో చర్చించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఐయూఎంఎల్ తేల్చిచెప్పింది.

దినకరన్ కొత్త ఎత్తుగడ
ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామి అయిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ గవర్నర్ ఆర్లేకర్‌ను శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో కలవడం కొత్త చర్చకు దారితీసింది. తన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కామరాజర్ టీవీకేకు మద్దతు ఇచి్చనట్టుగా, ఆయన ప్రస్తుతం కనిపించకుండా పోవడం బట్టి చూస్తే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు బేరాలు సాగుతున్నాయని గవర్నర్‌కు వివరించారు. విజయ్ పదవీ కాంక్షతో ఉన్నారని, తమ ఎమ్మెల్యే అమ్ముడుపోయాడని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించాలని దినకరన్ కోరడం గమనార్హం. పళని స్వామికి సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. విజయ్ ప్రమాణ స్వీకారం సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో టీవీకే శ్రేణులు, అభిమానులు చెన్నైకి రావొద్దని టీవీకే కార్యాలయం నుంచి శుక్రవారం రాత్రి ఎస్‌ఎంఎస్‌లు వెళ్లాయి. నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి చేపట్టిన ఏర్పాట్లను నిలిపివేశారు.


